బొందితో స్వర్గానికి వెళ్లడం అనేది మనకు ఓ సామెత మాత్రమే. నిజంగా అలా వెళ్లి తన పనులు చక్కబెట్టుకు వస్తే? అన్న థీమ్‌తో 1960లో బెంగాలీలో ఓ సినిమా వచ్చింది. ఓ నాటకాలరాయుడు పరలోకానికి వెళ్లి అక్కడంతా అల్లకల్లోలం చేసేసి తన ప్రేయసి కోసం అక్కడివారిని మెప్పిస్తాడు, ఒప్పిస్తాడు. దాని ఆధారంగా సి. పుల్లయ్యగారు తెలుగులో ''దేవాంతకుడు'', తమిళంలో ''నాన్ కణ్డ స్వర్గం'' తీశారు. మళ్లీ 17 ఏళ్లకు అంటే 1977లో యిలాటి థీమ్‌తోనే, చాలా మార్పులతో ''యమగోల'' వచ్చింది. బెంగాలీ సినిమా పేరుకి అర్థం – య(జ)మాలయే అంటే యముని నివాసం, నరకంలో.. జీవంత.. బతికున్న మానుష్, మనిషి అని. డానూ బెనర్జీ హీరో, బాస్మీ నంది హీరోయిన్. దాని ఆధారంగా తీసిన తమిళ సినిమా పేరు – నాన్ కణ్డ స్వర్గం. 'నేను చూసిన స్వర్గం' దీనిలో హీరో తంగవేలు. హీరోయిన్ ఇటీవలే పద్మశ్రీ వచ్చిన షావుకారు జానకి. దాని తెలుగు వెర్షన్ ‘‘దేవాంతకుడు’’లో ఎన్టీయార్, జానకి చెల్లెలు కృష్ణకుమారి హీరోహీరోయిన్లుగా వేశారు. రెండింటిలోనూ యముడిగా ఎస్వీ రంగారావు వేశారు. ఇక ''యమగోల''లో ఎన్టీయార్, జయప్రద వేశారు. ఈ సారి యముడు సత్యనారాయణ!
బెంగాలీ కథ చాలా సింపుల్. హీరో డబ్బులేనివాడు. వెనకా ముందూ ఎవరూ లేరు. ఓ అత్త ఒకావిడ వుందంతే. ఊళ్లో యువజనసంఘం పెట్టి సాంఘిక కార్యకలాపాలు చేస్తూ వుంటాడు. నాటకాలు వేస్తూ వుంటాడు. ఇవన్నీ హీరోయిన్‌కు నచ్చుతాయి కానీ ఆమె తండ్రికి నచ్చవ్. హీరోయిన్‌కు మంచి సంబంధం చూసి చేద్దామని అతని ప్లాను. ఆమెకు నచ్చినవాడికే యివ్వవచ్చు కదా అని తల్లి వాదిస్తుంది. తన డ్రామా ట్రూపువాళ్లు వూదరగొట్టడంతో హీరో ఎట్టకేలకు ఓ రోజు ధైర్యం చేసి వచ్చి అడిగేశాడు, తిట్లు తిన్నాడు. తండ్రిని నమ్ముకుంటే లాభం లేదని ఓ రోజు పూజారిని బెదిరించి దొంగతనంగా గుళ్లో పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి కాగానే హీరోయిన్ తండ్రి వచ్చి ఆమెను లాక్కుని పోయాడు. హీరోని చంపేయమని గూండాలకు చెప్పడం విని సుమంగళిగానే పోతే మంచిదనుకుని ఆమె నదిలో వురికింది. ఆమె మరణవార్త విని హీరో హతాశుడయ్యాడు. తనకున్న ఆవును గోదానంగా యిచ్చేసి చావుకి సిద్ధమయ్యాడు.
