ఓట్ల చీలిక‌.. ప‌వ‌న్ డ్యామేజ్ క‌వ‌రేజ్?

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌బోం.. అంటూ త‌ను చేసిన వ్యాఖ్య ఉద్దేశం ఏమిటో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చెప్పినా, అంద‌రికీ అందులో ఏం అర్థ‌మ‌వ్వాలో అదే అర్థం అవుతోంది. తెలుగుదేశం పార్టీతో మ‌ళ్లీ జ‌ట్టు…

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును చీల్చ‌బోం.. అంటూ త‌ను చేసిన వ్యాఖ్య ఉద్దేశం ఏమిటో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చెప్పినా, అంద‌రికీ అందులో ఏం అర్థ‌మ‌వ్వాలో అదే అర్థం అవుతోంది. తెలుగుదేశం పార్టీతో మ‌ళ్లీ జ‌ట్టు క‌ట్టేందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ ముంద‌స్తుగా అలాంటి మాట‌లు మాట్లాడార‌ని.. స్ప‌ష్టం అవుతోంది. 

చంద్ర‌బాబుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ర‌హ‌స్య మిత్రుడుగా మెలుగుతున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌దే ప‌దే  చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఊతం ఇచ్చేలానే మాట్లాడారు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా!

త‌న తాజా మిత్ర‌ప‌క్షం భార‌తీయ జ‌న‌తా పార్టీకి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ తన ఉద్దేశ్యాన్ని ఆ మాట ద్వారా స్ఫ‌ష్టం చేసిన‌ట్టుగానే ఉంది. చంద్ర‌బాబు ప‌ల్ల‌కి మోయ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి రెడీ అవుతున్నాడ‌ని.. ఆయ‌న వ్యాఖ్య‌లే క్లారిటీ ఇస్తున్న వేళ ఆయ‌నే మ‌రోసారి స్పందించారు! త‌న మాట‌లు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉలికి ప‌డుతోంద‌ని అంటున్నారు పీకే!

అయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త‌గా ఉలికి ప‌డ‌టానికి ఏముంది? ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతంగా పోటీ చేసినా, చంద్ర‌బాబుతో జ‌ట్టు క‌ట్టినా.. ఆయ‌న చంద్ర‌బాబు చేతిలో మ‌నిషే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. రేపు నిజంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీతో మాత్ర‌మే కలిసి పోటీ చేసినా, లేదా అంద‌రినీ ప‌క్క‌న పెట్టి.. సొంతంగా పోటీ చేసినా, ప‌వ‌న్ క‌ల్యాణ్ లో చంద్ర‌బాబు వ్యూహాన్నే చేస్తారంతా! ఇది ప‌వ‌న్ సాధించుకున్న ఇమేజ్ మ‌రి!

అద‌లా ఉంటే.. జ‌న‌సేన ఎవ‌రి ప‌ల్ల‌కి మోయ‌బోద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చాడు. తాము జ‌నం ప‌ల్ల‌కి మాత్ర‌మే మోస్తామ‌ని అర్థం కాన‌ట్టుగా ఏదో చెప్పాడు పీకే. మ‌రి జ‌న‌సేన అవిర్భావం ద‌గ్గ‌ర నుంచి చేస్తోంది ఏమిటి? 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీని, చంద్ర‌బాబును మోయ‌లేదా! 

మోడీని అయినా మ‌ధ్య‌లో దించేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు మ‌ళ్లీ ఎత్తుకున్నాడు కానీ.. చంద్ర‌బాబును ఇప్ప‌టికీ మోయ‌డం లేదా! చంద్ర‌బాబుకు తోడు లోకేష్ భారం జ‌న‌సేన మోస్తున్న ప‌ల్లకిలో లేదా!