‘జనసేన ప్రభుత్వం వస్తే..’- ఆ మాటే ఒక వంచన!

జనసేనాని పవన్ కల్యాణ్ చాలా ముమ్మరంగా ఉభయగోదావరి జిల్లాల్లో తన వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రతి చోటా జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద విరుచుకుపడుతున్నారు. జగన్ ను ఇంటికి పంపితే తప్ప రాష్ట్రానికి విముక్తి…

జనసేనాని పవన్ కల్యాణ్ చాలా ముమ్మరంగా ఉభయగోదావరి జిల్లాల్లో తన వారాహి యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రతి చోటా జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద విరుచుకుపడుతున్నారు. జగన్ ను ఇంటికి పంపితే తప్ప రాష్ట్రానికి విముక్తి లేదని అంటున్నారు. వారి దోపిడీ గురించి కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. 

యాత్ర ప్రారంభించిన సమయంలో..  పొత్తుల గురించి పవన్ ప్రస్తావనలు తెచ్చారు. పొత్తుల విషయం ఇంకా డిసైడ్ చేసుకోలేదని, అదంతా తర్వాత తేలుతుందని అన్నట్లుగా సెలవిచ్చారు. యాత్ర ముందుకు సాగుతున్న కొద్దీ.. తన సభలకు జనం వస్తున్న కొద్దీ.. పవన్ కల్యాణ్ లో పొత్తుల గురించిన ఆలోచనే లేకుండాపోయింది. తమ పార్టీనే అధికారంలోకి రావడం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నారు. 

ఇక్కడ మాటల గారడీ ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఇలాంటి మాటల గారడీ ప్రదర్శిస్తుంటుంది. మన దేశంలో ప్రజలను మోసం చేయడానికి ప్రతి రాజకీయ పార్టీకి ఇదొక సులభమైన టెక్నిక్ అయిపోయింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని వంద రకాల హామీలు గుప్పిస్తారు. అధికారానికి అవసరమైన పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికీ.. ఇతరుల మద్దతుతో లేదా, పొత్తులతో వారు అధికారంలోకి వస్తారు. 

ఇచ్చిన హామీల గురించి జనం అడిగితే మాత్రం.. అప్పుడు తమ తెలివితేటలు కనబరుస్తారు. ప్రజలు తమ పార్టీకి పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వలేదు గనుక.. తాము చెప్పినవి చేయలేకపోతున్నాం అని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు తమకు పూర్తి అదికారం కట్టబెడితే అన్ని పనులూ చేస్తామని మాట దాటవేస్తారు. ఈ దేశంలో ఇది చాలా రొటీన్ అయిపోయింది. ‘‘మా పార్టీ అధికారంలోకి వస్తే..’’ అనే మాట వంచనకు నిలువెత్తురూపం అయిపోయింది. 

అయితే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. పవన్ కల్యాణ్ తన చిత్తశుద్దిని, ప్రజల పట్ల, ఇచ్చే వాగ్దానాల పట్ల కమిట్మెంట్ ను నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ‘జనసేన అధికారంలోకి వస్తే..’ అనే మాటతో ఆపేస్తే.. ఆయన చెప్పే హామీలు ఇప్పట్లో నెరవేర్చే ఉద్దేశం లేదని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా.. జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా అధికారంలోకి వచ్చినా సరే.. ఇవన్నీ నెరవేరుస్తాం అని చెబితే మాత్రమే ఆ మాటలు నమ్మవచ్చు. 

‘తమ పార్టీ అధికారంలోకి వస్తే’ అనే మాట కింద ఏయే వాగ్దనాలైతే ప్రజలకు ఆయన అందిస్తున్నారో.. వాటన్నింటినీ పూర్తి చేయడానికి తెలుగుదేశం ఒప్పుకుంటే మాత్రమే వారికి మద్దతు ఇస్తాం అని.. ప్రభుత్వంలో భాగం అవుతామని కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. అలా చేయలేకపోయినప్పుడు.. పవన్ కల్యాణ్ జనాన్ని మోసం చేయడానికి ఆ మాట చెబుతున్నట్టే ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.