ఇలా అంటే ఏ సినిమా అంటారు ఎవరైనా. ఎందుకంటే వర్మ చేతిలో అన్ని సినిమాలు వుంటాయి. కొన్ని ట్వీట్లలో, కొన్ని సెట్లో, కొన్ని లాబ్ లో, ఇలా రకరకాలుగా. ఆ మధ్య అంతా కొండా సినిమా మీద హడవుడి చేసారు. ఇప్పుడు ఆ సినిమా ఏ స్థాయిలో వుందో ఎవరికీ తెలియదు. అలాగే మార్షల్ ఆర్ట్స్ మీద ఓ సినిమా చేసారు. అదెంత వరకు వచ్చిందో ఆయనకే తెలియాలి.
ఈ మధ్య నైనా గంగూలీ, అప్సర రాణి అనే ఇద్దరు హీరోయిన్లు వర్మకు దొరికారు. వాళ్లను చూపించాల్సినంత రేంజ్ లో చూపించడమే పనిగా పెట్టుకున్నారు. ఓ సాదా సీదా థ్రిల్లర్ కథకు లెస్బియన్ కలరింగ్ ఇచ్చి డేంజరస్ అనే టైటిల్ పెట్టి హడావుడి మొదలుపెట్టారు. ట్విట్టర్ లో లెస్బియన్ వీడియోలు వదలుతూ దానికి ప్రచారం మొదలు పెట్టారు.
ఇద్దరు హీరోయిన్లను వెంట పెట్టుకుని దేశం అంతటా తిరిగి ప్రచారం చేసారు. అంతా బాగానే వుంది. కానీ ఈ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శించేది లేదు అంటూ పివిఆర్, ఐనాక్స్ థియేటర్లు మొండికేసాయి. దీంతో వర్మ తన స్టయిల్ లో హడావుడి చేసారు కానీ ఫలితం లేకపోయింది. దాంతో సినిమాను వాయిదా వేసారు.
ప్రేక్షకులకు ఓ 'డేంజర్' తప్పింది.