వ్యథావనితాయణం ఇంట్రో:
ఏ వయసులోనైనా సరే, మహిళకు సమాజంలో భద్రత లేదు. ఏదో ఒక స్థాయిలో లైంగికపరమైన వేధింపులు తప్పవు. శారీరకంగానో, వెకిలి చూపులు మాటల ద్వారానో, వికృత చేష్టల రూపంలోనో బయటివారే కాక, బంధువులు సైతం వారిని యిబ్బంది పెడుతూ వుంటారు. దీనిలో కూడా వర్గభేదం ఉంది. అల్లరి పెట్టగల పేదవర్గాల జోలికి, అణచి వేయగల ధనికవర్గాల జోలికి వెళ్లడానికి జంకే మగవారికి మధ్యతరగతి వారంటే లోకువ. పరువుభయంతో బయటపెట్టరన్న ధీమా. తెగువ చాలని దిగువ మధ్యతరగతి వారంటే మరీ లోకువ. గొడవ చేస్తే ‘నా స్థాయి చూసి తనే నా వెంట పడిందం’టూ బుకాయించవచ్చనే ధైర్యం.
ఇవి దిగువ మధ్యతరగతి వనితల వెతల కథలు. ఆర్థిక స్వాతంత్ర్యం లేక, దానికోసం చిరుద్యోగాలు చేస్తూ, పోగొట్టుకుంటూ, ఉద్ధరించే మొగుడి కోసం వేచి చూస్తూ, వివాహమయ్యాక కోరుకున్న జీవితం దక్కలేదని కుములుతూ, దక్కినదానిలోని మంచిని సైతం గుర్తించడానికి నిరాకరిస్తూ, నిరంతరం అశాంతితో రగిలేవారి కథలివి. వీరు నివసించే పెద్ద పట్టణాలలో, నగరాలలో విశాలమైన రోడ్లు, పెద్దపెద్ద బంగళాలు వుండవచ్చు కానీ వీళ్లుండే పేటలలో ఉండేవి యిరుకు సందులే. అద్దెకుండే గూళ్లు యింకా యిరుకైనవి. ఒకే యింటిని రకరకాల పార్టిషన్లతో, పక్కింట్లో జరిగే సరస విరస సంభాషణలు, శబ్దాలు వినబడే రీతిలో, ఏడెనిమిది రూమున్నర, రెండు రూములన్నర వాటాలుగా చీల్చి, ఒకే పెరడుతో, కామన్ టాయిలెట్స్‌తో, కప్పు ఎగిరిపోయిన బాత్రూమ్లతో విస్తరించిన గృహసముదాయాల్లో ఉంటూంటారు. కొందరివి ఉమ్మడి కుటుంబాలు కూడా.
ప్రైవసీ అనేది అక్కడ లగ్జరీ. అందవలసిన శారీరక సౌఖ్యం అందక అనేక మనోవికారాలకు లోనవుతారు. ఇది మన కర్మం అని సర్దుకునేవారు కొందరైతే, దీనిలోంచి బయటపడి, పై మెట్టెక్కాలనే తాపత్రయం వున్నవాళ్లు ఎక్కువమంది. దాని కోసం అవసరమైతే అడ్డదారి తొక్కినా ఫర్వాలేదన్న ఫిలాసఫీ కొందరిది. అవకాశాలు అరుదైనప్పుడు అవి అందుబాటులో వచ్చిన క్షణాన నీతినియమాలు, వావివరుసల పట్టింపు ఉండదు వారికి. శిష్టజనుల తూనికరాళ్లతో వీళ్లను తూచడం అసమంజసమే అవుతుంది. వీరి ఆశలు గమనించి, వల వేద్దామని చూసేవారు యింటాబయటా కోకొల్లలు. వలలో పడేవారు కొందరైతే, ఒడుపుగా తప్పించుకునేవారు మరి కొందరైతే, వలనే కొరికివేయగల గడుసరులు యింకొందరు.
ఈ వ్యథావలయంలో మహిళలే కాదు, వారి భర్తలు, పిల్లలు, బంధువులు సైతం చిక్కుకుంటారు. తోచినవిధంగా తమ సమస్యలకు పరిష్కారం వెతకబోతారు. ఆ ప్రయత్నాలు ఒక్కోప్పుడు కొత్త సమస్యలకు దారి తీయవచ్చు కూడా. వీరి యిక్కట్లకు మూలం ఆర్థికపరమైనదే అయినా, యీ సీరీస్‌లోని కథలు శరీరం, దాన్ని ఆలంబనగా చేసుకున్న మనసు కేంద్రంగా నడుస్తాయి. తరతరాలుగా నెలకొని ఉన్న సమాజపు రీతిలో తీవ్రమైన మార్పు తేవాలనుకుంటున్న వారిలో పురుషులలో కంటె స్త్రీలు అధికమనీ, విద్య, ఆర్జన సాధనాలుగా కొందరు దాన్ని సాధించారనీ మనం గమనిస్తున్నాం. మగవార్ని బెంబేలెత్తించగల సామర్థ్యం తెచ్చుకోవడానికి వారిని ప్రేరేపించిన పరిస్థితులేమిటో యీ కథలు చదివితే కొంత బోధపడవచ్చు. ‘‘వ్యథావనితాయణం’’ సీరీస్‌గా నెలకొక కథ చొప్పున, ప్రతి మొదటి బుధవారం రాద్దామని ప్రయత్నం.
పక్కింటి పిశాచి కథ
రాజ్యలక్ష్మమ్మకు కొడుకు రామం గురించి బెంగ పట్టుకుంది. అంతకంటే పక్కింటి పర్వతమ్మ గురించి బెంగ పట్టుకుందంటే సబబుగా ఉంటుందేమో! పర్వతమ్మ స్వతహాగా మంచిదే. ఉపకారి కూడాను. మొగుడు బట్టల వ్యాపారంలో తరచుగా టూర్లు వెళుతూంటాడు. కొడుకూ, కూతురు ఆడపడుచు గారూళ్ళో చదువుకుంటున్నారు. ఏదైనా బయటపని చేసి పెట్టాలంటే తను రామాన్ని పంపిస్తుంటుంది కూడా. పర్వతమ్మ అందుకు తగ్గట్టుగా కాఫీ పొడి, పంచదార, అప్పుడప్పుడు బియ్యం ఏది అరువు కావాలన్నా యిస్తుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడిచ్చినా ఏమీ అనదు. ఒక్కోప్పుడు తను చేబదుళ్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది, మొగుడి నిర్వాకంవల్ల! ఈయన బస్సు డ్రైవర్, జీతం ఎంత వస్తుందో, తాగుడికి ఎంత పోతుందో, అదికూడా ఇంట్లో ఎప్పుడు ఇస్తాడో బ్రహ్మదేవుడికి తెలీదు. రూటుమీద వెళితే ఒక్కోసారి రెండు, మూడు రోజులకిగానీ రాడు. సంసారం గడుపుకు రావడం ఎలా మరి? పక్కన పర్వతమ్మలాటి వాళ్ళు లేకపోతే! అదృష్టవశాత్తు కొడుకు బుద్ధిమంతుడు. తండ్రి లక్షణాలు రాకుండా ఫస్టుగా చదువుకుంటూ ఇంటర్లోకి వచ్చాడు. పెద్దయ్యాక వాడే మమ్మల్నిద్దర్నీ చూడాలి.
పర్వతమ్మ సరదా మనిషి. ఆవిడ మొగుడు ఊళ్లో ఉంటూండడు కాబట్టి తామిద్దరు కూర్చుని మధ్యాహ్నమనక, రాత్రనక కబుర్లు చెప్పుకుంటారు. మంచి కాలక్షేపం. వాళ్లాయనకు ప్రయాణాలు ఎక్కువ కాబట్టి బోరు కొట్టకుండా అదోరకం పుస్తకాలు, పత్రికలు కొంటూంటాడు. ఈవిడ అవన్నీ అక్షరం పొల్లుపోకుండా చదివేసి, పూసగుచ్చినట్లు తనకు చెప్తూ వుంటుంది. రకరకాల జోకులు గుర్తుంచుకొని సమయం చూసి పేలుస్తూ వుంటుంది. అంతవరకు బాగానే వుంది. కానీ ఆవిడకు ఇంగితం తక్కువ. తామిద్దరూ ఇలాంటి కబుర్లతో ఉండగా రామం అటువైపు వచ్చినా, మాట్లాడడం ఆపదావిడ. తను సంభాషణ మరల్చబోయినా పట్టించుకోదు. చివరికి, 'నడవరా నీతో పనుంది' అంటూ రామాన్ని తనే అక్కణ్ణుంచి తీసుకుపోవాల్సిందే. లేకపోతే వాణ్ణి కూచోబెట్టి మిగతా కథ చెప్పేసేటంత తింగరి ఆవిడ.
కానీ తను భయపడినంతా జరిగినట్లుంది. రామం తన ఫ్రెండుకి ఆ మధ్య జోకు చెప్తూ చెప్తూ తను రాగానే ఆపేసాడు. తనకు వినబడినంతవరకూ ఆది పర్వతమ్మ తనకు చెప్పిన జోకులా అనిపించింది. కొంపదీసి ఆవిడ పుస్తకాలు వీడు చదవడంలేదుకదా! పని వుందంటూ ఆవిడ రోజూ పది సార్లు వీడిని పిలిపించుకొంటూ వుంటుంది. ఆ పుస్తకాలు జాగ్రత్తగా దాచుకోదేమో! వీడవి చూసి ఉంటాడా? ఇంకా కాస్త ఆలోచించి చూస్తే … ఒకవేళ, కొంపదీసి, ఆవిడే వీడికా జోకు చెప్పేసిందా? అబ్బే, అంత తెలివితక్కువ పని చేస్తుందా? నా ఈడుది. సరేలే, నాకంటే తక్కువేననుకో? వీడు కొడుకు లాంటి వాడు! ….వాడ్ని కొడుకులాగే చూస్తోందా అని? ఒక్కోప్పుడు హద్దూ పద్దూ లేకుండా మాట్లాడుతుంది. “రాముడి పేరు పెట్టుకుంటే ఏం లాభమయ్యా? జీవితమంతా కష్టాలే. ఒక్కతే పెళ్లాం కూడానూ, హాయిగా కృష్ణుడి పేరు పెట్టుకో, పదహారువేల మంది పెళ్లాలు, ఏం చేసుకోవాలో తెలీనంత మంది” అందోసారి తన ఎదురుగానే.- ఏడు అప్పుడు 'ఛీ, ఛీ' అన్నాడుగానీ ఇంకో పదిహేను రోజులు పోయాక మరో జోకు వేసినప్పుడు “ఏంటి ఆంటీ, మీరు మరీను”అంటూ వంకర్లు పోయాడు.
ఓరోజు రాత్రి అటకమీదనుంచి సామాన్లు దింపాలని రామాన్ని పిలిపించింది పర్వతమ్మ, కాస్సేపయ్యాక మధ్య గదిలోకి వస్తే మాటలు వినబడుతున్నాయి. “అసలు నేనే అటకెక్కుదునోయ్. ఒళ్ళు బరువైపోయింది. ఇదివరకు నేనింతలా వుండేదాన్ని కాదు తెలుసా?’’ “నిజంగానా ఆంటీ” రామం ఆడిగేడు. 'నిజం కాకపోయినా వీడేం చేస్తాడు?' “నమ్మకం కలగడం లేదా? నా పాత ఫొటో తెస్తాను చూడు…. ఆ ఇదిగో చూశావా. బీచ్ మీద పడుకుని తీయించుకున్న ఫొటో. ఒళ్ళంగా బాగా తెలుస్తోందికదూ. నీళ్ళకి చీర తడిసిపోయిందే. ఫొటో దగ్గర పెట్టుకుని పోల్చిచూడు. ఎంత ఒళ్ళొచ్చిందో” “అవును ఆంటీ, బాగా లావయ్యేరు’’. “రామం’’ అని గట్టిగా అరిచింది తను. ఇల్లు దద్దరిల్లేలా…. రామం పిల్లిలా ఇంట్లోకి వచ్చాడు. తనేమీ అడగలేదు. మాట్లాడకుండా భోంచేసి పడుకున్నాడు. ఆలోచనలతో తనకు నిద్రపట్టలేదు.
