జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో వందలాది మంది కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం అందించి ఆదుకుంటామని పవన్‌కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కౌలురైతుల కోసం భరోసా యాత్ర నిర్వహించనున్నట్టు పవన్ ప్రకటించడంపై కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనది రైతుపక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చెప్పడాన్ని గుర్తు చేశారు. ఇటీవలే గుడ్ గవర్నెన్స్‌లో తమ ప్రభుత్వం మొదటిస్థానంలో నిలిచిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే తమ ప్రభుత్వానికి ఆ సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌పైనే, నేడు అధికారంలో ఉన్నా ఆయనపైనే పవన్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మన గురించి జనం ఏమనుకుంటున్నారో ముఖ్యమని, జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం కాదన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారని కురసాల కన్నబాబు చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని పవన్‌కల్యాణ్ కోరడంపై కూడా కురసాల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాజకీయంగా బలమైన జగన్‌ను బలహీనపరిచేందుకు టీడీపీ వ్యూహంలో భాగంగా పవన్‌కల్యాణ్ ముందుకెళుతున్నారన్నారు.
పవన్ బీజేపీ రోడ్ మ్యాప్ కాదు.. టీడీపీ రోడ్ మ్యాప్‌లో వెళ్లున్నారని వ్యంగ్యంగా అన్నారు. కౌలు రైతులు అంటూ టీడీపీ ఇచ్చిన మ్యాప్‌లో వెళ్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పెట్టుబడి సాయం పథకమే రైతు భరోసా అన్నారు. మీరు భరోసా ఇచ్చేదేంటి..?. విత్తనం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వం రైతు వెన్నంటే ఉందన్నారు. పవన్‌ది ఆవేశపూరిత రాజకీయం.. జగన్‌ది అర్థవంతమైన రాజకీయం అని మంత్రి కన్నబాబు అన్నారు.