బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మళ్లీ కాంగ్రెస్‌పై ప్రేమ పుట్టిందనే ప్రచారం ఊపందుకుంది. బీజేపీపై కొన్ని నెలలకే మొహమెత్తినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరోసారి ఆయన జంపింగ్‌కు సిద్ధమయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొట్టి పారేయడం లేదు. మౌనం అర్ధంగీకారమా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక పెద్ద సమయం కూడా లేదు. కేవలం 37 రోజుల గడువు మాత్రమే వుంది. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోగా, బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే వాతావరణం నెలకుంది. బీజేపీలోకి అసలు చేరికలే లేవు. ఇంకా ఆ పార్టీ నుంచే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి.
ఆరు నెలల క్రితం వరకు తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే వాతావరణం ఉండేది. కర్నాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణపై ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారం ఆ రెండు పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో బీఆర్ఎస్‌ను వ్యతిరేకించే బీజేపీ నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి, మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పునరాలోచనలో పడ్డారు. తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికి చేరొచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కండువా కప్పుకునేందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
రాజగోపాల్‌రెడ్డి అన్న వెంకటరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరి మరోసారి మునుగోడు నుంచి తలపడేందుకు రాజగోపాల్‌రెడ్డి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి చేరిక కాంగ్రెస్‌కు బలాన్ని ఇవ్వడంతో పాటు బీజేపీని బలహీనపరుస్తుందనే చర్చకు తెరలేచింది.