బెంగాలీ ఒరిజినల్లో హీరోయిన్ పాటలు పాడగలదు కానీ అంతకు మించి ఆమెకేమీ రాదు. తమిళ వెర్షన్లో అయితే ఆటా, పాటా వచ్చు. హీరోతో కలిసి నాటకాలు వేస్తుంది. అనుకోకుండా తండ్రి హాలుకి వస్తే యింట్లోనే వున్నట్టు బురిడీ కొట్టించగలదు కూడా. ప్రేయసీ ప్రియుల మధ్య హంసరాయబారం లేకపోయినా ఆంబోతు రాయబారం వుంది. ఆంబోతు మెడలో వుత్తరం పెట్టి టిక్‌టిక్ కొడితే హీరోయిన్ వచ్చి తీసుకుంటుంది. ఈ టిక్‌టిక్ ట్రిక్కు బెంగాలీ ఒరిజినల్నుంచి తెచ్చుకున్నదే. చివరకు హీరోయిన్ కోరిక మేరకు వచ్చి పిల్లనిమ్మని అడిగేశాడు. ఒరిజినల్లో లాగానే తిట్లు తిన్నాడు. ఇతని బారినుండి తన కూతుర్ని కాపాడుకోవడానికి హీరోయిన్ తండ్రి రౌడీలను పెడితే హీరో ఆడవేషంలో తప్పించుకుని వెళ్లిపోయాడు.
చివరకు ముసలి డాన్సు మేస్టారి అవతారం ఎత్తి వాళ్లింట్లో తిష్ట వేశాడు. డబ్బుకి ఆశపడి హీరోయిన్ తండ్రి ఓ ముసలాడికిచ్చి కట్టపెట్టబోయాడు. తల్లి వ్యతిరేకించింది. హీరోతో పెళ్లి జరగడానికి సహకరించింది. పెళ్లి వేళ హీరోయిన్ పనిమనిషి వేషంలో పారిపోయింది. డాన్సుమేస్టారి వేషంలో ఇక్కడ హంగు చేస్తూనే ఆఖరి నిమిషంలో గుడికి వెళ్లి పెళ్లి చేసేసుకున్నాడు హీరో. ఒరిజినల్లో లాగానే పెళ్లవగానే హీరోయిన్ తండ్రి తీసుకుని పోవడం, ఆమె నదిలో పడడం జరుగుతాయి. ఒరిజినల్లో హీరోకి మరీ అంత దెబ్బలు తగలవు కానీ, దీనిలో మాత్రం బాగా చావుదెబ్బలు తింటాడు. చావు దగ్గర పడిందని ఆంబోతుదానం చేస్తాడు.
ఇక ‘‘యమగోల’’ సినిమా వచ్చేసరికి చాలా మార్పులు వచ్చిపడ్డాయి. హీరో హీరోయిన్లకు బంధుత్వం పెట్టారు. వాళ్ల కుటుంబాల మధ్య వైరం పెట్టారు. విలన్ రావు గోపాలరావు పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు. అక్రమాలు చేస్తాడు. అతని కూతురు జయప్రద బావ ఐన ఎన్టీయార్‌ను ప్రేమిస్తుంది. అతని పేరు సత్యం. ఊళ్లో యువజనసంఘం పెట్టి విలన్ అక్రమాలను ఎదిరిస్తాడు. చివరకు ఎన్నికల్లో ఓడించాడు. తను ప్రెసిడెంటు అయ్యాక వూరికి మంచిపనులు చేసి విలన్‌తో తలపడ్డాడు. అతను చేసే వెధవ పనులను బయటపెట్టి వూరంతా పోస్టర్లు వేయించాడు. ఇవన్నీ చేస్తూనే వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తూ అవసరమైతే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటానని అంటూ వుంటాడు. జయప్రద కూడా బావనే చేసుకుంటానంటుంది. విలన్ వేరే వూరినుండి సంబంధం తేబోతే, యీమె పేర శుభలేఖలు వేయించి వాళ్లకు కూడా పంపాడు హీరో. దాంతో విలన్‌కి ఒళ్లు మండిపోయి, అతన్ని చంపించేయాలనే కుట్ర పన్ని ఓ హంతకుణ్ని పురమాయించాడు.
అతని తాలూకు మనిషి వచ్చి తను అతి సులభంగా చంపేయగలనని చెప్పి హీరోని మెడకు వురి బిగించి, విలన్ యింట్లో నేలమీద పడుక్కోబెట్టి వెళ్లాడు. తను శ్మశానంలో గొయ్యి తవ్వేదాకా శవజాగరణ చేయమని చెప్పి విలన్‌కి, అనుచరుడికి చెప్పి వెళ్లాడు. వాళ్లు అలా వెయిట్ చేస్తూవున్నారు. హీరో మృత్యుముఖంలో వున్నాడు. ఇక అప్పణ్నుంచి ఫాంటసీ ప్రారంభమవుతుంది. సినిమాలో సగభాగం పైగా వుండే ఈ ఫాంటసీ అంతా చావుబతుకుల్లో ఊగిసలాడుతున్న హీరో కల అని చివర్లో తెలుస్తుంది. మూడు సినిమాల్లోనూ యిదే థీమ్. దాని ప్రకారం యమభటులు ఓ తప్పుడు ఎడ్రసు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లకు కావలసిన శవం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనబడటం లేదు. ఒట్టి చేతుల్తో వెళితే ఉద్యోగం పోతుంది. హీరో చూస్తే యింకాస్సేపట్లో చచ్చేట్టున్నాడు. తీసుకుని బయలుదేరితే దార్లోనే పోవచ్చు. అప్పుడు ఆత్మను బయటకు లాగవచ్చు. ఒకవేళ చావలేదనుకో యమలోకం తీసుకెళ్లాక నరికి పారేస్తే సరి అనుకున్నారు.
వాళ్లు ఇదంతా హీరోకి చెప్పేశారు కూడా. నేను రాను పొమ్మన్నాడు అతను. బెంగాలీ, తమిళాల్లో ‘నీ లవర్ ఎలాగూ చనిపోయింది. అక్కడకు వస్తుంది, అక్కడ కలవవచ్చు’ అని చెప్పారు వారు. ‘సరే అయితే మోసుకుపొండి’ అన్నాడతను. వెళ్లే ప్రయాణంలో తమిళంలో కొంత కలిపారు. యమభటులకు సిగరెట్ పొగ పడదని హీరోకి తెలుస్తుంది. యమలోకం వెళ్లాక వాళ్లు తనని చంపబోతూ వుంటే తప్పించుకోవడానికి అది ఉపకరిస్తుంది. బెంగాలీ ఒరిజినల్లో కితకితలు పెట్టి తప్పించుకుంటాడు. యమధర్మరాజు కేసులు విచారిస్తూ వుంటే హీరో అక్కడకు పారిపోయి వస్తాడు. యమధర్మరాజు కొలువులో శిక్షలు వేసే విధానాన్ని హీరో విమర్శించాడు. సరైన విచారణ జరగటం లేదని ఎత్తి చూపాడు.
‘‘యమగోల’’లో హీరో నరకానికి రావడానికి ముందు స్వర్గానికి వెళ్లాడు. అతని ఖాతాలో ఉన్న కాస్త పుణ్యం ఖర్చయేవరకూ స్వర్గం తీసుకెళ్లారు. అక్కడ ప్రాంతీయ భేదాలతో కొట్టుకుంటున్నవారికి బుద్ధి చెపుతూ ఓ పాట పాడాడు. గత చరిత్ర తవ్వి ఇంద్రుణ్ని చాకిరేవు పెట్టాడు. ఇంద్రుడు కోపంతో మండిపడి శిక్షించే లోపున అతని గడువై పోయి యమలోకానికి తీసుకుపోయారు. ఒరిజినల్లో యమలోకం తర్వాత ఇంద్రలోకానికి వస్తాడు. యముడి కొలువులో పాపపుణ్యాల లెక్కల మీద చాలా జోకులు పేల్చారు ఒరిజినల్ బెంగాలీలో, తర్వాత తమిళంలో కూడా! హీరో మేనత్త కూడా పోతుంది. ఆవిడ ఏకాదశినాడు ఉపవాసం వుండి జాంపండు తిందామనుకుంది కాబట్టి పాపం ఖాతాలో రాశాడు చిత్రగుప్తుడు. ఆచరించకపోయినా, కేవలం అనుకున్నంత మాత్రాన పాపమే అయితే యిక్కడకు వచ్చేదారిలో నేను చాలా మంచి పనులు చేస్తానని అనుకున్నాను కదా అవి నా పుణ్యం ఖాతాలో రాయలేదేం అని నిలదీశాడు హీరో.
