ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఈసారి భారత్ లోనే జరుగుతోంది. ఆతిథ్య దేశం కప్ గెలుస్తుందనే సాంప్రదాయికమైన నమ్మిక ఒకటి ఉండనే ఉంది. నమ్మకాలను తలదన్నేలా.. ఇండియన్ క్రికెట్ టీమ్ మంచి ఫామ్ లో ఉంది. ఘనమైన జట్లు ఇంకా ఉన్నాయి. ఫామ్ లో ఉన్న జట్లు కూడా ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించినంత వరకు ఆ ఫామ్ లో నిలకడ కనబరుస్తున్న ఒకరిద్దరిలో భారత్ ఉంది. గట్టి జట్లను మాత్రమే కాదు, జెయింట్ కిల్లర్స్ గా తేలిన చిన్న జట్లను కూడా ఒకే తరహాలో ఓడించి.. ఇండియా టీమ్ తన ఫామ్ లో నిలకడను చాటిచెబుతోంది.
ఇంత సానుకూల వాతావరణం ఉన్నప్పుడు ‘కప్ మనదే’ అనుకోవడంలో తప్పేముంది. కోట్లమంది భారతీయ క్రికెట్ క్రీడాభిమానుల హృదయాల్లో దోబూచులాడుతున్న ఆశలకు అక్షరరూపమే.. ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘కప్ మనదే’!
ఒక బిస్కట్ల కంపెనీ కోసం భారత మాజీ కెప్టెన్ మహేద్ర సింగ్ ధోనీ ప్రకటన ఇస్తున్నాడు. తమాషాగా ఉన్న ప్రకటన అది. ‘దేని గురించైనా ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసు కదా.. అందుకే మాట్లాడొద్దు.’, ‘వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ కు ఉన్న విజయావకాశాలపై మాట్లాడొద్దు’ అని అంటున్నాడు. ఆయన చెప్పదలచుకున్నది ఏంటంటే.. ‘ఎక్కువగా ఒక విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. దిష్టి తగులుతుందిట. పోయినేడాది కూడా అందుకే కప్ దక్కలేదుట.
మనం మహేంద్ర సింగ్ ధోనీ సెంటిమెంటును కాదనలేం. అలాగని భారత క్రికెట్ జట్టు చండప్రచండమైన ఫామ్ లో ఉన్న ప్రస్తుత తరుణంలో మరోసారి మనవాళ్లు ప్రపంచకప్ ను ముద్దాడి.. భారత క్రీడాభిమానుల ముచ్చట తీర్చగలరనే ఆశను కూడా కాదనలేం. పది జట్లు తలపడుతున్న ఈ ప్రపంచకప్ టోర్నీలో కనీసం ఐదు జట్లయినా.. ఈసారి తాము తప్పకుండా కప్ పట్టుకుపోవాలనే పట్టుదలతోనే వచ్చి ఉంటాయి. మిగిలిన అయిదు జట్లు కూడా- మనం శక్తివంచన లేకుండా కష్టపడదాం.. అదృష్టం కూడా కలిసి వస్తే కప్ సొంతం చేసుకుందాం అనే ఆశతోనే వచ్చి ఉంటారు. అంతే తప్ప.. ఇతర జట్లకు రెండేసి పాయింట్లు అందించేసి వారిని స్కోరు బోర్డు మీద పైపైకి పంపించేసి.. తాము అనుభవం గడించుకుని తృప్తి పడదాం అనే పరిమిత ఆలోచనతో ఎవ్వరూ ఉండరు.
కప్ మనదే అనిపిస్తున్న ఫామ్!
భారత జట్టు ప్రస్తుతం బీభత్సమైన ఫామ్ లో ఉంది. ఇప్పటిదాకా టోర్నీలో జరిగిన మ్యాచ్ లలో మనవారి ప్రతిభా పాటవ ప్రదర్శనను గమనిస్తే ఈ అభిప్రాయమే కలుగుతుంది. ఇంత నిలకడైన ఫామ్ మరే జట్టులోను కనిపించడం లేదు. పైగా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లలో సమతూకంతో ఫామ్ కనిపిస్తోంది. జ్వరంగా కారణంగా తొలి రెండు మ్యాచ్ లకు దూరమైన శుభ్ మన్ గిల్ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఎలాంటి తడబాటు లేకుండా తన ఫామ్ ను తిరిగి అందుకుని చెలరేగుతున్నాడు. రోహిత్ శర్మ ఒక మ్యాచ్ లో విఫలం అయినప్పటికీ.. తనను హిట్ మ్యాన్ అని ఎందుకు అంటారో ప్రూవ్ చేసుకుంటున్నాడు. విరాట్ కోహ్లి సంగతి సరేసరి. రాహుల్ జట్టును ఆదుకోడానికి తాను మంచి ఫామ్ తో సిద్ధంగా ఉన్నానని నిరూపించుకుంటున్నాడు.
