నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. చేస్తారని అనుకున్నది. కానీ ఎందుకో ఆలస్యం చేసారు. ఈ ఐడియాను ఎందుకో వాడుకోలేదు. ఆఖరికి ఇప్పుడు వాడుకున్నారు. అదే జైలు నుంచి బహిరంగ లేఖ. రాజమండ్రి జైలు, స్నేహ బ్లాక్ నుంచి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాసారు. దాన్ని పార్టీ విడుదల చేసింది. అయితే ఈ లేఖలో కొత్త విషయాలేమీ లేవు.
ఎప్పుడూ అలవాటైన సోత్కర్షనే. అభివృద్ది అంటే నేను. సంక్షేమం అంటే నేను. నేను బతికిందే అభివృద్ది కోసం. నేను నిలిచిందే సంక్షేమం కోసం అంటూ అదే మాటలు మళ్లీ. తన మీద పెట్టినది తప్పుడు కేసు అని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, తనను అక్రమంగా బంధించారని చెప్పుకు వచ్చారు. మరి జగన్ కూడా అలాగే అంటారు కదా.. ఆయన గురించి కూడా అలాగే రాయాలి కదా మీడియా. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. జగన్ కు న్యాయమే జరుగుతుందని అనుకోవచ్చు కదా.
నిజానికి నలభై రోజులకు పైగా జైలులో వున్న వ్యక్తిగా రాసే లేఖ చాలా బలంగా వుండాలి. భావోద్వేగాలు తొణికిసలాడాలి. జనాన్ని టచ్ చేయాలి. కానీ అలా మాత్రం ఈ లేఖ లేదు. జస్ట్ తనను అన్యాయంగా అరెస్ట్ చేసారని, అభివృద్ది, సంక్షేమం అంటే తానే అని చెప్పడం తప్ప.
కొసమెరుపు ఏమిటంటే దసరాకు పార్టీ మేనిఫెస్టో ఇస్తాం అన్నాము, కానీ జైలులో వుండిపోయాను కనుక ఇవ్వడం లేదు అన్నది. అంటే చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ పారలైజ్ అయిపోతుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. బాబుగారు లేకుండా పార్టీ పనులు ఏవీ జరగవు అని క్లారిటీ ఇచ్చారు.
నిజానికి జైలులో నలభై రోజులకు ఫైగా ఒంటరిగా వున్నారు. ఈ టైమ్ లో పదునైన మేనిఫెస్టో ను ఆలోచించి, రచించి, జైలు నుంచే దాన్ని విడుదల చేస్తే వేరేగా వుండేది. దానికి వచ్చే బజ్ మామూలుగా వుండదు. కానీ ఎందుకో చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు.