ఉద్యోగులు వైసీపీకి అండగా ఉండాలి

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏ ప్రభుత్వం చేయనంత సాయం వైసీపీ చేస్తోందని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం ఏకంగా ఏటా 83 వేల కోట్ల రూపాయలను ఖర్చు…

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏ ప్రభుత్వం చేయనంత సాయం వైసీపీ చేస్తోందని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రభుత్వం ఏకంగా ఏటా 83 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించడం అన్నది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని ఆ విధంగా నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కోసం ఏ నిర్ణయం తీసుకోదని ఉద్యోగుల క్షేమమే తన లక్ష్యమని ధర్మాన అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ కి బదులుగా జీపీఎస్ ని తీసుకురావడం ద్వారా వారి జీవన ప్రమాణాలు కాపాడామని ఆయన చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం చేసే మంచి గురించి ఉద్యోగులు గొంతు విప్పి చెప్పాలని వారు తమకు అండగా ఉండాలని సీనియర్ మంత్రి కోరుకున్నారు. పాలనా సంస్కరణలను అనేకం తీసుకుని వస్తున్నామని ఆయన చెప్పారు. వాటిని అంతా ఆహ్వానిస్తున్నారని అన్నారు. 

తమ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఉద్యోగులు మద్దతు ఇస్తూ అండగా ఉంటే మరిన్ని మార్పులు సాధ్యమని అన్నారు. ధర్మాన మాటలను బట్టి చూస్తే ఉద్యోగులు తమకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నట్లుగా ఉంది. ఉద్యోగులు ఎపుడూ ప్రభుత్వంలో భాగమే. వారి వల్లనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వైసీపీకి అండగా ఉద్యోగులు ఉండాలని సీనియర్ మంత్రి ఇచ్చిన పిలుపునకు వారి నుంచి ఏ రకంగా స్పందన వస్తుందో ఆలోచించాల్సి ఉంది.