ఎప్పుడో తప్పి పోయి, దొరుకుతుందని ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులకు అనుకోని రీతిలో శుభవార్త రావడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి భావోద్వేగ క్షణాలు జీవితంలో మరుపురానివిగా గుర్తుండిపోతాయి. సరిగ్గా సినిమాను తలపించేలా 21 ఏళ్ల క్రితం తప్పి పోయిన బాలిక, ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది.
తెలంగాణలోని అలంపూర్‌లో నాగశెట్టి, సత్యవతి దంపతులు నివసించేవారు. వీరికి ఐదుగురు కుమార్తెలు. ఐదో కుమార్తె శ్రీదేవి. 2001లో ఆమె వయసు 14 ఏళ్లు. ఆ వయసులో తన సోదరి వద్దకు వెళుతున్న క్రమంలో శ్రీదేవి హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో తప్పి పోయింది. బిడ్డ కోసం తల్లిదండ్రులు, అక్క, బావ తీవ్రంగా వెతికారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇక శ్రీదేవి దొరుకుతుందనే ఆశను వదులుకున్నారు.
పది రోజుల క్రితం కర్నూలు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి గుజరాత్ పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వడోదరలోని పారుల్ సేవాశ్రమంలో చికిత్స పొందుతున్న మహిళ, తనది కర్నూలు జిల్లా అలంపూర్ అని చెబుతోందని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు మహిళ ఫొటోను ఎస్పీ వాట్సప్‌నకు తెప్పించుకున్నారు. మహిళ వివరాలను కనుక్కునే బాధ్యతను దిశా పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులకు ఎస్పీ అప్పగించారు.
అలంపూర్ వెళ్లి విచారించారు. బాలిక తల్లి మృతి చెందిందని వారు గుర్తించారు. శ్రీదేవి తండ్రి, సోదరి 14 ఏళ్ల క్రితమే కర్నూలు మండలం దేవమడ గ్రామానికి వలస వెళ్లారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవమడకు వచ్చి వీడియో కాల్ ద్వారా శ్రీదేవితో మాట్లాడించారు. ఆ తర్వాత గుజరాత్‌కు వెళ్లి ఆమెను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 21 ఏళ్లకు తప్పి పోయిన బాలిక ఇంటికి చేరవడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేవు.