పబ్ లో పట్టుబడటం అదృష్టమా.. దురదృష్టమా..?

హైదరాబాద్ డ్రగ్స్ పబ్ లో పట్టుబడ్డ వారిలో చాలామంది తమ ఐడెంటిటీ బయటపడుతోందని తెగ భయపడ్డారు. నాగబాబు కూతురు నిహారిక లాంటి వారు ఎంత కవర్ చేసుకున్నా.. ఆమె వీడియోలు సర్క్యులేట్ కాకుండా ఉండలేదు.…

హైదరాబాద్ డ్రగ్స్ పబ్ లో పట్టుబడ్డ వారిలో చాలామంది తమ ఐడెంటిటీ బయటపడుతోందని తెగ భయపడ్డారు. నాగబాబు కూతురు నిహారిక లాంటి వారు ఎంత కవర్ చేసుకున్నా.. ఆమె వీడియోలు సర్క్యులేట్ కాకుండా ఉండలేదు. కానీ కొంతమంది మాత్రం పబ్ వ్యవహారంలో బయటపడినందుకు లోలోపల సంతోషపడిపోతున్నారు. 

మీడియాను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమను కించపరిచేలా చూపించొద్దంటూనే మీడియా ముందుకొస్తున్నారు. ఇలాంటి వారందరికీ పరోక్షంగా ఈ పబ్ వ్యవహారం మరింత పాపులార్టీని తెచ్చిపెడుతోంది.

బజ్జీల పాపకు యమా క్రేజ్..

బజ్జీలు తినడానికి పబ్ కి వెళ్లానంటూ చెప్పిన ఓ అప్ కమింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది. నేను బజ్జీలు తినడానికి వెళ్లాను, చీజ్ బజ్జీలు తిన్నాను. రెగ్యులర్ గా చీజ్ బజ్జీల కోసం పబ్ కి వెళ్తానని చెబుతోంది అప్ కమింగ్ ఆర్టిస్ట్ కుషిత. ఒకసారి పబ్ ఇష్యూ జరిగాక.. ఎవరూ అంత ధైర్యంగా మీడియా ముందుకు రారు, రావాలనుకోరు. కానీ కుషిత మాత్రం ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఎడా పెడా ఇచ్చిపడేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ వీడియోలు పెడుతోంది. తనకు చాలా కాల్స్ వస్తున్నాయని, దయచేసి తనపై అసత్య ప్రచారం చేయొద్దని, తనకు కూడా కుటుంబం ఉందని వేడుకుంటోంది. సైలెంట్ గా ఉండకుండా, ఇదంతా ఆమె ఎందుకు చేస్తున్నట్టు.

రాహుల్ సిప్లిగంజ్ లాంటి వారికి ఆల్రడీ పాపులార్టీ ఉంది. కానీ పబ్ కి బజ్జీలు తినేందుకు వెళ్లానని చెప్పిన కుషిత ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఆమె ఇన్ స్టా ఫాలోవర్ల సంఖ్య రెండ్రోజుల్లోనే రెట్టింపైంది. అవకాశాలు వస్తాయా రాదా అనే విషయం పక్కనపెడితే.. రేపు కుషిత ఎక్కడ యాక్ట్ చేసినా “రాడిసన్ పాప కుషిత” నటించిన అంటూ నిర్మాతలు ప్రచారం చేసుకోవడం మాత్రం ఖాయం. ఒక్క కుషిత విషయంలోనే కాదు, చాలామంది ఇలాగే నెగిటివ్ పబ్లిసిటీతో విపరీతంగా పాపులర్ అయిపోతున్నారు.

మొత్తానికి పబ్ లో పట్టుబడటం నిహారిక లాంటి వారికి దురదృష్టం అయితే.. బజ్జీల పాప లాంటి వారికి మాత్రం ఇది అదృష్టమేనని చెప్పాలి. పోలీసులు, కేసులు, కోర్టులు.. ఈ వ్యవహారాలన్నీ పక్కనపెడితే.. ఈ ఎపిసోడ్ తో వచ్చిన పాపులార్టీ, వారికి ఇంకెప్పుడూ రాదేమో.