స్పీకర్ ఆయనే…నో డౌట్…?

ఏపీ స్పీకర్ గా ఆయన పేరే వినిపిస్తోంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు అని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరూ అంటే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్. ఆయన బీసీ సామాజిక…

ఏపీ స్పీకర్ గా ఆయన పేరే వినిపిస్తోంది. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు అని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరూ అంటే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మోస్ట్ నేత. శ్రీకాకుళం జిల్లాలో బలమైన నాయకుడు.

ఆయనకు మొదటి విడతలో మంత్రికి బదులుగా స్పీకర్ గా చాన్స్ ఇచ్చారు. ఆయన సైతం సభను బాగానే నడిపిస్తూ వచ్చారు. ఇక విస్తరణలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ మధ్య దాకా ఆయన ఆశలు ఫలించే సూచనలు అయితే కనిపించాయి.

కానీ ఇపుడు మాత్రం ఒక్కసారిగా సీన్ మారింది అంటున్నారు. తమ్మినేనికి మంత్రి పదవికి ఇచ్చి ఆ ప్లేస్ లో వేరే వారిని తెచ్చి పెట్టడం ఇదంతా ఒక పెద్ద ప్రక్రియగా కూడా చూస్తున్నారు. ఇక సభా నిర్వహణ అనుభవంలో ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో పాటు సిక్కోలు రాజకీయ, సామాజిక సమీకరణల వల్ల తమ్మినేనికి నో చాన్స్ అని అంటున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెండు మంత్రి పదవులు ఇచ్చారు. ఇపుడు కూడా అదే కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది. అయితే వివిధ సమీకరణను బేరీజు వేసుకున్న అనంతరం సీదరి అప్పలరాజుని కొనసాగిస్తారు అంటున్నారు. దాంతో తమ్మినేని ఆశలు ఆవిరి అవుతున్నాయని తెలుస్తోంది.

ఇక ధర్మాన క్రిష్ణదాస్ ప్లేస్ లోకి ఆయన తమ్ముడు ప్రసాదరావు వస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఆ ధర్మాన బ్రదర్స్ అటూ ఇటూ కుర్చీలు మార్చుకోవడం తప్ప ఇక్కడ నుంచి పెద్దగా మార్పులు ఉండవన్నది లేటెస్ట్ టాక్. దాంతో అయిదేళ్ల స్పీకర్ గా తమ్మినేని కొనసాగడం ఖాయమనే తెలుస్తోంది.