అది నా ఖాతాలో రాసి ఆ పుణ్యాన్ని మా అత్తపేర ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగాడు. ఆడదైన మా అత్తను తీసుకురావడానికి ఆడభటులు లేరేం? అని అడిగాడు. నన్ను ప్రాణాలతో తీసుకుని వచ్చేట్లా తప్పు చేసిన చిత్రగుప్తుడికి శిక్ష పడాలన్నాడు. ఇవన్నీ పడలేక నువ్విక్కడనుంచి వెళ్లిపో అన్నాడు యముడు. స్వర్గం పంపిస్తే నా భార్యను కలుస్తానన్నాడు హీరో. దానికి అనుమతి లేదు, కావాలంటే యీ లోకంలోనే నీ ఆంబోతు నెక్కి తిరుగు. నువ్వు చచ్చిన మూడోరోజునే అదీ చచ్చి యిక్కడకు చేరింది. అది నీ మాట తప్ప వేరెవరి మాటా వినదని వరం యిస్తున్నాను అన్నాడు యముడు. అప్పుడు హీరో ఆంబోతు వద్దకు వెళ్లి ఈ యముణ్ని, చిత్రగుప్తుణ్ని కొమ్ములతో పొడిచేయ్ అన్నాడు. అంతే, దాంతో యముడు, చిత్రగుప్తుడు ప్రాణాలు దక్కించుకోవడానికి యమలోకం వదలి పారిపోయారు.
యమగోల 1977లో వచ్చింది. ఎమర్జన్సీ అయిపోయి, ఆనాటి దుష్కృత్యాలు బయటపడుతున్న రోజులవి. అందుకే ఎమర్జన్సీని 'యమ అర్జన్సీ' అని పన్ చేయడంతో బాటు, ఆనాటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ గురించి, పదవులు లేకుండా పెత్తనం చలాయించిన యువజన నాయకుడు (సంజయ్ గాంధీ) గురించి, ఎంక్వయిరీ కమిషన్ల గురించి, చీటికిమాటికీ సమ్మెలు చేసే కార్మిక నాయకుల గురించి జోకులు పేల్చారు. అవన్నీ చాలా బాగా పేలాయి. యముణ్ని తరిమేశాక హీరోయే కొత్త యముడు అయిపోయాడు. అప్పటిదాకా చిత్రగుప్తుడి అసిస్టెంటుగా నలుగుతూ ఉద్యోగం పర్మనెంట్ కాని విచిత్రగుప్తుణ్ని తన ప్రధానమంత్రిగా నియమించుకుని కొత్త రూల్సు ఫ్రేమ్ చేయడం మొదలెట్టాడు.
ఉద్యోగం పోగొట్టుకున్న యముడు విష్ణువుతో ఫిర్యాదు చేస్తే ఆయన సంగతి కనుక్కుని రమ్మనమని నారదుణ్ని పంపాడు. హీరో నారదుణ్ని కంగారు పెట్టేశాడు, ఎప్పుడూ పాతపాటలేనా, కొత్త పాటలు పాడకూడదా అంటూ. ఇతనితో పడలేక నారదుడు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే ఆయన ఓ హారం యిచ్చి పంపాడు. నారదుడు దాన్ని హీరోకి యిచ్చి నువ్వు కావలసినన్ని లోకాలు తిరిగి నీ భార్య ఎక్కడుందో వెతుక్కో అన్నాడు. ఒక్కసారి చూసిన తర్వాత వెనక్కి భూలోకానికి వెళ్లిపోవాలి అన్నాడు. సరేనన్నాడు హీరో. తమిళంలో యిలా వుంటే, ఒరిజినల్ బెంగాలీలో విష్ణువే స్వయంగా వచ్చి యిస్తాడు.
