జనసేనాని పవన్‌కల్యాణ్ మనసు నిండా వైఎస్ జగన్‌పై ద్వేషం పెంచుకున్నారు. ఇదే పవన్ పతనానికి, జగన్ ఎదుగుదలకు దోహదం చేస్తోంది. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని ప్రగల్భాలు పలికిన, పలుకుతున్న పవన్‌కల్యాణ్… ఇంత వరకూ ఆ పని చేయలేదు. పార్టీ పెట్టిన మొదలుకుని చంద్రబాబు పల్లకీ మోయడానికే పుణ్యకాలం కాస్త సరిపోయింది. బాబు పల్లకీ మోయలేదని పవన్ చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు 2014లో తన వల్లే టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని పదేపదే పవన్ చెప్పడం తెలిసిందే.
అవినీతిపరుడైన వైసీపీ అధినేత జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చానని గతంలో పవన్ చెప్పారు. పదేళ్ల తర్వాత కూడా పవన్ అదే విషయం మాట్లాడ్డం ద్వారా, అతనిలో మార్పేమీ రాలేదని తెలిసిపోతోంది. 2019లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను సీఎం కానివ్వనని పవన్ భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అయినప్పటికీ ప్రజాదరణ ముందు పవన్ శపథాలు, శాపాలేవీ పనిచేయలేదు.
ఇప్పుడు మరోసారి పవన్ అదే తప్పు చేస్తున్నారు. అదే జగన్ పాలిట వరమవుతోంది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పవన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘నేను చెబుతున్నా…. 2024లో వైసీపీ ప్రభుత్వం రావడంలేదు. కచ్చితంగా రాదు. మీరు ఏమైనా గింజుకోండి, తిట్టుకోండి! అరాచకాలు, విధ్వంసాలతో రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లిన మీకు… ఓట్లు అడిగే హక్కులేదు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని మార్చి 14న జరిగిన సభలో చెప్పాను. ఇది నేను బాగా ఆలోచించి చెప్పిన మాట. ఇది… సరదాగా చెప్పిన మాట కాదు. మేం ఎవరి పల్లకీలు మోయడానికి ఇక్కడ లేం. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకే వచ్చాం ’ అని అన్నారు.
2024లో జనసేనదే అధికారమని పవన్ ధీమాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుని, ఆ స్థానంలో ఏ పార్టీని కూచోపెడుతున్నారనే ప్రశ్నకు పవన్ దగ్గర సమాధానం ఏదీ? అదేమంటే ప్రజల్ని పల్లకీ ఎక్కించేందుకు వచ్చామని పవన్ పొంతన లేని ప్రసంగం. రాజకీయాలపై స్పష్టత ఉన్నవారెవరైనా ఇలా మాట్లాడ్తారా? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న నాయకుడెవరైనా, మరో రాజకీయ పార్టీ అధినేత చంద్రబాబును సీఎం చేయాలని అనుకుంటారా?
జగన్‌ను అధికారం నుంచి దించేందుకు పవన్ మాటలు జనం ఎందుకు వినాలి? ఎక్కడైనా తాము అధికారంలోకి వస్తే ఫలానా మంచి పనులు చేస్తామని చెప్పడం చూశాం. అదేంటో గానీ, పవన్ రాజకీయం చాలా చిత్రవిచిత్రంగా ఉంది. జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు, వస్తే దించడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించిన ఏకైక నాయకుడు పవన్‌కల్యాణ్ మాత్రమే.
ఇదే రాజకీయంగా పవన్ ఫెయిల్యూర్‌కు పునాది వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పదేపదే జగన్ గురించి మాట్లాడితే ….కొద్దోగొప్పో వెనక ఉన్న వాళ్లు కూడా జారిపోయే ప్రమాదం లేకపోలేదు.