భారత జట్టు ఎంత సమతూకంతో ఉన్నదంటే.. తొలి రెండు మ్యాచ్ లలో ఇషాంత్ కిషన్ ప్రదర్శన కూడా బాగున్న నేపథ్యంలో.. మూడో మ్యాచ్ కు గిల్ అందుబాటులోకి రాగానే.. ఎవరిని తొలగించాలా? అందరూ మంచి ఫామ్ లోనే ఉన్నారు.. ఎవరిని వెనక్కు నెట్టి గిల్ ను తీసుకురావాలనేది పెద్ద మీమాంసగా మారడమే ఉదాహరణ. జట్టులోకి పునరాగమనం తర్వాత.. కెఎల్ రాహుల్ పెర్ఫార్మెన్స్ అపూర్వంగా ఉన్న నేపథ్యంలో అతనికే చోటు దక్కి ఇషాన్ కిషన్ ను ట్వెల్త్ మ్యాన్ చేశారు.
నిజానికి హార్దిక్ పాండ్య గాయంతో ఆస్పత్రి పాలవడం జట్టు అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశమే. అయితే ఒకవేళ న్యూజిలాండ్ తో మ్యాచ్ సమయానికి పాండ్య తిరిగి జట్టుకు అందుబాటులోకి రాలేకపోతే గనుక.. అది ఆలోచించాల్సిన విషయమే. రీప్లేస్ చేయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అనే విషయంలో చర్చ నడుస్తోంది. బ్యాటింగ్ పరంగా సూర్య కుమార్ యాదవ్, బౌలింగ్ లో షమి వెయిటింగ్ లో ఉన్నారు. అందరూ ఫామ్ లోనే ఉన్నారు. అందుకే తేల్చుకోవడం జట్టుకు కష్టమవుతోంది. అంతటి మంచి కూర్పుతో జట్టు ఉంది.
అందుకే అందరికీ ఈసారి కప్ మనదే అనే ఆశలున్నాయి. కానీ, ధోనీ సెంటిమెంటును గౌరవించి.. మన జట్టు కప్ గెలుచుకోగల అవకాశాల గురించి తక్కువమాట్లాడుకుని ఇతర అంశాల గురించి ఎక్కువ చెప్పుకుందాం.
జెయింట్ కిల్లర్లు ఆవిర్భవిస్తున్నారు..
జెయింట్ కిల్లర్ లు వెలుగులోకి వచ్చినప్పుడు సామాన్యుడికి కూడా అందులో ఒక మజా కనిపిస్తుంది. అసలైన ఆటను మాత్రమే ఆస్వాదించే మజా అది. చరిత్రలో పరిశీలిస్తే.. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అసెంబ్లీ లాబీల్లో ఉండగా.. ఓ కాంగ్రెసు ఎమ్మెల్యే ఆయన వద్దకు వచ్చి నమస్కారం పెట్టి పలకరించారు. ‘నమస్తే బ్రదర్’ అంటూ ప్రత్యుత్తరమించ్చిన ఎన్టీఆర్.. ‘ఎవరు మీరు? మీ పేరేమిటి?’ అని అడిగారు. అందుకు ఆయన ‘నా పేరు చిత్తరంజన్ దాస్ సార్.. కల్వకుర్తిలో మిమ్మల్ని ఓడించింది నేనే’ అని చెప్పారుట. అంటే , నందమూరి తారక రామారావు వంటి నాయకుడు.. కల్వకుర్తిలో తాను ఎవరితో పోటీచేస్తున్నానో కూడా గమనించుకోలేదు. ఆ అహంకారంతో ఆయన ఏకంగా ఓడిపోయారు. దాస్.. జెయింట్ కిల్లర్ అయ్యారు.
అలాంటి జెయింట్ కిల్లర్ జట్లు ఈ టోర్నీలో ఆవిర్భవించాయి. గత ప్రపంచకప్ చాంపియన్ గా ఆవిర్భవించిన ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన ఆఫ్గనిస్తాన్ పోరాటపటిమను మెచ్చుకోవాలి. అదే తరహాలో.. ఈ టోర్నీలో తొలినుంచి అరివీర భయంకరమైన ఫామ్ లో ఉన్నట్టుగా కనిపిస్తూ.. హాట్ ఫేవరెట్ లలో ఒకరు అవుతారని అందరూ అంచనా వేస్తున్న దక్షిణాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ గురించి కూడా ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. అనూహ్యమైన ఫలితాలతో ప్రేక్షకులను ఈ జట్లు రంజింపజేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ రికార్డు ఇంకోసారి నమోదవడం కష్టం!
ఇండియా- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత హైఓల్టేజీ మ్యాచ్ గా ఈ రెండుదేశాలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని మీద అందరికీ చాలా చాలా ఎదురుచూపులు, అంచనాలు ఉంటాయి. ఈ ఏడాది డిస్నీ హాట్ స్టార్ ద్వారా మూడున్నర కోట్ల మందికి పైగా వీక్షించారనేది ఒక రికార్డు. మనం ఆడే ఆటకు ఇంత క్రేజ్ ఉన్నదంటే సంతోషం అనిపిస్తుంది.
బాధాకరమైన అంశం ఏంటంటే.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ను ఒక ఆటలాగా చూసే అలవాటు చాలామందిలో కనుమరుగైపోయింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం లాగా ప్రతి ఆటను పరిగణించడం మామూలైపోయింది. స్టేడియంలో పాకిస్తాన్ క్రీడాకారులు భారత్ ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా మాట్లాడడాన్ని, మెలగడాన్ని కూడా సహించలేకపోతున్నారు. చివరకు కోహ్లి నుంచి బాబర్ ఆజం జెర్సీని కానుకగా తీసుకుంటే.. పరాయి దేశం వాడైన పాక్ జట్టు కోచ్ కూడా అసహనంతో రగిలిపోయారంటే, అనుచితమైన వ్యాఖ్యలు చేశారంటే.. ఈ రెండు దేశాల మధ్య పోటీని ఎంత అవాంఛనీయమైన ధోరణిలోకి మార్చేస్తున్నారో మనకు అర్థమవుతుంది.
ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉన్నప్పుడు సహజంగానే భావోద్వేగపరమైన ఉత్కంఠ ఉంటుంది. అందుకే మూడున్నర కోట్ల కనెక్షన్ల ద్వారా ఆన్ లైన్ లో మ్యాచ్ వీక్షించారు. ఇప్పటికి ఇదే పెద్ద రికార్డు. అయితే.. ఈ రికార్డు మరోసారి రిపీట్ కావడం కష్టం అని పలువురు క్రీడాభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ కప్ కు సంబంధించినంత వరకు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ అనే అభిప్రాయం క్రీడావర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ చాలా వెనుకబడి ఉంది. ప్రస్తుతానికి భారత్, న్యూజిలాండ్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న ఫామ్ లో సెమీస్ చేరడం చాలా కష్టం అనే అభిప్రాయమే పలువురిలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ రిపీట్ కాదు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా వీక్షకుల రికార్డు ఇంతగా ఉండకపోవచ్చు అనేది అంచనా.
దిగజారుడు ప్రకటనలు..
పాక్ కోచ్ ఒక రకంగా అనుచితంగా ప్రవర్తిస్తే భారత్ తరఫున బహుశా బీసీసీఐ రూపొందించిన ప్రకటనలు చాలా అనుచితమైన రీతిలో రూపొందాయి. భారత్ కు ఇతర జట్లతో మ్యాచ్ ఉన్నప్పుడు.. దానికి ముందు రెండు మూడు రోజుల పాటు.. ఆ రెండు దేశాల మధ్య మ్యాచ్ గురించి ప్రత్యేకంగా రూపొందించిన యాడ్ లను టీవీల్లో ప్రసారం చేస్తూ వచ్చారు.
అయితే.. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లతో మ్యాచ్ ల సందర్భంగా రూపొందించిన ప్రకటనలు చాలా దిగజారుడుతనంతో ఉన్నాయి. ఆయా దేశాలను కించపరిచేలా ఉన్నాయి. పోనీ.. అదే తమ థీమ్ లాగా యాడ్స్ రూపకర్తలు చేశారని అనుకోవడానికి వీల్లేదు. న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ముందు మాత్రం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రకటనలు రూపొందించారు. ఈ ప్రపంచకప్ మొదలైనప్పటినుంచి అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్న దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఉంది. అందుకే, వారితో మ్యాచ్ లో ఫలితం ఎటైనా ఉండవచ్చుననే భయంతో.. అతికి పోకుండా యాడ్ రూపొందించినట్టుగా కనిపిస్తోంది.
ఆటను ఎప్పుడూ కూడా క్రీడాస్ఫూర్తితోనే చూడాలి. కప్ మనదే కావాలని మనం కోరుకోవడం తప్పు కాదు. కానీ.. మన జట్టు ప్రతిభకు తగ్గట్టుగా అది దక్కాలని కోరుకోవాలే గానీ.. మన ఆశలకు ప్రతిరూపంగా కావాలనుకోకూడదు. అన్నింటినీ మించి మంచి క్రికెట్ ను ఆస్వాదించడానికి మనం ఎన్నడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడే వరల్డ్ కప్ టోర్నమెంటు ద్వారా క్రీడాభిమానులకు పంచిపెట్టాల్సిన క్రీడాస్ఫూర్తి సార్థకం కాదు.
..ఎల్. విజయలక్ష్మి