బెంగాలీ హీరో మొదట కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివుడి అనుచరులైన భూతాల డాన్సు చూశాడు. ఆ తర్వాత భృంగి, నంది అనుచరులు సిగపట్లు పట్టుకోవడం చూశాడు. ఆ తర్వాత భృంగి, నందిలతోనే ముచ్చటలాడాడు. తమిళంలో కైలాసానికి వెళ్లి జస్ట్ హలో అనడం చూపారు. దారిలో స్పుత్నిక్ను కూడా చూశాడు. ఆ తర్వాత స్వర్గానికి వెళ్లాడు. అక్కడ హీరోయిన్ను కలిశాడు. ఇక యమగోల హీరో యిలా లోకాలు పట్టుకుని తిరగలేదు. యమలోకంలోనే యమహడావుడి చేశాడు. అక్కడ అధిక పనిభారంతో బాధపడుతున్న వర్కర్ల సమస్యలు తెలుసుకుని యూనియన్ లేవదీశాడు. యముడి మీదకు ఉసి గొల్పాడు. యుముడి వద్ద చాకచక్యంగా మాట్లాడి అతని ఆదరాన్ని సంపాదించాడు. అష్టదిక్పాలకుల్లో అందరి కంటె హీనమైన ఉద్యోగం యముడిదేనని నమ్మించాడు. నరకానికి లాకౌట్ విధించి, భూలోకానికి వచ్చి మారిన పరిస్థితులను స్వయంగా పరిశీలించి తన ధర్మసూత్రాలను రివైజ్ చేయవలసిన అవసరం వుందని ఒప్పించాడు.
ఈ విధంగా యమగోల సినిమాలో హీరో భూలోకానికి తిరిగి వెళ్లాడు. ఎందుకంటే అతని ప్రేయసి అక్కడ వుంది. కానీ ఒరిజినల్లో అతని ప్రేయసి మరణించి స్వర్గంలో వుంది కాబట్టి హీరో స్వర్గానికే వెళ్లాడు. అక్కడ ఓ తోటలో హీరోయిన్ కలుస్తుంది. ఇద్దరూ ఇంద్రసభలో అప్సరసల డాన్సు చూశాడు. ఇదేం డాన్సు, మోడర్న్ డాన్సు చేయాలి కానీ అన్నాడు హీరో. బెంగాలీలో హీరోయిన్‌చేత ఓ మామూలు డాన్సు పెట్టారు కానీ తమిళంలో 'పార్, పార్ సాంబారే' అనే హుషారైన పాట పెట్టారు. దాని తెలుగు వెర్షన్ 'దేవాంతకుడు'లో 'గో గో గో గోంగూర' అని పాట పెట్టారు. దాంతో ఇంద్రుడు మురిసిపోయి అప్సరసలకు నాట్యం నేర్పే వుద్యోగం అప్పగించాడు.
ఇలా నడుస్తూండగానే బెంగాలీలో విష్ణువు వద్దనుండి కబురు వచ్చింది, తన భార్యను చూసేసాడు కాబట్టి తక్షణం కిందకు వెళ్లిపోవాలని. కానీ హీరో నేను స్వయంగా మొరపెట్టుకుంటా అంటూ విష్ణులోకానికి పయనమయ్యాడు. కానీ తమిళంలో యింకో అంశం చేర్చారు. ఇంద్రసభలో హీరో 'మానవుడు ఆటంబాంబు కనిపెట్టాడు. వాటి ముందు మీ పాత ఆయుధాలు బలాదూర్' అని బెదిరించాడు. దిక్పాలకులందరూ కలిసి అతన్ని బెల్లించి రహస్యాలు లాగుదామని చూస్తే, ఇతను వాళ్లను ఏమార్చి భార్యతో సహా స్పుత్నిక్ ఎక్కి విష్ణులోకం పారిపోయాడు. అక్కడ విష్ణువుని ‘నా భార్యను బతికించి నాతో భూలోకం పంపమ’ని వేడుకున్నాడు. సావిత్రీ సత్యవంతుల కథ చెప్పి, నేను నా భార్యను బతికించుకునేట్లా చేయకపోతే మగజాతికే అవమానం అని మెలిక పెట్టాడు. విష్ణువు నవ్వుకుని సరేనన్నాడు.
