మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానాలపై మంత్రులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వైఎస్ జగన్ మొట్టమొదటే రెండున్నరేళ్లకు మంత్రి వర్గాన్ని సమూలంగా మారుస్తానని, కొత్తవారికి చాన్స్ ఇస్తానని చెప్పారు. మంత్రి పదవి వచ్చిన సంతోషంలో జగన్ మాటలను పెద్దగా అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు మూడేళ్ల పాటు మంత్రి వర్గహోదాను అనుభవించిన వాళ్లకు, ఇప్పుడు దిగిపోవాలంటే సహజంగానే బాధగా వుంటుంది.
దీనికి తోడు ముగ్గురు లేదా నలుగురు మంత్రుల్ని కొనసాగిస్తారనే సమాచారం ….ఆవేదనతో ఉన్న మంత్రుల పాలిట పుండుమీద కారం చల్లినట్టుగా ఉంది. వివిధ సామాజిక, రాజకీయ సమీకరణల రీత్యా మంత్రులు ఆదిమూలపు సురేశ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను కొనసాగిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
తమను తప్పించడం కంటే, కొందరిని కొనసాగించాలనే సీఎం నిర్ణయం మంత్రులకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదట చెప్పినట్టు అందరితో రాజీనామా చేయిస్తారని నమ్మామని సన్నిహితుల వద్ద మంత్రులు చెబుతున్నారు.
కానీ ఇప్పుడు నలుగురిని మాత్రం కొనసాగించడంలో ఔచిత్యం ఏంటనే అసంతృప్తి మంత్రుల్లో కనిపిస్తోంది. జగన్ సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి తన జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ కొనసాగింపుపై, ముఖ్యమంత్రి వద్దే నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే.
సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు సన్నిహితుల వద్ద సీఎం వైఖరిపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్టు తెలిసింది. అందర్నీ తప్పించి, కొత్త వారిని తీసుకుని వుంటే ఎలాంటి బాధ వుండేది కాదనేది మంత్రులందరి అభిప్రాయం. కానీ జగన్ మార్క్ కొనసాగింపు మాత్రం కొంత అసంతృప్తికి గురి చేస్తుందన్న మాట నిజం.