వైసీపీపై టీడీపీ, జనసేన కంటే దారుణంగా సీపీఐ విమర్శలు చేస్తోంది. ఇటీవల మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ సీపీఐ నేతలకు చురకలంటించారు. సీపీఐ నేతలు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదిలేసి చంద్రబాబు విధానాల్ని భుజాన మోస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్) అని పెట్టుకున్నట్టుగా, సీపీఐ కూడా సీపీసీ (చంద్రబాబు)గా మారితే బాగుంటుందని హితవు చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు భరించలేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు మోపుతున్నాయని విమర్శించారు. ఒంటె అందాన్ని గాడిద పొగిడినట్లు విజయసాయి రెడ్డి పార్లమెంటులో మోదీని పొగుడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. వైసీపీ సిగ్గులేకుండా బీజేపీ చేసే ప్రతి పనికి మద్దతు తెలుపుతోందని తప్పు పట్టారు. పెళ్లి చేసుకోకపోయినా బీజేపీ, వైసీపీ కలిసే కాపురం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ తీసుకుంటే పవన్ కల్యాణ్ గుంటలో పడతారని హెచ్చరించారు.
మంత్రి వర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. పైకి కనిపించకపోయినా మంత్రులు లోపల ఏడుస్తున్నారని రామకృష్ణ చెప్పుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంత దారుణంగా చూసిన సీఎంను ఇప్పటి వరకూ చూడలేదన్నారు. ఒంటె అందాన్ని గాడిద పొగిడినట్లు విజయసాయి రెడ్డి పార్లమెంటులో మోదీని పొగుడుతున్నారని రామకృష్ణ విమర్శించారు.
ఇదిలా వుండగా జగన్ బాదుడుకు వ్యతిరేకంగా ఈ నెల 11,12వ తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు చేపడతామని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విశాల దృక్పథంతో ఆలోచించాలని రామకృష్ణ వేడుకోవడం గమనార్హం. ఒకవైపు జనసేనాని పవన్‌కల్యాణ్ ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నా రామకృష్ణ మాత్రం తెగ ప్రేమ చూపుతారు. అలాగే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నా… రామకృష్ణకు మాత్రం ఎంతో ముద్దొస్తారు.
మరి జనసేన, టీడీపీలతో సీపీఐ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాకుండా మరేమవుతుందని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు బీజేపీతో ఎలాంటి సంబంధం లేని తమ పార్టీకి అక్రమ సంబంధం అంటకట్టడం వెనుక ఎవరి ప్రయోజనాల కోసమో రామకృష్ణ చెప్పాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.