మన జీవితాలకు ధన కనక వస్తు వాహనాదుల సంపద ఏదీ ఇవ్వలేని ధైర్యాన్ని, భరోసాను.. అవేవీ అందివ్వగల స్తోమత, తాహతు లేని ఒక వ్యక్తి ఇవ్వగలడు. ఆ వ్యక్తి- సంపదలే కాదు కదా.. ఎలాంటి బలమూ, ఘనతా లేని వారైనా సరే! క్లిష్టత మనల్ని చుట్టుముట్టినప్పుడు.. కాకుల్లా పొడవడం అలవాటైన ప్రపంచం పొంచి ఉంటుంది. మన ఆలోచన, సమాజపు సహజ పోకడలకు భిన్నమైనదైనప్పుడు, మనం దాని పరిణామాలు, దూషణ తిరస్కారాల గురించిన సంశయావస్థలో ఉన్నప్పుడు, అది సరైనదేననే విశ్వాసాన్ని మనలో పెంచుతూ వెంటనిలిచే ఒక్కరుంటే చాలు! జీవితం అద్భుతంగా, వర్ణమయంగా ఉంటుంది.
= = =
‘ఆదర్శిని’ అనే చిన్న పత్రిక సంపాదకత్వం, ప్రచురణ, నిర్వహణ బతుకుతెరువుగా గల కుటుంబంలో పుట్టాను నేను. ఏది రాస్తే అది పత్రికలో అచ్చు కావడమూ, అది కవితో మరొకటో అనుకుంటూ పెరగడమూ అలవాటైంది. ఇతర చిన్న పత్రికలలో కూడా చాలా కవితలు, రచనలు రావడం మొదలయ్యాక.. ఒక దశలో రచన పట్ల వైమనస్యం ఏర్పడింది. ఏదో మనకు తోచింది రాసేసి, అందరూ దానిని చదివి, మనల్ని కీర్తించాలనే కోరిక పట్ల ఏర్పడిన వైమనస్యం అది. Writing is an act of Ego అని సిద్ధాంతీకరించిన అమెరికన్ జర్నలిస్టు, రచయిత విలియం జిన్సర్ మాటలు అప్పటికి తెలియకపోయినా, ఆ భావం అనుభవంలో ఉండేది. వెరసి, ప్రధాన స్రవంతి మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పని నేర్చుకోవడం మొదలయ్యాక కథలో, కవితలో రాసే ఆసక్తి బాగా తగ్గిపోయింది. వాటివల్ల ఎవ్వరూ మారరు, ఎవరి సొంత ఆలోచనలు వారికి చాలా గట్టిగానే ఉంటాయి. వాటిని మార్చగల శక్తి సాహిత్యానికి లేదనే నిరాశ ఉండేది. నా ఆలోచన తప్పని చాలా ఘాటుగా తెలియజెప్పిన మొదటి పుస్తకం రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’! తర్వాత ఆ నమ్మకం క్రమంగా నేటివరకు బలపడుతూనే ఉంది. చదువుతున్నవి, రాస్తున్నవి ఆ నమ్మకాన్ని నిలబెడుతున్నాయి. ఆ పుస్తకం వ్యక్తిగా నా ఆలోచనల్ని, సాహిత్యం సాధించగల ప్రయోజనాల పట్ల నా అభిప్రాయాలను సమూలంగా మార్చేసింది. నేను ‘జానకి విముక్తి’ ప్రభావంలో ఉన్న ఆ రోజుల్లోనే నా స్నేహబృందంలో ఒక ఇబ్బంది ఎదురైంది.
నా కాలేజీ స్నేహితురాలికి పెళ్లయింది. భర్త పరమ దుర్మార్గుడు.. ఒక కూతురు కూడా పుట్టిన తర్వాత, భార్యను హాల్లో ఉంచి అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చి వ్యభిచరించే బాపతు. భార్యను దారుణంగా కొట్టి హింసించే వ్యక్తి. ఆ హింస భరించలేక ఆ అమ్మాయి కూతురు సహా కొన్నాళ్లు పుట్టింటికి వచ్చి ఉంది. ఆ సమయంలో నేను ‘జానకి విముక్తి’ పుస్తకాన్ని మరో స్నేహితురాలి ద్వారా ఆమెకు చేర్చాను. చదివింది. తన వెతలు, ఆలోచనలు, ధైర్యం చిక్కబడ్డాయి. నిశ్చింతగా విడాకులు తీసేసుకుంది. ఆ పుస్తకమే తనకు ఆ ధైర్యం ఇచ్చిందని చెప్పింది. అప్పటిదాకా కొన్నేళ్లుగా హింసను అనుభవిస్తూ కూడా, విడిపోయే ఆలోచనకు భయపడుతూ వచ్చిన ఓ సాధారణ మధ్యతరగతి మహిళ ఆమె. ‘జానకి విముక్తి’ ఇచ్చిన చైతన్యానికి మించి.. అత్యంత గొప్ప విషయం ఏంటంటే, ఆమెకు కుటుంబం తనకు అండగా నిలిచింది. తర్వాత కొంత కాలానికి ఇంకో పెళ్లి చేసుకుని ఇప్పుడు అద్భుతమైన జీవితాన్ని గడుపుతోంది.
