ద‌క్షిణాది కాంగ్రెస్ కు కొత్త కేంద్రం.. డీకేశి!

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన వ‌క్క‌లిగ నేత డీకే శివ‌కుమార ఇప్పుడు కొత్త ట్ర‌బుల్ షూట‌ర్ అయ్యారు ఆ పార్టీ పాలిట‌. ఈడీ కేసుల‌ను, సీబీఐ విచార‌ణ‌ల‌ను ఎదుర్కొంటూ, తీహార్ జైల్లో…

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన వ‌క్క‌లిగ నేత డీకే శివ‌కుమార ఇప్పుడు కొత్త ట్ర‌బుల్ షూట‌ర్ అయ్యారు ఆ పార్టీ పాలిట‌. ఈడీ కేసుల‌ను, సీబీఐ విచార‌ణ‌ల‌ను ఎదుర్కొంటూ, తీహార్ జైల్లో సైతం కొంత కాలం గ‌డిపి మ‌రీ కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌ట్టిగా నిల‌బ‌డ్డారు డీకేశి. 

ఒకానొక స‌మ‌యంలో డీకే విష‌యంలో మ‌రో ప్ర‌చార‌మూ జ‌రిగింది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ నుంచి చీల్చుకు వ‌చ్చి బీజేపీలోకి క‌లిపే వ్యూహంతోనే ఆయ‌న‌ను బీజేపీ అధిష్టానం తీహార్ నుంచి బ‌య‌ట‌కు వ‌దిలింద‌నే ప్ర‌చారం కూడా సాగింది. కొద్దో గొప్పో సీట్ల తేడాతో కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య‌న అధికారం చేతులు మారే ప‌రిస్థితి వ‌స్తే.. డీకేశి అప్పుడు ఎమ్మెల్యేల‌ను చీల్చుకుని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటి రాజ‌కీయ ప‌రిస్థితి ఏర్ప‌డ‌లేదు. కానీ కాంగ్రెస్ విజ‌యం కోసం డీకేశి చాలా చిత్త‌శుద్ధితో ప‌ని చేశారు. అందుకు ప్ర‌తిఫ‌ల‌మూ బాగానే పొందారు.

ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో పాల‌నలో కీల‌క వ్య‌వ‌హారాలు డీకేశి క‌నుస‌న్న‌ల్లో ఉన్నాయి. మంత్రి ప‌ద‌వి ఎంపిక‌లో డీకే శివ‌కుమార బెంగ‌ళూరును త‌న చేతుల్లోకి తీసుకునేందుకే ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. కర్ణాట‌క కేబినెట్లో బెంగ‌ళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ‌ను డీకే సొంతం చేసుకున్నారు! ఇలా బెంగ‌ళూరు మీదే త‌న రాజ‌కీయ ఆధిప‌త్యాన్ని నిల‌బెట్టుకుంటున్నారు డీకేశి. బెంగ‌ళూరు సిటీ పొటెన్షియాలిటీ వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. బెంగ‌ళూరు అభివృద్ధి అంటే డీకే రాజ‌కీయ అభివృద్ధి కూడా మ‌రింత‌గా ఉండ‌వ‌చ్చు. 

కాంగ్రెస్ నుంచినే రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన డీకేశి త‌న రాజ‌కీయ జీవితంలో చాలా గ‌ట్టి పోరాట‌మే చేశారు. ఇప్పుడైతే ఆయ‌న అనుభ‌విస్తున్న భోగాలే క‌నిపిస్తాయి కానీ, క‌న‌క‌పుర నుంచి ఆయ‌న ప్రారంభం నుంచి గ‌ట్టి ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. అది కూడా దేవేగౌడ‌, ఆయ‌న కొడుకు కుమార‌స్వామిల‌తో ఆది నుంచి పోరాడాడు డీకే శివ‌కుమార‌.