వీడి వరస బాలేదని ఈయన్తో చెప్తామా అంటే మొరటు మనిషి కోపం వస్తే గొడ్డుని బాదినట్లు బాదేస్తారు తప్ప సామరస్యంగా సాధించుకు రాలేరు. తనతో అయినా ఓ సరసం లేదు, శృంగారం లేదు. మనిషిని చూస్తేనే మోటుగా, బీడీ కంపు, సారా కంపూ కొడుతుంటారు. కోపం రానంత వరకూ సౌమ్యంగానే వుంటారు. డ్యూటీకి వెళ్లడం, రాగానే నిద్రపోవడం, తన దగ్గరకి కూడా పెద్దగా రారు. రూటులో వెళ్ళినప్పుడు ఏవైనా వేషాలేస్తారేమో, ఒక్కోప్పుడు జేబుల్లో ఏవేవో దొరుకుతుంటాయి. వాళ్ళంతా చవకబారు మనుషులే అయి వుంటారు. డబ్బు కోసం వస్తారేమో! లేకపోతే ఈయన మాటలతో మెప్పించి, వలపించుకోవడం కూడానా, రాత!
అయినా పర్వతమ్మకు బుద్ధి ఉండాలి. మొహం బాగానే ఉన్నా ఆ జబ్బలూ అవీ అంత లావేమిటి బాబు! అలా ఉన్నపుడు డ్రస్సయినా సరిగ్గా ఏడవాలి, అస్తమానూ పైట సర్దుకోడం మానాలి. కుర్రాడు రామాన్ని అని ఏం ప్రయోజనం ఈయనే వెకిలి చూపులు చూస్తారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల పలకరించరుగానీ లేకపోతే ఆవిడతో పని కల్పించుకొని మాట్లాడుతూ ఎక్కడెక్కడో పట్టిపట్టి చూడకుండా వదిలి పెట్టేవారా? సంసారంలో చికాకుల వల్ల తనకు కళ్ళజోడు వచ్చేసి వెంట్రుకలు తెల్లబడిపోయి, ముఖాన ముడతలు వచ్చి ముసలమ్మ రూపం వచ్చేసింది. తనలాగా దిక్కుమాలిన మొగుడు దొరికి ఉంటే తెలిసేది పర్వతమ్మ సొగసు ఏం మిగిలేదో! పిల్లలిద్దర్నీ ఆడపడుచు నెత్తిన పడేసింది, చదువులు అక్కడ బావుంటాయన్చెప్పి. అదలించడానికి మొగుడు ఊళ్ళో ఉండేదే తక్కువ. టింగురంగా మంటూ వెధవ పుస్తకాలు చదవడం. సిగ్గులేకుండా అవన్నీ తనకి అప్పచెప్పడం! తను కూడా కబుర్లు తగ్గించి దూరంగా పెట్టకపోతే లాభం లేదు. అప్పుడే కుర్రాణ్ణి కట్టడి చేయవచ్చు.
