తెలుగుదేశం సినిమాలో బాలయ్య హీరో కాదు

మొత్తం మీద మరోసారి క్లారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నందమూరి వారిది కాదు.. నారా వారిదే అని. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు.. స్పందించలేదు అంటూ అతని మీద విరుచుకుపడే జనాలు, అసలు అన్ని విధాల…

మొత్తం మీద మరోసారి క్లారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నందమూరి వారిది కాదు.. నారా వారిదే అని. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు.. స్పందించలేదు అంటూ అతని మీద విరుచుకుపడే జనాలు, అసలు అన్ని విధాల స్పందించిన బాబాయ్ బాలకృష్ణ పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించాలి. 

రాజమండ్రి వెళ్లారు. బావను కలిసారు. హడావుడి చేసారు. పవన్ పొత్తు ప్రకటన చేసినపుడు అక్కడే వున్నారు. పార్టీ ఆఫీసులో కాస్త హల్ చల్ చేసారు. ఆ తరువాత అక్కడి నుంచి మాయమై హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ ఇన్ చార్జ్ అన్నారు. ఇదేంటీ కొత్తగా, ఈ సమయంలొ. కొంపదీసి తెలంగాణ ఎన్నికల్లో నిజంగానే పోటీ చేస్తారా అనుకున్నారు అంతా. కట్ చేస్తే, అర్థం అయింది. బాలకృష్ణ పాత్ర తెలుగుదేశం రాజకీయాల్లో జస్ట్ ఓ ఎమ్మెల్యేగా మాత్రమే అని.

తెలుగుదేశం అనే పార్టీలో బాలకృష్ణది హీరో పాత్ర కాదు. కనీసం హీరోతొ సమానమైన పాత్ర కూడా కాదు. జస్ట్ ఓ చిన్న క్యారెక్టర్ నటుడు మాత్రమే అనుకోవాలి. ఈ రోజు రాజమండ్రి లో పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. అటు పవన్.. ఇటు లోకేష్ కలిసి ఉమ్మడి కార్యాచరణకు పూనుకుంటున్నారు. డిస్కస్ చేయబోతున్నారు. చంద్రబాబు లోపల వున్నారు. మరి ఈ సమావేశానికి బాలయ్య కు ఆహ్వానం అందిందా? అలా అని వార్తలు అయితే వినిపించలేదు. మరి బాలయ్య వస్తే ఆ పార్టీలో ఆయనకు కూడా కాస్తో.. కూస్తో మంచి పాత్ర వున్నట్లు. లేదంటే లేనట్లు. ఎందుకంటే ఆ కార్యాచరణ కమిటీలో కూడా బాలయ్యకు స్థానం ఇవ్వలేదు.

అంటే లోకేష్ పాటి రాజకీయ అనుభవం బాలయ్యకు లేదా? బావ చంద్రబాబుకు పార్టీ ఇచ్చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. లేదా కల్పించారు. లక్ష్మీపార్వతి అనే బూచిని చూపించి పార్టీని స్వంతం చేసుకున్నారు చంద్రబాబు. నిజానికి ఆ రోజున లక్ష్మీ పార్వతితో చంద్రబాబుకు సమస్య కానీ బాలకృష్ణ అండ్ బ్రదర్స్ కు కాదు. ఎందుకంటే ఆ రోజున బాలకృష్ణ కు వున్న అధికారాలూ లేవు. ప్రాముఖ్యతా లేదు. కనీసం తండ్రి దగ్గర అభిమానమన్నా వుండేది. ఇప్పుడు పార్టీ బావ చేతుల్లోకి వెళ్లిపోయాక వచ్చి పడిన కొత్త ప్రాముఖ్యత ఏమీ లేదు.

కానీ ఇవన్నీ బాలకృష్ణకు తెలియవు అనుకోవడానికి లేదు. ఆయన వేదిక మీద మాట్లాడడానికి కిందా మీదా పడినా, తడబడినా, ఆయన ఆలోచనలను, అవగాహనను తక్కువ అంచనా వేయడానికి లేదు. అయినా అన్నీ తెలిసి కూడా భరిస్తున్నారు అంటే ఆయనను రెండు విధాల కట్టిపడేసారు చంద్రబాబు ముందుగానే. ఒకటి.. బాలయ్య కూతుర్ని తన కోడలిని చేసుకుని, రెండు.. కోడెల శివప్రసాద్ ను తెలివిగా పక్కకు తప్పింది, బసవతారకం పగ్గాలు బాలయ్య చేతిలో పెట్టి. అందువల్ల తెలుగుదేశం పార్టీ సినిమాలో ఇక బాలకృష్ణ పాత్ర ఇంతకే పరిమితం అనుకోవాలి.

అన్నట్లు రాజమండ్రి యవనిక మీద లోకేష్ తోడల్లుడు భరత్, బ్రాహ్మిణి సోదరి తేజస్విని లను ఎక్కడన్నా చూసారా? అక్కడ మాత్రం పక్కా తండ్రి బాటలో నడుస్తున్నారు లోకేష్.