తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాయి. వామపక్షాల పరిస్థితి మాత్రం ఇంకా ఏం తేలడం లేదు. ఒకప్పట్లో వామపక్ష పార్టీలకు తెలంగాణలో సైతం మంచిగానే బలం ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. కారణాలు ఏమైనప్పటికీ.. సొంతంగా పోటీచేయడం వలన వామపక్ష పార్టీలు ఒక్క సీటులోనైనా గెలవగలస్థితిలో ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే.
ఇలాంటి నేపథ్యంలో.. మునుగోడు ఉపఎన్నిక సమయంలో వామపక్షాలు కేసీఆర్ కు మద్దతు ఇచ్చాయి. భాజపాను వ్యతిరేకించడం వారి ఎజెండా కూడా గనుక.. అక్కడ బిజెపిని గెలవనివ్వకుండా అడ్డుకోవడానికి అప్పటి తెరాసతో జట్టు కట్టాయి. అయితే ఆ మైత్రీ బంధం భవిష్యత్తుకు కూడా కొనసాగుతుందా? లేదా? అని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు, కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసతో వామపక్షాల పొత్తు వ్యవహారం అనేది ప్రస్తుతం కేసీఆర్ కోర్టుకు చేరిందని, మరో పదిరోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన అంటున్నారు.
భారాసతో కలిసి పోటీచేయడానికి వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి సరే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వారితో కలిసి నడవడానికి కేసీఆర్ సిద్దంగా ఉన్నారా? జాతీయ రాజకీయాల్లో పార్టీల సమీకరణ పరంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. వామపక్షాలను నమ్మడం అనేది కేసీఆర్ కు ఎంతవరకు శ్రేయస్కరం అవుతుంది.. అనే సందేహాలు గులాబీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ వారికి కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. వారు గెలిచినా కూడా ఆ పరిణామం కేసీఆర్ కు సేఫ్ కాదు. పార్లమెంటు ఎన్నికలు వచ్చేవేళకు వామపక్షాలు మళ్లీ కాంగ్రెసు కూటమిలోనే ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెసు సారథ్యంలోని కూటమికి వామపక్ష జాతీయ స్థాయి పెద్దలు జై కొడుతున్నారు. సో, అప్పుడు ఎన్నికల్లో తెలంగాణ వామపక్షాలు ఎవరికి మద్దతిస్తాయి? భారాస- తమకు అసెంబ్లీ సీట్లు కేటాయించింది గనుక.. పార్లమెంటు ఎన్నికల్లో వారికే మద్దతిస్తారా? సాధ్యమేనా? అనేది ఒక సందేహం.
అదే సమయంలో.. కేసీఆర్ తో పొత్తు వలన వామపక్షాలకు కొన్ని సీట్లు దక్కి, ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కు సంకీర్ణంలో అధికారంలోకి రాగల విధంగా సీట్లు వస్తే అప్పుడు వామపక్షాల వారు ఎవరి పక్షాన ఉంటారు. కేంద్ర పార్టీ పెద్దలు.. కాంగ్రెస్ తో వెళ్లాల్సిందిగా ఒత్తిడి చేయరా? అనేది ప్రజల మరో సందేహం. ఆ కోణంలో చూసినప్పుడు.. వామపక్షాలతో అసెంబ్లీ ఎన్నికల్లో బేషరత్తు పొత్తు అనేది.. కేసీఆర్ కు ఆత్మహత్యా సదృశం అవుతుందని పలువురు భావిస్తున్నారు.