హీరో నవ్వుకుంటూ నిద్ర మేలుకున్నాడు. ఇదంతా కలే అని తెలిసింది. ఇంతలో నదిలో పడిన అతని భార్య దొరికింది. చచ్చిపోయిందని ఆశ వదులుకున్నారు కానీ కలలో దేవుడిచ్చిన వరం గుర్తుకు తెచ్చుకుని, టిక్‌టిక్ సౌండు చేసి ఆఖరి ప్రయత్నం చేశాడు. ఆమె బతికింది. బెంగాలీ, తమిళ సినిమాలు యిలాగే ముగిశాయి కానీ యమగోలలో యింకా బోల్డు కథ వుంది. నరకానికి లాకౌట్ ప్రకటించడంతో చచ్చిన వాళ్లందరూ బతికి వచ్చారు. అనుచరుడు వచ్చేదాకా ఆగకుండా విలన్ గోతిలో కప్పి పెట్టేసిన హీరో కూడా లేచి బతికివచ్చాడు. వెంటనే సుందరం అని మారుపేరు పెట్టుకుని విలన్ వద్దకు వెళితే సత్యం హత్యకేసులో పీకలదాకా మునిగి వున్న అతను నువ్వే సత్యంగా నటించు అని బతిమాలాడు.
ఇక భూలోక స్థితి తెలుసుకోవడానికి మామూలు మనుషుల్లా భూలోకానికి వచ్చిన యముడు, చిత్రగుప్తుడు చాలా కష్టాలు పడ్డారు. చివరకు ఓ లాజ్ రెయిడ్‌లో పట్టుబడి లాకప్‌లో పడి హీరో జామీనుతో బయటపడ్డారు. వాళ్ల వద్ద నున్న బంగారం దాచుకున్న పెట్టె చూసి చూసి విలన్ కళ్లు కుట్టాయి. మాయోపాయంతో అది కొట్టేద్దామని చూశాడు. తన యింట్లో ఆతిథ్యం యిచ్చాడు. హీరో చెప్పినమీదట హీరోయిన్ యముణ్ని మంచి చేసుకుంది. ఆమె అంటే అభిమానం పెంచుకున్న యముడు ఆమె పెళ్లికి వచ్చి దీర్ఘ సుమంగళీభవ అని ఆశీర్వదించాడు. అప్పుడు హీరో తనే ఆమె భర్తనని చెప్పుకుని ఇప్పుడు యమలోకం వస్తే యముడి ఆశీర్వాదం వట్టిపోతుందని వాదించాడు. యముడు సరేనన్నాడు.
ఇక్కడితో హీరో కల ముగిసింది. నిజానికి అతన్ని చంపినట్టుగా నటించిన ప్రభాకరరెడ్డి అతని మిత్రుడే. విలన్ ఆటకట్టించడానికి అతను పోలీసులను తెచ్చేలోపున హీరో నిద్రపోయి కల గన్నాడన్నమాట. పోలీసులు వచ్చి విలన్‌ను అరెస్టు చేయబోతే అతను కాళ్లబేరానికి వచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దాంతో కథ సుఖాంతం అయింది. బెంగాలీ ఒరిజినల్ చాలా తక్కువ ఖర్చులో తీసినట్టుంటుంది. దాని కథాంశాన్ని పెంచుకుని తెలుగులో, తమిళంలో పుల్లయ్యగారు తీశారు. దాంతో మంచి కామెడీ తయారైంది. 17 సంవత్సరాల తర్వాత డి వి నరసరాజు గారు ఆ కథను చాలా పెంచి, మలుపులు పెట్టి పొలిటికల్ సెటైర్‌గా మార్చి యమగోల రాశారు. భారీ తారాగణంతో సినిమా భారీగా తయారై హిట్ అయింది. దీన్ని హిందీలో లోక్-పర్లోక్ అనే పేరుతో జితేంద్రతో తీశారు. ఇదీ ''యమగోల'' సినిమా కథానేపథ్యం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)