తెలంగాణలో కోర్టు ధిక్కరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పదేపదే కోర్టు ధిక్కరణ అంశం సంచలనంగా మారింది. ఏపీలో తమ ఆదేశాలను ధిక్కరించిన 8 మంది ఐఏఎస్ అధికారులకు ఆ రాష్ట్ర హైకోర్టు సేవాశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇవాళ కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సీఎస్ సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు నోటీలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ టాస్క్‌ఫోర్స్ టీం తరచూ పబ్‌లపై దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం, దాన్ని సరఫరా చేస్తున్న వారిని కటకటాలపాలు చేయడం దుమారం రేపుతోంది. బంజారాహిల్స్ పబ్ వ్యవహారంలో పలువురు సెలబ్రిటీల పిల్లలు దొరకడం తెలిసిందే. డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.
నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులను ప్రభుత్వం ఇవ్వలేదని ఈడీ కోర్టు దృష్టికి వెళ్లింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు భేఖాతరు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. తమకు సమాచారం ఇవ్వకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా భావించి, సంబంధిత అధికారులకు శిక్ష విధించాలని హైకోర్టును ఈడీ కోరింది.
ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సీఎస్ సోమేశ్‌కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.