జగన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. ఒకేసారి ఎల్లో మీడియాకు, చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు చాకిరేవు పెట్టారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి.. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవనే ఉద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, వాళ్ల బాక్సులు బద్దలవుతాయని అన్నారు.
“మన పాలన ఇలానే కొనసాగితే డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ, ఏడుపు ఈరోజు ఎల్లో పార్టీలో కనిపిస్తోంది. ఆ ఎల్లో పార్టీకి అనుబందంగా ఉన్న పార్టీల్లో కనిపిస్తోంది. వీళ్లిద్దరికీ అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో కూడా కనిపిస్తోంది. మంచి చేసే వాడి మీదనే రాళ్లు పడతాయన్నట్టుగా నాపై బురద జల్లుతున్నారు. కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతున్నారు. పేదలకు ఇలానే నేను మంచి చేస్తే వీళ్ల బాక్సులు బద్దలవుతాయని వీళ్లందరికీ తెలుసు.”
ఆంధ్రప్రదేశ్ ను శ్రీలంకతో పోలుస్తున్న ఎల్లో మీడియా, చంద్రబాబు విమర్శల్ని జగన్ తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తే శ్రీలంక ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబులా వెన్నుపోటు పొడిస్తే ఆంధ్రా, అమెరికా అయిపోతుందా అని వ్యంగ్యంగా విమర్శించారు సీఎం.
“ఆంధ్రప్రదేశ్, మరో శ్రీలంక అవుతుందని అంటున్నారు. ఈ మాట వింటే ఆశ్చర్యమేసింది. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఆయన ఎల్లో మీడియా ఈ కొత్త ప్రచారం అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోని ఈ దుర్మార్గుల ముఠా, గతంలో ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠా, ఎన్నికల తర్వాత పత్తా లేకుండా హైదరాబాద్ లో ఉంటున్న ఈ దొంగల ముఠా, ఈరోజు ఈ ఆరోపణలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే శ్రీలంక అవుతుందా? ఎన్నికల టైమ్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోతే అమెరికా అవుతుందా?”
ఇలా ఎల్లో మీడియాను, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను గజదొంగల ముఠాతో పోల్చారు జగన్. వీళ్లకు నీతి,న్యాయం,నియమం ఉండదని.. అధికారమే వీళ్ల ఎజెండా అని ఆరోపించారు. ప్రజలంతా గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని, తను మంచి చేసినట్టు భావిస్తే మరోసారి ఆశీర్వదించాలని, చెడు చేశానని భావిస్తో ద్వేషించాలని ఓపెన్ గా ప్రకటించారు జగన్.
ఎల్లో మీడియాను, చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడ్ని మాత్రం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.