మధ్యాహ్నం కబుర్లు మానేయడంతో నిద్రపోవడం అలవాటయింది. ఆరోజు మధ్యాహ్నం అనుకోకుండా మెలకువ వస్తే పక్కింట్లోంచి మాటలు వినబడుతున్నాయి. ‘‘లక్ష్మీ టాకీసులో సినిమా చూసావోయ్! ఇద్దర్ని పెళ్ళాడేశాడు హీరో చివర్లో. నువ్వూ పెద్దయ్యాక అలాగే చెయ్యి. చలిబాధే తెలియదు!” “ఇద్దర్ని పెళ్ళాడితే జైల్లో పెడతారండి” “ఆబ్బో, అన్నీ తెలుసుకొనే ఉన్నావే! జైల్లో పెట్టరంటే ఇద్దర్నీ కట్టుకోవడానికి రెడీ అన్నమాట! దేవాంతకుడివి! పోనీ ఓ పనిచెయ్యి. ఇద్దరి పెట్టున్న నాలాటి పెర్సనాలిటీ దాన్ని చేసుకో. ఎలా ఉంది అయిడియా?” “ఆలోచించి చూడాల్సిన అయిడియానేనండి”. కొడుకు గొంతులో అంత కొంటెతనం ఉందా? “ఆలోచించి చూస్తే ఇవన్నీ తెలుస్తాయా.. నీ వెర్రిగానీ.. శాంపుల్ చూసి తెలుసుకోవాలి” “భలేవారే! ఇవన్నీ ఎవరు శాంపుల్ చూపిస్తారు?” “అంటే, సలహా చెప్పిన పాపానికి నన్నే చూపమనా నీ ఉద్దేశం? ఏమో అనుకొన్నాను. తెలివైనవాడివే”. అడుగులు కదిలిన చప్పుడు. “ఆంటీ, భయం వేస్తోంది, ఆంటీ” రామం ఆవిడ కౌగిట్లో నలుగుతున్నాడా? తను ఆదిరిపడింది. “నీ అమాయకత్వం చూస్తే ముద్దొస్తోందయ్యా. అయినా ముద్దు పెట్టనులే, బెదిరిపోతావు.’’ అంటోంది పర్వతమ్మ, “రామం, రామం, ఇలారా” అంటూ తను పిలిచేసింది.
ఆలోచించిన కొద్దీ భయం వేస్తోంది. పర్వతమ్మ అభిప్రాయం తెలుస్తూనే ఉంది. ఒళ్ళు బలిసి పక్కింట్లో కామపిశాచిలా దాపురించింది. మొగుడిలా రామం నీరసప్రాణి కాడు. హుషారుగా ఉంటాడు. చిన్న కుర్రాడు కాబట్టి చుట్టుప్రక్కలవాళ్ళకి సందేహం రాదు. వేడి చల్లారాక కూరలో పురుగులా విదిలించి పారేస్తుంది. కుర్రాడి భవిష్యత్తు గురించి దానికేం పట్టింది? చదువుకునే వయస్సులో ఈ యావలో పడితే వీడేం బాగుపడతాడు? అహోరాత్రాలూ అదే ధ్యాస పెట్టుకొని చదువు చెట్టెక్కిస్తాడు. వాళ్ళ నాన్నలాగే బస్సు డ్రైవరో, లారీ క్లీనరో అవుతాడు. అమ్మానాన్నకు తిండి పెట్టడం మానె, వాడి బతుకుతెరువుకే దిక్కు లేకుండా అవుతాడు. ఒక్కగానొక్క బిడ్డ. వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి. పర్వతమ్మవల్ల పొందే లాభం గురించి తనూ ఇన్నాళ్ళూ వెనకాడింది. ఇక లాభం లేదు. పర్వతమ్మతో పోట్లాడి లాభం లేదు. గెలవలేం. ఆవిడ దగ్గర అందరూ అరువులు పెడతారు. ఆవిడ పక్షానే మాట్లాడతారు. ఇల్లు ఎలాగైనా మారాలి. ఈ లోపున రామాన్ని వాళ్ళింటికి వెళ్లద్దంటే సరి.
