సంతృప్తి…అసంతృప్తి…ఏమవుతుందో?

రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని సమూలంగా మార్చి, కొత్తవారికి అవకాశం ఇస్తా అన్న మాటను సిఎమ్ జగన్ నిలబెట్టుకునే ప్రయత్నంలో వున్నారు. మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఆశలు పెట్టుకున్న వారు, అవకాశం…

రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని సమూలంగా మార్చి, కొత్తవారికి అవకాశం ఇస్తా అన్న మాటను సిఎమ్ జగన్ నిలబెట్టుకునే ప్రయత్నంలో వున్నారు. మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఆశలు పెట్టుకున్న వారు, అవకాశం దక్కేవారి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చేసాయి. ఇళ్లకు వెళ్లిపోయే వారు తమ తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఇంకా రెండేళ్లకు పైగా సమయం వుంది కనుక పెద్దగా అసంతృప్తి బయటకు రాకపోవచ్చు. కానీ ఒకరిద్దరయినా రివర్స్ అవుతారా? కారా? అన్నది క్యూరియాసిటీ పాయింట్. ఎక్కడ ఏమాత్రం అసంతృప్తి కనిపించినా, వినిపించినా, దాన్ని కొండంతలు చేయడానికి తేదేపా అనుకూల మీడియా రెడీగా వుంది. ఈ చాన్స్ కోసమే చూస్తోంది ఆ మీడియా.

నిజానికి అందరికీ అవకాశాలు ఇవ్వడం అన్నది మంచి ఆలోచనే. కానీ పదవి అనుభవించిన వారికి మాత్రం వదులుకోవడం కాస్త కష్టంగానే వుంటుంది. వారిని జగన్ ఎలా ఓదార్చి, సంతృప్తి పరుస్తారో చూడాలి. కేవలం పార్టీ పదవులు అంటే కష్టమే. ఎందుకంటే పార్టీ పదవులు సమర్థవంతగా చేపట్టిన తరువాతే మంత్రులయ్యారు. మళ్లీ ఇప్పుడు రివర్షన్ అంటే కాస్త కష్టమే. మంత్రులుగా వుంటూ పార్టీ కోసం ఖర్చు చేసి బలోపేతం చేయమంటే అది వేరు. మంత్రి పదవులు లాగేసి, పార్టీ కోసం కష్టపడండి అంటే వేరు.

అందువల్ల వెంటనే పైకి రాకపోయినా, అసంతృప్తి అనేది కొంత వరకు తప్పకపోవచ్చు. అది వెంటనే బయట పడకపోయినా, ఎన్నికల వేళకు పరిస్థితిని బట్టి పెల్లుబకవచ్చు. ఈ సవాలు ను కనుక జగన్ సక్సెస్ ఫుల్ గా దాటేస్తే వేరు. కానీ అలాంటి వ్యవహారం వుంటుందా అన్న అనుమానాలు కనిపిస్తున్నాయి.

ఎందుకంటే ధరలు, పవర్ కట్ ఇంకా పలు విషయాల వల్ల సామాన్య ప్రజానీకం ఎఫెక్ట్ కావడం మొదలయింది. వీటి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగా కూడా లేవు. ప్రజల నాడి ని రాజకీయ నాయకులు సదా గమనిస్తుంటారు. ఏమాత్రం తేడాగా వుందని తెలిసినా, అసంతృప్తి బయటకు తన్నుకు వస్తుంది. లేదూ అంటే పళ్ల బిగువన ఆపుకుంటారు.

ఈ సీన్ ను బట్టే జగన్ సమర్థత బయట పడుతుంది.