త‌మ సామాజికవ‌ర్గ ప్రాబ‌ల్యం, త‌మ పార్టీ ప్రాబ‌ల్యం ఉన్న క‌న‌క‌పుర ప్రాంతంలో డీకే ఎదుగుద‌ల‌ను దేవేగౌడ‌, కుమార‌స్వామిలు స‌హించ‌లేక‌పోయారు. త‌మ పార్టీ త‌ర‌ఫున కాకుండా వేరే పార్టీ త‌ర‌ఫున త‌మ సామాజిక‌వ‌ర్గం నేత మ‌రొక‌రు ఎదిగితే అది త‌మ‌కే న‌ష్టం చేస్తుంద‌ని వారు లెక్క వేశారు. బ‌హుశా అదే జ‌రిగింది. డీకే శివ‌కుమార గ‌ట్టిగా నిల‌బ‌డ‌టంతోనే అది జ‌రిగింది. క‌న‌క‌పుర ప్రాంతంలో దేవేగౌడ‌, కుమార‌స్వామిల ప్రాభ‌వానికి డీకే గండి కొట్టాడు.  

ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు త‌ను ఒక అధికారిక కేంద్రంగా ఎదిగాడు డీకే శివ‌కుమార. సొంత కులంలో కూడా ఇప్పుడు కుమార‌స్వామి, దేవేగౌడ‌ల క‌న్నా డీకే శివ‌కుమార ఇమేజే ఇప్పుడు బ్ర‌హ్మాండ‌మైన స్థాయిలో ఉంది. శివ‌కుమార ఎదుగుతున్న కొద్దీ జేడీఎస్ ఆధిప‌త్యం కూడా త‌గ్గిపోతూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

మ‌రి క‌ర్ణాట‌క వ‌ర‌కూ డీకేశి సంగ‌త‌లా ఉంటే, ఇప్పుడు ఆయ‌న ద‌క్షిణాదిన కాంగ్రెస్ కార్య‌క‌లాపాల‌కే కేంద్రం అవుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేకించి సౌత్ లో క‌ర్ణాట‌క త‌ర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కు బాగా ఆశ‌లున్న రాష్ట్రం తెలంగాణ‌. ఏపీ, త‌మిళ‌నాడుల్లో కాంగ్రెస్ కు ఏమీ లేదు. కేర‌ళ‌లో కాంగ్రెస్ కు కావాల్సినంత బ‌లం, బ‌ల‌గం ఉంది. తెలంగాణ కాంగ్రెస్సే ముక్క‌లుముక్క‌లుగా ఉంది. మ‌రి ఇప్పుడు ఇక్క‌డ కాంగ్రెస్ కార్య‌క‌లాపాల‌ను ఒక కొలిక్కి తెచ్చే ప్ర‌య‌త్నం డీకేశి చేస్తున్న‌ట్టుగా ఉన్నారు. 

కాంగ్రెస్ నేత‌లు, కాంగ్రెస్ లోకి చేర‌తారు అనే నేత‌లు ఒక్కొక్క‌రుగా వెళ్లి డీకే శివ‌కుమార‌తో స‌మావేశం అవుతూ వ‌స్తున్నారు. బ‌హుశా అధిష్టానం వ‌ద్ద ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా డీకే ను వీరు ఆశ్ర‌యిస్తున్న‌ట్టుగా ఉన్నారు. క‌ర్ణాట‌క‌లో ఎలాగూ ఛాంపియ‌న్, ఆర్థికంగా తిరుగులేని శ‌క్తి ఉన్న నేత అనిపించుకుంటున్న‌వారు కాబ‌ట్టి.. డీకేశి మాట‌ల‌కు కాంగ్రెస్ హైక‌మాండ్ కూడా విలువ‌ ఇవ్వ‌వ‌చ్చు!

చివ‌రి సారి సౌత్ లో కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత‌లుగా చిదంబ‌రం, వీర‌ప్ప మొయిలీ, జైరాం ర‌మేష్ వంటి వారున్నారు. ప‌క్క రాష్ట్ర కాంగ్రెస్ కార్య‌క‌లాపాల‌తో కూడా వీరు ఏదో ర‌కంగా బంధం నెరిపారు. అధిష్టానం నియ‌మించిన ఇన్ చార్జిలుగా లేదా ఇన్ డైరెక్టుగా వీరు కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌ను ప్ర‌భావితం చేశారు. మ‌రి దాదాపు ద‌శాబ్దం కింద‌టే వారు ఇలాంటి వారంతా తెర‌మ‌రుగు అయ్యారు. ఇప్పుడు మ‌ళ్లీ చాన్నాళ్ల‌కు డీకేశి రూపంలో ఇంకొక‌రి పేరు ఆ స్థాయిలో వినిపిస్తూ ఉంది.