ఇంకొక ఉదాహరణ చెబుతాను. ‘ఈనాడు’ చిత్తూరు జిల్లాకు ఇన్చార్జిగా ఉండగా, మేం ప్రచురించే కొన్ని వార్తలు సిగ్గు పడేలా చేస్తుండేవి. ‘ఇద్దరు పిల్లల సహా తల్లులు చనిపోయే’ వార్తలు ఒక కాలవ్యవధిలో చాలా ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. ‘పొలాల్లోని వ్యవసాయ బావివద్దకు బట్టలు ఉతుక్కోవడం కోసం ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని మహిళ వెళ్లింది. ఆడుకుంటూ పిల్లలు బావిలో పడ్డారు. ఆమెకేకలు వేసినా, కాపాడేందుకు సమీపంలో ఎవరూ లేరు. తానుకూడా దూకేసింది. ముగ్గురూ చనిపోయారు’ అనేదే ప్రతివార్తలోని సారాంశం. లేకపోతే, కడుపు నొప్పి తాళలేక ఇద్దరు పిల్లల సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని ఉండేది. అన్ని చావుల వార్తలూ ఇలాగే ఉండేవి. మేం ప్రచురిస్తున్న వార్త అబద్ధం అని మాకు తెలుసు. అత్తింటి వేధింపులు భరించలేక జరిగే ఆత్మహత్యలని, కొండొకచో హత్యలని తెలిసినా.. ఆ విషయం పత్రికలో ధైర్యంగా చెప్పే వెసులుబాటు తక్కువ. పోలీసు రికార్డుల ప్రకారమే వార్త ఉండాలి. నిజాలు చెప్పగల గతిలేనితనం మధనానికి గురిచేస్తుండేది.
అప్పట్లో నేను ‘తోటకాడ బావి’ అనే కథ రాశాను. భర్త దుర్మార్గాన్ని భరించలేకపోయిన మహిళ, నన్ను బాధపెట్టిన అనేక వార్తల్లోలాగానే, ఇద్దరు పిల్లల సహా ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ ఆ తుదినిర్ణయం లోగా, తన పుట్టింటి వారిని, ఎరిగిన వారిని తనకు అండగా నిలవడం గురించి ఎంతో బతిమాలుతుంది. తను ఎవ్వరికీ భారంగా ఉండబోనని, తాను కూలికి వెళ్లి పిల్లల్ని పోషించుకోగలనని, కాకపోతే భర్తనుంచి వేరు పడి, ఒంటరిగా బతకడానికి కాస్తంత అండగా ఉంటే చాలునని ప్రాధేయపడుతుంది. వారంతా సాంఘిక కట్టుబాట్లను ఏకరవు పెట్టి, ఆమెను అనివార్యతలోకి నెట్టేస్తారు. వేరే గతిలేనితనం వల్ల ఆమె ఇద్దరు పిల్లలను అర్ధరాత్రి వేళ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి, వారిని అందులో తోసేసి, తానుకూడా దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
= = =
సొంత కుటుంబం అండగా ఉంటే- ఉండకపోతే.. భర్త దుర్మార్గాలకు బలయ్యే ఆడవాళ్ల ఉదాహరణలు ఈ రెండూ! కానీ, భర్త దుర్మార్గాలను సహించలేక విడాకులు కోరుకున్న మహిళ, ఆమె సొంత కుటుంబం ఎంత గొప్పగా, తార స్థాయిలో అండగా ఉండగలుగుతుందో తెలియజెప్పే సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగింది.
రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి గత ఏడాది తన కూతురు సాక్షి కి, సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించాడు. అయితే కొన్నాళ్లకే సాక్షికి భర్తనుంచి, అత్తింటివారినుంచి విపరీతమైన వేధింపులు ప్రారంభమయ్యాయి. సచిన్‌కు అంతకుముందే మరో పెళ్లయిందని కూడా తెలిసింది. అయినా, సర్దుకుపోయి వివాహబంధం కొనసాగించాలని సాక్షి అనుకున్నప్పటికీ, వేధింపులు శృతిమించిపోయాయి. అప్పుడిక గతిలేక తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది. సంఘంలో పరువునష్టం అని వారు ఆమెకు నచ్చజెప్పి అత్తింటికి తోలే ప్రయత్నం చేయలేదు. వివాహబంధానికి వీడ్కోలు పలకాలనుకున్న ఆమె నిర్ణయానికి అండగా నిలిచారు. సంఘంలోని కాకుల గురించి వారు ఆలోచించలేదు. ఆమెకు విడాకులు ఇప్పించారు. ప్రేమ్ గుప్తా ఎలాంటి వారంటే.. తాము ఆమెకు అండగా ఉన్నామని ప్రపంచానికంతా ఘనంగా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. విడాకుల తర్వాత అత్తింటినుంచి సాక్షిని తీసుకురావడానికి ఘనమైన ఏర్పాట్లు చేశారు. బాణసంచా కాలుస్తూ, డప్పులు మేళతాళాలు పెట్టి మరీ ఆమెను పుట్టింటికి తీసుకువచ్చారు. ఒకవైపు అత్తింటివారు అరుపులు కేకలతో రచ్చ చేస్తుండగానే సాక్షి చిరునవ్వుతో, చాలా ధైర్యంగా వచ్చేసింది.
