ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వనని, దానికి సంబంధించి బాధ్యతను తానే తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్ వారితో.. చాలా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చాలా ఆవేశంగా స్పందించినట్లు తెలుస్తోంది.
తనను రెండు చోట్ల ఓడించిన వైఎస్సార్ కాంగ్రెస్ పై ఉభయగోదావరి జిల్లాలు వేదికగా ప్రతీకారం తీర్చుకోవాలని పవన్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు వచ్చినా సరే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పవన్ కల్యాణ్ చాలా ఆవేశంగా ప్రకటించినట్లు విశ్వసనీయ సమాచారం!
పవన్ కల్యాణ్ తన వారాహి పాదయాత్రకు చాలా వ్యూహాత్మకంగా ఉభయగోదావరి జిల్లాలను ఎంచుకున్నారు. కాపు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలు కావడంతో ఇక్కడ ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. యాత్రకు సహజంగానే కాపు సామాజిక వర్గం నుంచి మద్దతు బాగానే లభించింది. పైగా రాజకీయం సంగతి ఎలా ఉన్నా.. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గొప్పగా ఉంటుంది కాబట్టి.. సభలు ఆయనకు ఉత్సాహాన్నిచ్చాయి.
కాకినాడలో ద్వారంపూడి మీద చేసిన ఆరోపణలు, ఆయన రెస్పాండ్ అయిన తీరు, మధ్యలో ముద్రగడ రంగ ప్రవేశం ఇవన్నీ కూడా ఒక రకంగా పవన్ కల్యాణ్ కు లాభించాయి. ద్వారంపూడి కోసం ముద్రగడ పవన్ ను కార్నర్ చేయడం అనేది చాలా మంది కాపులకు నచ్చలేదు. హఠాత్తుగా వారంతా పవన్ ను ఓన్ చేసుకున్నారు. ఇదంతా పవన్ కు శుభసంకేతాల్లాగే అనిపించింది. దీంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఈసారి ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోనే అత్యంత సేఫ్ సీటు ను ఎంచుకుని బరిలోకి దిగుతారనేది ఒక వాదన. హరిరామజోగయ్య వంటి సీనియర్ నాయకులు.. నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం నియోజకవర్గాల్లో ఒకచోటనుంచి పవన్ ను పోటీచేయమంటున్నారు.
ఇవే అయినా కాకపోయినా.. పవన్ ఈ జిల్లాలనుంచి పోటీచేస్తే మరింత ఊపు వస్తుంది. ఇదంతా ఆయన ఊహించుకునే.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వను అని.. ఆ బాధ్యత తీసుకుంటానని, ఆ పార్టీ గెలిస్తే గనుక.. తాను ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని పవన్ రెచ్చిపోయి కార్యకర్తలతో అన్నట్టుగా తెలుస్తోంది.
ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారో లేదో తర్వాతి సంగతి.. కానీ.. తన ఎదురుగా ఉన్న జనం కాస్త ఉత్సాహాన్ని అందించేలా కనిపిస్తే.. పూనకం తెచ్చుకున్నట్టుగా రెచ్చిపోవడం పవన్ కు అలవాటే కదా.. అని పార్టీ వారే అనుకుంటున్నారు.