కానీ ఈయన్ని ఒప్పించేదెలా? ఆయన్ని దెప్పుతూనో, కష్టంసుఖం చెప్పుకుంటూనో పర్వతమ్మ మంచితనం గురించి అనేకసార్లు చెప్పింది తను. ఇప్పుడు మరోలా చెప్పగలదా? ఇల్లు మారదామంటే ఎందుకంటాడు. అప్పటికీ ఒకటి, రెండుసార్లు అని చూసింది. 'ఇంత చవగ్గా ఇల్లెవడిస్తాడు? అయినా ఎందుకు మారడం?' అన్నారు. విషయం వివరంగా చెప్తామంటే 'కుర్రాణ్ని చావబాది అదుపులో పెట్టుకుంటే సరి, ఇల్లు మారక్కర్లేదు' అంటారు తప్పకుండా. “కుర్రాడు ఎదురు తిరిగితే? చాటుమాటు వ్యవహారం చేస్తే?' అన్న ఆలోచన రాదు మనిషికి. వ్యవహారం తెలివిగా చక్కబెట్టుకు రావాలి. .
భార్య చెప్పినది విని నారాయణకు ఆశ్చర్యమేసింది. 'పర్వతమ్మ తన గురించి అంతలా ఆరాలు తీయడం ఎందుకు? రాజ్యలక్ష్మి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది, ఆవిడ అడపాదడపా సాయం చేస్తూంటుందని. అదంతా తనని మంచి చేసుకోడానికేమో? మొద్దుని గ్రహించుకోలేకపోయేను. ఏదీ, డ్యూటీ, ఇల్లు, నిద్ర, డ్యూటీ- ఎవరైనా మనకేసి చూస్తున్నారో లేదో పట్టించుకోవడం ఎక్కడ! ఆవిడ తనలో ఏం చూసిందో? ఏ ఇదీ లేకుండా 'మీ ఆయన డ్యూటీనుంచి ఎప్పుడొస్తారు? అంత బలంగా ఉంటారే, ఏం తింటారు?” అలాటివన్నీ అడుగుతుందా? వాళ్ళాయన పీలగా ఉంటాడు. తనలో మగతనం చూసి ఉంటుంది. చూడ్డానికి మోటుగా, మొరటుగా ఉంటేనేం? అయినా అటువంటి మగవాళ్ళు నచ్చే ఆడాళ్ళూ ఉంటారుగా. ఈ కాలం హీరోలందర్నీ మొరటుగానే చూపిస్తున్నారుగా! పర్వతమ్మకి తగ్గవాడు తనే. మనం చెయ్యేస్తే కెవ్వుమనాల్సిందే. ఒక్క పెగ్గు కొట్టి వెళ్ళామంటే వారం రోజులదాకా తేరుకోలేదు!
రాజ్యలక్ష్మి చెప్పింతర్వాత పర్వతమ్మ కనబడినప్పుడు నారాయణ పలకరింపుగా నవ్వేడు. ఇంతకుముందు ఎప్పుడూ అలా నవ్వని కారణంగా కాబోలు ముందు తెల్లబోయినా, తేరుకొని ఆవిడా నవ్వింది. ఆ తర్వాత నుంచీ నారాయణ బాత్రూంలో కాకుండా నూతిదగ్గర స్నానం చేసేవాడు. పర్వతమ్మ వాటా కెదురుగా కండలకు సబ్బు పట్టించి, తీరిగ్గా రుద్దుకుంటూ నీళ్లు పోసుకొనేవాడు. పర్వతమ్మకు అతని వరస చూస్తే నవ్వు వచ్చేది. ఆమె ముసిముసి నవ్వులు చూసి నారాయణ వెర్రెక్కి పోయేవాడు. ఒకరోజు ఎవరూ లేకుండా చూసి, “మీ ఇంట్లో కథల పుస్తకం ఉంటే ఇవ్వండి”అని అడిగేసాడు. ఆవిడ ఆశ్చర్యపడి, ఇంట్లోంచి ఓ పుస్తకం పట్టుకొచ్చింది. ఆ మాగజైన్లో రెండు శృంగార కథలుండడంతో నారాయణకు రూఢి అయిపోయింది, ఆవిడ తనకోసమే అలాటి పుస్తకం, వెతికి ఇచ్చిందనీ, ఆ విధంగా తన భావాన్ని విప్పి చెప్పిందనీ.
