తెలంగాణ ను వదిలేసినట్లే

మొత్తం మీద ఈ ఎన్నికలు ఓ క్లారిటీ ఇచ్చాయి. తెలంగాణను తెలుగుదేశం పార్టీ వదిలేసినట్లే. పదేళ్లు అవుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి. ఈ పదేళ్లలో తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు సార్లు ప్రయత్నించి బొప్పికట్టించుకోవడం…

మొత్తం మీద ఈ ఎన్నికలు ఓ క్లారిటీ ఇచ్చాయి. తెలంగాణను తెలుగుదేశం పార్టీ వదిలేసినట్లే. పదేళ్లు అవుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి. ఈ పదేళ్లలో తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు సార్లు ప్రయత్నించి బొప్పికట్టించుకోవడం తప్ప సాధించింది లేదు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. 

ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో వుండడం వల్ల సహజంగా వచ్చే వ్యతిరేకత కొంత కేసీఆర్ ను బాధిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు అసల సిసలు ప్రత్యామ్నాయం అవుతోంది అనుకున్న భాజపా సడెన్ గా నీరసపడిపోయింది. కాంగ్రెస్ పుంజుకుంటున్నా కుమ్ములాటలు విపరీతంగా వున్నాయి. ఇలాంటి టైమ్ లో తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది అని అంతా అనుకున్నారు.

తెలుగుదేశం కూడా ముందు కాస్త హడావుడి చేసింది. భాజపాను తమ వైపు లాక్కొవడానికి అన్నట్లుగా తెలంగాణలో బల ప్రదర్శనకు పూనుకుంది. కానీ ప్రదర్శన విజవంతమైనా ఫలితం అయితే ఇవ్వలేదు. భాజపా నుంచి ఎటువంటి స్పందన లేదు. మరోపక్క కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆ పార్టీని తెలుగుదేశం 2 గా మారుస్తున్నారనే మాటలు వినిపించాయి. దాంతో తెలగుదేశం పార్టీ మరింత నీరస పడింది. ఇలాంటి టైమ్ లో కూడా బాలకృష్ణ తెలంగాణ పార్టీ ఆఫీసులో హడావుడి చేసారు. పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ కూడా తెలంగాణలో పార్టీ పోటీ చేస్తుందని హడావుడి చేసారు.

కట్ చేస్తే ఇక ఇప్పట్లో అలాంటి అవకాశం లేదని క్లారిటీ వచ్చేసినట్లే. ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుతం జైలులో వున్నారు. ఆంధ్రలో పార్టీ వ్యవహారాలే చక్కదిద్దడానికి కిందా మీదా అవుతున్నారు. దసరాకు విడుదల చేస్తామన్న ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడం లేదని చెప్పేసారు. లోకేష్ యువగళం ఆపేసారు. ఆంధ్రలోనే ఇలా వుంటే తెలంగాణ ఎన్నికలు ఎదుర్కోవడం ఎలా సాధ్యం?

ఎక్కడ పోటీ చేయాలో లెక్కలు వేయాలి. అభ్యర్థులను నిలబెట్టాలి. వారికి ఇంతో అంతో డబ్బులు సర్దుబాటు చేయాలి. ప్రచారం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవేవీ సాధ్యం కావు. పైగా ఇన్ని చేసినా ఓడి పోతే పరిస్థితి దారుణంగా వుంటుంది. ఆంధ్ర ఎన్నికల మీద దాని ప్రభావం కచ్చితంగా పడుతుంది. పైగా సెటిలర్స్ లో ఓ వర్గం కాంగ్రెస్ ను బలంగా సపోర్ట్ చేస్తోంది. కాంగ్రెస్ ను తెలంగాణలో పవర్ లోకి తీసుకురావాలని బలంగా ప్రయత్నిస్తోంది. అందువల్ల కూడా తెలుగుదేశం ఈ ఎన్నికలను వదిలేసుకున్నట్లే.

కానీ తరువాత పరిస్థితి ఏమిటి? 2029 లో తెలంగాణ ఎన్నికలకు తెలుగుదేశం రాగలదా? కచ్చితంగా రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశం మద్దతు దారులంతా దాంతోనే జర్నీ చేస్తారు. తెలుగుదేశం మరి బలోపేతం కావడం కష్టం. భారాస గెలిస్తే ఇక తెలుగుదేశాన్ని అస్సలు ఎదగనివ్వదు. తెలుగుదేశం అనుకూలంగా వ్యవహరించే ఏ వర్గం అయితే ఇప్పుడు కాంగ్రెస్ కొమ్ము కాస్తోందో భారాస కు తెలియంది కాదు. అందువల్ల వన్స్ మరోసారి పవర్ లోకి వస్తే భారాస ఆ వర్గాన్ని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచుతుంది.

మొత్తం మీద ఈ ఎన్నికలతో వచ్చిన క్లారిటీ ఏమిటంటే నారా.. నందమూరి కుటుంబాలు హైదరాబాద్ ను వదలలేదు కానీ, వారి పార్టీ మాత్రం తెలంగాణను శాశ్వతంగా వదిలేసినట్లే.