ఫ్లాపులతో సంబంధం లేని పారితోషికాలు

సినిమా హీరోల పారితోషికాలు నిర్మాతలను ఒక పక్క కలవరపెడుతూనే వున్నాయి. కానీ నిర్మాతలు పెద్ద సంఖ్యలో వుండడం, హీరోలు రెండు డజన్ల మంది వుండడం, ఏడాదికి 150 సినిమాలు తీసే పరిస్థితి వుండడంతో పారితోషికాలు…

సినిమా హీరోల పారితోషికాలు నిర్మాతలను ఒక పక్క కలవరపెడుతూనే వున్నాయి. కానీ నిర్మాతలు పెద్ద సంఖ్యలో వుండడం, హీరోలు రెండు డజన్ల మంది వుండడం, ఏడాదికి 150 సినిమాలు తీసే పరిస్థితి వుండడంతో పారితోషికాలు ముందుకే తప్ప వెనక్కు వెళ్లడం లేదు.అసలు పారితోషికాలు పెరుగుతున్న తీరు, ఇస్తున్న వైనం, తీస్తున్న సినిమాలు అన్నీ కాస్త ఆశ్చర్యంగానే వున్నాయి. పారితోషికాలకు సినిమాల హిట్ ఫ్లాపులకు సంబంధం వుండడం లేదు. తీస్తున్న వారు తీస్తూనే వున్నారు. పోతున్న డబ్బులు పోతూనే వున్నాయి. పెరుగుతున్న పారితోషికాలు పెరుగుతూనే వున్నాయి.

కరోనా ముందు మిడ్ రేంజ్ లో టాప్ హీరో అంటే ఎనిమిది.. తొమ్మిది కోట్లు రెమ్యూనిరేషన్. పాతిక నుంచి ముఫై కోట్లు బడ్జెట్. కానీ ఇప్పుడు పాతిక కోట్ల రెమ్యూనిరేషన్, డెభై నుంచి ఎనభై కోట్ల బడ్జెట్. ఇక, మిడ్ రేంజ్ లో కిందన వున్న హీరో రెమ్యూనిరేషన్ ఒకప్పుడు మూడు నుంచి నాలుగు కోట్లు. సినిమా బడ్జెట్ 15 కోట్లు. ఇప్పుడు ఎనిమిది నుంచి 13 కోట్లు. బడ్జెట్ ముఫై కోట్లకు పైగానే. ఏ రేంజ్ హీరోకి తగినట్లుగానే ఆ రేంజ్ పెరుగుదల కనిపిస్తోంది. అటు రెమ్యూనిరేషన్ లో, ఇటు బడ్జెట్ లో.

గమ్మత్తేమిటంటే ఈ పెరుగుదలకు సినిమాల ఫ్లాపులకు, నిర్మాతల నష్టాలకు అస్సలు సంబంధం లేదు. ఓ మిడ్ రేంజ్ హీరో గత అయిదేళ్లలో పది సినిమాలు చేస్తే గట్టెక్కేసాం అనుకున్నవారే తప్ప మంచి లాభాలు తిన్న నిర్మాత లేరు. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం అయిదేళ్లలో తొమ్మిది కోట్ల నుంచి పాతిక కోట్లకు చేరిపోయింది. బడ్జెట్ కూడా దానికి అనుగుణంగానే.

ఓ సీనియర్ హీరో గత అయిదారేళ్లలో డజను సినిమాల వరకు చేస్తే హిట్ అయిన సినిమాలు మూడు నాలుగు మాత్రమే. మిగిలిన వారంతా దారుణమైన నష్టాలు చవి చూసిన వారే. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం పన్నెండు కోట్ల నుంచి పాతిక కోట్లకు చేరిపోయింది.

ఓ చిన్న హీరో వున్నారు. కోటి రూపాయల రెమ్యూనిరేషన్ వుండేదేమో.. ఒక్క హిట్ పడింది చాలా అంటే చాలా సినిమాల తరువాత. ఇప్పుడు రెమ్యూనిరేషన్ మూడు కోట్ల నుంచి అయిదు కోట్లు చెబుతున్నారని వినిపిస్తోంది.

మరో చిన్న హీరో. ఒకటి, మహా అయితే రెండు హిట్ లు. అంతే తప్ప లెక్క పెట్టడానికీ అవకాశం లేదు. అయిదు కోట్లు రెమ్యూనిరేషన్. ఒకప్పుడు నాలుగు నుంచి అయిదు కోట్లు తీసుకునే మిడ్ రేంజ్ హీరో వున్నారు. ఓ శాటిలైట్ చానెల్ పుణ్యమా అని ఓ లాభసాటి ప్రాజెక్ట్ సెట్ అయింది. ఎనిమిది కోట్లు తీసుకున్నారు. అదే ఎక్కువ అనుకుంటే ఓ హిట్ పడింది. 13 కోట్లకు చేరిపోయింది రెమ్యూనిరేషన్.

వయసు ముదిరిపోతున్న ఓ మిడ్ రేంజ్ హీరో వున్నారు. ఫ్లాపుల పరంపర లెక్క పెట్టుకోవాల్సిందే. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం పది కోట్లు. అటు సీనియర్ ఇటు జూనియర్ కానీ మాస్ హీరో వున్నారు. హిట్ సినిమా అంటే వెదకాల్సిందే. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం ఏడు కోట్లకు పైగానే.

టాప్ సీనియర్ హీరోల్లో ఇద్దరు కాస్త రీజనబుల్ గానే తీసుకుంటున్నారు. మరొకరు తన మార్కెట్ కు అనుగుణంగానే తీసుకుంటున్నారు సమస్య లేదు అనుకోవాలి. కానీ ఒకరు మాత్రం యాభై కోట్లు కోట్ చేస్తున్నారు. నిర్మాతల పరిస్థితి చెప్పనక్కరలేదు.

ఇలా ఫ్లాపులతో సంబంధం లేకుండా రెమ్యూనిరేషన్ల పైకే వెళ్తూ వుండడానికి సింగిల్ రీజన్ నాన్ థియేటర్ రైట్స్. తెలుగు సినిమాలకు నాన్ థియేటర్ రైట్స్ బాగా రావడం వల్లనే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. హిందీ డబ్బింగ్, తెలుగు శాటిలైట్ రేట్లు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఓటిటి రేట్లు మాత్రం ప్రస్తుతానికి ఫరవాలేదు. తరువాత ఎలా వుంటుందో తెలియదు. అప్పుడు కూడా ఇవే రెమ్యూనిరేషన్లు అంటే మాత్రం కష్టమేనేమో?