ఓరోజు రాజ్యలక్ష్మమ్మ నారాయణ చేతిలో ఓ పుస్తకం పెట్టి “మీరు అడిగారటగా పక్కింటావిడ ఇచ్చింది” అంది. నారాయణ ఆశ్చర్యపడ్డాడు. 'నేనడగ లేదే!' అనుకుంటూ, పుస్తకం తిరగేసి బోర్లేసి చూశాడు. చిన్న చీటీ కిందపడింది! ‘ఇవాళ కరెంటు తీసేసి వుంచుతాను' అని ఉంది. పర్వతమ్మ తెలివైనదే. రాజ్యలక్ష్మి ద్వారానే సందేశం పంపించింది. తను పుస్తకాలు తెరిచికూడా చూడదని తెలుసు కాబోలు! ఇక ఇవాళ రాత్రి పండగే! గుడో, మరేదో పేరు చెప్పి రాజ్యలక్ష్మిని, రామాన్ని బయటకు పంపిస్తే సరి!!' అనుకొన్నాడు నారాయణ,
రాత్రి ఎనిమిది గంటలకు నారాయణ పర్వతమ్మ ఇంటి దొడ్డి గుమ్మం తోసాడు. తీసే వుంది. ఇల్లంతా చీకటి. మల్లెపూల వాసన గుప్పుమంది. 'రా, నేనిక్కడే ఉన్నాను' అని పర్వతమ్మ గొంతు వినబడింది. వెళ్ళి ఎముకలు విరిగేలా గట్టిగా కౌగిలించుకున్నాడు. కెవ్వున కేక వేయబోయింది పర్వతమ్మ. 'మన దెబ్బ అలాటిది అనుకొంటూ గట్టిగా ముద్దు కూడా పెడితే తడాఖా తెలిసొస్తుంది' అనుకొని, కౌగిలి వదలకుండానే పెదాలు గట్టిగా కొరుకుతూ ముద్దు పెట్టేడు నారాయణ. పర్వతమ్మ గింజుకుంది. విదిలించుకోబోయింది. కౌగిలి కొద్దిగా సడలించి, మళ్ళీ పెదాలు అందుకోబోయేడు నారాయణ. 'ఛీ, ఛీ' అంటూ ఆమె తోసేసింది. “దున్నపోతా! బయటకు పోతావా? అందర్నీ పిలవమన్నావా?” అంది గట్టిగా. నారాయణకు మతిపోయింది. దగ్గరకెళ్ళి నోరు మూసేసి “బాబ్బాబు అరవక! ! రమ్మని చీటీ పంపేవుకదాని వచ్చా”అన్నాడు దీనంగా.
“చీటా! నీకా? సారా కంపు వెధవ్వి నిన్నెవత్తి వరిస్తుందిరా? చీటీ, పీటీ ఏమీ లేదు. మా ఆయన రానీ, నిన్ను జైల్లో తోయిస్తాను… “అంటూ అరుస్తోంది పర్వతమ్మ. నారాయణ పారిపోయి తన వాటాకొచ్చి పడ్డాడు. 'ఎక్కడో, ఏదో పొరపాటు జరిగిపోయింది. ఈ దెయ్యం నిజంగానే బజారు కెక్కేటట్టుంది. రాజ్యలక్ష్మి ఏది సహించినా ఇది సహించలేదు. రేపే ఇల్లు మార్చి దూరంగా వెళ్ళిపోవాలి! పర్వతమ్మ మొగుడు ఊళ్లో దిగకుండానే!' అనుకొన్నాడు నారాయణ.
రాజ్యలక్ష్మమ్మ సామాన్లు సర్దుతూ తృప్తిగా నిట్టూర్చింది! ఆరోజు పర్వతమ్మ ‘రామం మా ఇంటికి రావటమే లేదు. ఈ పుస్తకం అడిగేడోసారి. అతనికివ్వండి' అంటూ ఇచ్చిన పుస్తకం తను పరీక్షగా చూడడం మంచిదయింది. ఆ చీటీ మొగుడికందేలా చూసింది, రామం భవిష్యత్తు కాపాడుకొంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)