ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. కెరీర్ కూడా ఇలాంటిదే. ఉథ్ధాన పతనాలు అనివార్యాలు. తొలిప్రేమ ముందు వరకు థమన్ అంటే సోషల్ మీడియా మాంచి ఆట బంతి. ఎవరికి తోచినట్లు వారు ఆడేసుకోవడమే. తొలి ప్రేమ తరువాత థమన్ అంటే విపరీతమైన గౌరవాభిమానాలు పెరిగిపోయాయి.
విజయ్…ప్రభాస్..థమన్..మహేష్..చరణ్..పవన్..బాలయ్య..రవితేజ..ఇలా హీరో ఎవరైనా, బ్యానర్ ఏదైనా థమన్ చేతిలోనే వున్నాయి. రాజమౌళికి ఇంట్లో కీరవాణి వున్నారు కాబట్టి, సుకుమార్ కు దేవీశ్రీప్రసాద్ దోస్త్ కాబట్టి. లేదూ అంటే ఆ సినిమాలు కూడా థమన్ చేతిలోకి వచ్చేసి, శతశాతం రికార్డు సృష్టించేవాడు.
ఇంతకీ థమన్ విజయ సూత్రం ఏమిటి? కేవలం మంచి పాటలు, మంచి ఆర్ఆర్ అందించడమేనా?
ముమ్మాటికీ కాదు. థమన్ తపనే అతని విజయ సూత్రం. ఓ యాభై లక్షలు ఇస్తాం అన్నా అదే తపనతో ఆర్ఆర్ అందిస్తాడు. మూడు కోట్లు తీసుకున్నా ఆ సినిమా మీదే ఖర్చు చేసేస్తాడు. తీసుకున్న డబ్బులు మొత్తం దాచేసుకుని, ఏదో ఒకటి చేసి చేతులో పెట్టేయాలని అనుకోడు. రిజెక్ట్ చేసిన ట్యూన్లు ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని అనుకోడు. క్వాలిటీ కోసం ఎంతయినా ఖర్చు చేసేస్తాడు. ఎక్కడెక్కడి నుంచో మ్యూజిషియన్లను రప్పిస్తాడు. ఇంకా కొత్తగా ఏం చేయగలను అని తపిస్తాడు.
ఎవరెవరో కవర్ సాంగ్ లు చేస్తుంటే, రొటీన్ లిరికల్ విడియో ఎందుకు అని తానే కొత్త మార్గం తొక్కి పాటలకు మిలియన్లకు మిలియన్ల వ్యూస్ వచ్చే మార్గం కనిపెట్టేసాడు. ఇప్పుడు ఆ రూటు సెపరేటు రూటుగా మారిపోయింది.
అడియో ఫంక్షన్ అంటే మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోడు. అందర్నీ పొగిడేసి, జిమ్మిక్కులు చేసి మాయం అయిపోడు. స్టేజ్ మీద లైవ్ పెర్ ఫార్మెన్స్ లు చేసి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తాడు. పెద్ద సినిమాలు చేతిలో వున్నాయని మిడ్ రేంజ్ సినిమాలు వదులుకోడు. అలా అని వాటికి ఏదో చేసేసా అని మాయ చేయడు. సిన్సియర్ గా ఎఫెర్ట్ పెడతాడు.
పంతం మీద థమన్ ను కాదని ఏదో ప్రయత్నాలు చేసినా, తరువాత లెంపలు వేసుకున్న హీరోలు, దర్శకులే ఎక్కువ. కష్టాల్లో పెరిగిన వాడు..కష్టం తెలిసినవాడు..కష్టపడడం నేర్చిన వాడు. అందుకే థమన్ ఇప్పుడు టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరక్టర్ ఫర్ ఆల్ డైరక్టర్స్ అండ్ హీరోస్ గా మారిపోయాడు.