ప్రేమ్ గుప్తా చేసిన పనిని దుర్మార్గంగా, సాంప్రదాయ భ్రష్టత్వంగా ఎవరైనా తూలనాడితే దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. కొందరికి ఈ పని అతిశయంగా అనిపించవచ్చు గానీ నిందార్హం మాత్రం కాదు. వివాహం అంటే కట్టుబానిసత్వానికి మరో రూపమని భావించే ఆలోచనలు ఇంకా పదిలంగా ఉన్న సమాజంలో ఎంతో అవసరం కూడా. ఇది ఒక విచిత్రమైన వార్తగా, విభిన్నమైన వార్తగా పత్రికల్లో లోపలి పేజీల్లో చోటు సంపాదించుకుంది. నిజానికి, మారుతున్న సామాజిక వాతావరణంలో చైతన్యానికి దర్పణంగా మొదటిపేజీలో, కనీసం సూచికతో అయినా ప్రచురించాల్సిన వార్త అని నాకు అనిపించింది.
ఇలాంటి అండ ఉండాలనే నా తాపత్రయం కేవలం భర్తను వదిలేయదలచుకున్న, విడాకులు తీసుకోదలచిన మహిళల గురించి మాత్రమే కాదు. సమాజం అలవాటుచేసిన పోకడలకు భిన్నంగా, ధిక్కారంగా అడుగులు వేస్తున్న ఎవరికైనా సరే ఇలాంటి అండ అవసరం. దీనికి ఆడ- మగ తేడా లేదు! బాధలు అనుభవించకుండా ఎవ్వరూ ఏ తీవ్ర నిర్ణయమూ తీసుకోరు. వారికి దన్నుగా నిలవడం ఆప్తులు చేయాల్సిన పని. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి, సొంతంగా తన కాళ్ల మీద బతకదలచుకుంటే.. వారికి అండగా నిలిచే ప్రయత్నం చేయాలి. ముందే చెప్పుకున్నట్టు ధనకనక వస్తు వాహనాదులు సమకూర్చే పని లేదు. ప్రోత్సాహంగా ఒక మాట చెప్పగలిగి, అంతర్మధనాన్ని పంచుకోవడానికి కొంత సమయం ఇవ్వగలిగితే చాలు. నా ‘తోటకాడ బావి’ కథలోని నాయిక బతుకును కబళించిన నైరాశ్యం, అసహాయత అందరి జీవితాల్లోంచి దూరంగా పారిపోతాయి.
సాహిత్యం మాత్రమే కాదు.. సమాజంలో పరిణామాలు కూడా మన ఆలోచనలను, బుద్ధులను ప్రభావితం చేస్తూ ఉంటాయి. పుట్టుకతో ఎవ్వరూ కూడా పరిణత మనస్కులై ఉండరు. తప్పుడు ఆలోచనలు, బుద్ధులు ఉన్నవారు ఆజన్మాంతమూ అలాగే ఉండిపోతారని అనుకోవడం కూడా భ్రమ. సాంప్రదాయంగా, అనువంశికంగా ఉన్న అలవాట్లు, గమనిస్తూ వస్తున్న పోకడలు కొందరిని సరైన దారి ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ఉంచవచ్చు గాక. కానీ వారిలో.. పైన చెప్పుకున్నట్టు సామాజిక పరిణామాలు, అలాంటి పరిణామాలను- పదిమంది దృష్టికి తీసుకువెళ్లే వార్తలూ, ప్రతిబింబించే సాహిత్యమూ ఖచ్చితంగా మార్పు తీసుకువస్తాయి. కాబట్టి, పెడబుద్ధులతో ఉన్నవారిని నిందించాల్సిన అవసరం లేదు. బుద్ధిని మార్చగల అంశాలను వారి దృష్టికి, సరైన రీతిలో తీసుకువెళ్లే ప్రయత్నం ఏదో ఒక వైపు నుంచి జరగాలని కోరుకోవాలి.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
[email protected]