విశాఖ జిల్లా ఆరు జిల్లాలతో బుల్లి జిల్లాగా ఏర్పాటు అయింది. అయితే విశాఖ జిల్లాలో పెందుర్తిని కలపమని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఏకంగా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కూడా దీని మీద వినతిపత్రం ఇచ్చారు. మొత్తానికి తుది నోటివికేషన్ లో విశాఖలో పెందుర్తి నియోజకవర్గం కాకపోయినా మండలాన్ని కలిపారు. అయితే దీని వెనక పెందుర్తిలోని శ్రీ శారదాపీఠం అధిపతి చక్రం తిప్పారు అని అంటున్నారు.
దాంతో కొత్త జిల్లాల ప్రకటన ఇలా వెలువడడంతోనే అలా స్వామీజీ ఆశ్రమానికి రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు, బడా బాబులు క్యూ కట్టారు. స్వామిని దర్శించుకుని ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కూడా స్వామిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్ధికంగా భౌగోళికంగా, రాజకీయంగా కీలకంగా పెందుర్తి ఉండడం, అభివృద్ధి చెందిన విశాఖతో ఉంటేనే ఇక్కడ అన్ని విధాలుగా లాభమని చాలా మంది భావించారు. గతంలోనే అంతా కలసి స్వామికి దీని మీద విన్నవించారు. గత నెలలో పీఠానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కి ఈ విషయంలో స్వామి జనం నుంచి వచ్చిన విన్నపాలను వివరించారని, దానికి అనుగుణంగా తుది నోటిఫికేషన్ లో సవరణలు చేశారని అంటున్నారు.
మొత్తానికి స్వామి మంత్రం ఫలించిందని పెందుర్తి రాజకీయ జీవులతో పాటు సగటు జనాలు అంటూంటే పీఠం నిర్వాహకులు మాత్రం తమకు అన్ని ప్రాంతాలు సమానమే అని లోకమంతా సుభిక్షంగా ఉండాలన్నదే పీఠం ఆలోచన అని చెబుతున్నారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో ఇదంతా సాధ్యపడింది అంటున్నారు. మొత్తానికి స్వామి మళ్లీ ఈ విధంగా వార్తలలోకి వచ్చేశారు.