ప‌వ‌న్.. అప్పుడూ జ‌గ‌న్ పై ఇలానే అన్నావ్!

'జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్న‌టికీ, ఎప్ప‌టికీ సీఎం కాలేరు. నేను చెప్తున్నాను. ఇది శాస‌నం..' అంటూ అప్ప‌ట్లో ఏదేదో మాట్లాడారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రు గ‌ద్దెనెక్కాల‌న్నా, ఎవ‌రు దిగాలన్నా.. అది…

'జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్న‌టికీ, ఎప్ప‌టికీ సీఎం కాలేరు. నేను చెప్తున్నాను. ఇది శాస‌నం..' అంటూ అప్ప‌ట్లో ఏదేదో మాట్లాడారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రు గ‌ద్దెనెక్కాల‌న్నా, ఎవ‌రు దిగాలన్నా.. అది ప్ర‌జ‌ల చేతిలో ప‌ని. జ‌న‌సేన అంటూ త‌న పార్టీ పేరు పెట్టుకుని.. త‌న మాటే శాస‌నం అని, బాహుబ‌లి శివ‌గామి లెవ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వాకృచ్చారు అప్ప‌ట్లో!

ఆ త‌ర్వాత ఏం జరిగిందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఎన్న‌టికీ సీఎం కాలేర‌ని వ్యాఖ్యానించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌టికి రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయారు. ఆయ‌న పార్టీ అసెంబ్లీలో అడ్ర‌స్ ను సంపాదించుకోలేక‌పోయింది. అత్యంత అహంభావంతో స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు దారుణ‌మైన అవ‌మాన‌మే మిగిలింది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇప్పుడు కూడా అదే రీతిన మాట్లాడుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఈసారి ఏమంటారంటే.. ఈ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఏర్ప‌డ‌దు అని! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రాదు.. అంటూ అంటున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌! 

మ‌రి మ‌రోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుందా రాదా అనేది డిసైడ్ చేయాల్సింది ప్ర‌జ‌లు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌లు వింటే మాత్రం… ఆయ‌న గ‌తంలో పలికిన మాట‌లే గుర్తుకు రాక‌మాన‌వు! జ‌గ‌న్ ఎన్న‌టికీ సీఎం కాలేడంటూ అప్పుడు అన్నారు. ఆ త‌ర్వాత క‌థ మ‌రోలా సాగింది. 

ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి రాదు.. అని ప‌వ‌న్ క‌ల్యాణే చెబుతున్నారు. ఈ మాట‌లో గ‌త శృతే ధ్వ‌నిస్తున్న‌ట్టుగా ఉంది లీల‌గా!