ఇది కదా జగన్ సైన్యం అంటే..!

మంత్రి పదవి పోతోందనే బాధ అందరిలోనూ ఉంది. సీనియర్లలో కూడా తమని ఎందుకు పక్కనపెడుతున్నారనే భావన ఉంది. కానీ ఎవరూ బయటపడటం లేదు. జగన్ ని పల్లెత్తు మాట అనడంలేదు.  Advertisement తమ సహచరుల…

మంత్రి పదవి పోతోందనే బాధ అందరిలోనూ ఉంది. సీనియర్లలో కూడా తమని ఎందుకు పక్కనపెడుతున్నారనే భావన ఉంది. కానీ ఎవరూ బయటపడటం లేదు. జగన్ ని పల్లెత్తు మాట అనడంలేదు. 

తమ సహచరుల అదృష్టానికి కుళ్లుకోవడం లేదు. అంతా సైలెంట్ గా జరుగుతోంది, స్మూత్ గా బాధ్యతల బదిలీ జరుగుతోంది. ఎ-టీమ్ గౌరవంగా తప్పుకుంటోంది. బి-టీమ్ రంగంలోగి దిగుతోంది. 

ఇంకేదైనా పార్టీలో అయినా, వేరే ఏదైనా రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిణామం జరిగి ఉంటే ఈపాటికే రచ్చ రచ్చ జరిగేది. సీనియర్లంతా గూడుపుఠాణీ పెట్టి తిరుగుబాటు జెండా ఎగరేసేవారు. ఈపాటికి అంతా ఫామ్ హౌజులకు, ఫైవ్ స్టార్ హోటల్స్ కు వెళ్లి క్యాంపు రాజకీయాలు షురూ చేసేవారు. కానీ ఇక్కడున్నది జగనన్న సైన్యం, వైఎస్ఆర్ అభిమాన గణం. అందుకే ఎక్కడా ఎలాంటి తేడాలు లేవు.

మంత్రి పదవి కంటే అదే ముఖ్యం..

మంత్రి పదవి కంటే వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగడమే అందరికీ ఇష్టం. మంత్రి పదవి లేకపోయినా ఎవరూ పెద్దగా బాధపడట్లేదు. పోనీ తమ అధికారం పోతుందని బాధ ఉన్నా ఎవరూ బాధపడట్లేదు. దీనికి కారణం.. 2024 తర్వాత తమకి మరో ఛాన్స్ ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. మరో రెండేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే, 2024లో అధికారంలోకి వచ్చాక మళ్లీ మంత్రి పదవుల్లోకి రావచ్చనే ఆశ అందరిలో ఉంది. అందుకే నేతలంతా రాజీనామాలకు సిద్ధపడ్డారు.

ఇదే మా చివరి సమావేశం అంటూ ఇప్పటికే చాలామంది మంత్రులు అధికారులకు హింట్ ఇచ్చేశారు. మంత్రి పదవుల్లో నుంచి దిగిపోయే సమయంలో అందరికీ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాలను కూడా ముగించారు. జగన్ ప్రకటన కోసమే వేచి చూస్తున్నారు. ఈరోజు చాలామంది మంత్రులు రాజీనామాలు సమర్పించబోతున్నారు. ఆ తర్వాత మిగతా పనులన్నీ చకచకా మొదలవుతాయి.

కొత్త లిస్ట్ ఇంకా బయటకు రాకపోవడంతో ఆ సందడి మొదలు కాలేదు. ప్రస్తుతానికి మాజీలవుతున్న మంత్రుల భావోద్వేగాల సమావేశంగా చివరి కేబినెట్ భేటీ మిగిలిపోతుంది. జగన్ మాటే శిరోధార్యంగా మంత్రులంతా మారు మాట లేకుండా రాజీనామాలకు సిద్ధపడటం పార్టీలో క్రమశిక్షణ, జగన్ పై ఉన్న నమ్మకానికి మారుపేరుగా నిలుస్తోంది. అందుకే “జగన్ సైన్యం” అనే పేరొచ్చింది.