ఒక పరారీలో ఉన్న నిందితుడు, అది కూడా ఒక మాజీ మంత్రి భర్త ఇన్నాళ్లు పాటు దొరకకపోవడం అనేది విడ్డూరమైన అంశమే. స్వయంగా ఆయన భార్య అరెస్టు అయ్యారు. ఆమె జైల్లో గడిపారు. వివిధ రకాలుగా బెయిల్ పిటిషన్లు వేసినా బెయిల్ మొదట దొరకలేదు.
చివరకు ఎలాగో బెయిల్ రావడంతో ఆమె బయటకు రాగలిగారు. అయితే తన భార్య అరెస్టు అయినా, ఆమె గర్భవతి అంటూ కుటుంబమే కోర్టు దృష్టికి తీసుకెళ్లినా.. ఆ భర్తకు మాత్రం బయటకు రావాలనిపించినట్టుగా లేదు!
అఖిలప్రియ భర్త తొందరగా దొరికి ఉంటే.. ఆమెకు మరింత త్వరగా బెయిల్ లభించేదేమో! అయితే.. తన భర్త జైల్లో ఉన్నా, తను మాత్రం పరారీలో ఉండటానికే ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా ఉన్నాడు భార్గవ్ రామ్.
ఈ క్రమంలో తాజాగా భార్గవ్ రామ్ కుటుంబం కోర్టును ఆశ్రయించిందట. అతడికి ముందస్తు బెయిల్ ను కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందట అతడి కుటుంబం. అయితే కోర్టు ఆ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి.
తను దొరకకుండా పరారీలో ఉంటూ.. ఈ కేసులో తన వాదన ఏదో కూడా వినిపించుకోవడానికి భయపడినట్టుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి అఖిలప్రియ భర్త ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు చేయడం విడ్డూరమే. ఇంతటి విడ్డూరం పట్ల కోర్టు కూడా ఘాటుగానే స్పందించినట్టుగా ఉంది. ముందస్తు బెయిల్ కు నో చెప్పి లొంగిపోవాలనే సందేశాన్ని అఖిలప్రియ భర్తకు ఇచ్చినట్టుగా ఉంది.
ఇక ఈ కేసులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పై కక్ష సాధింపుకు పాల్పడుతున్నాయని చెప్పుకొచ్చిన భూమా జగత్ విఖ్యాత్ కూడా ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పనిలో ఉన్నాడట.
మొదట్లో మీడియా ముందుకు వచ్చిన ఇతడు ఇప్పుడు తన ప్రమేయం పై పోలీసులకు ఆధారాలు దొరకగానే పరారీలో ఉన్నట్టున్నాడు. అందుకే ముందస్తు బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించాడట జగత్ విఖ్యాత్ కూడా. అయితే ఆ పిటిషన్ ను కూడా కోర్టు తిరస్కరించిందని తెలుస్తోంది.