డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో నటి జ్యోతి పేరు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో పట్టుబడడం, ఆయన కాల్ లిస్ట్‌లో జ్యోతి పేరు ఉండడంతో టాలీవుడ్‌లో రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో నటి జ్యోతి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. క్రిమినల్స్‌కి కూడా ముసుగు వేసి చూపిస్తారని, కానీ తన ఫొటోను యథేచ్ఛగా మీడియాలో వాడుతున్నారని ఆమె వాపోయారు.
కనీసం నిజానిజాలేంటో తెలుసుకుని ఫొటోలను ప్రదర్శించాలని మీడియాకి సూచించారు. డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మీడియాలో తన పేరు, ఫొటో కనిపిస్తుండడంతో పెద్ద ఎత్తున స్నేహితులు, బంధువుల నుంచి ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. అందుకే వివరణ ఇస్తున్నట్టు ఆమె తెలిపారు.
ప్రొడ్యూసర్ కేపీతో తనది కేవలం స్నేహం మాత్రమే అన్నారు. కేపీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని తన ఇంట్లో విడిచి వెళ్లేవాడన్నారు. తన కుమారుడితో కేపీ కుమారుడు ఆడుకునే వాడని జ్యోతి తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని నటి జ్యోతి ప్రకటించారు.
పోలీసులు అడిగితే తన ఫోన్ కూడా ఇస్తానని ఆమె తెలిపారు. డేటా రిట్రీవ్ చేసుకున్నా అభ్యంతరం లేదన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందువల్లే భయపడడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోడానికి అవసరమైతే నార్కోటిక్ టెస్ట్‌కి సిద్ధమని నటి జ్యోతి ప్రకటించారు. పార్టీలకు వెళ్లే అలవాటు తనకు లేదన్నారు.
ఇదిలా వుండగా జ్యోతి ధైర్యంగా వీడియో విడుదల చేయడంతో ఆమెకు డ్రగ్స్‌తో సంబధం ఉందన్న ప్రచారం బలహీనపడింది. జ్యోతిలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన సెలబ్రిటీలు కూడా ఇలాగే ముందుకొస్తే, విచారణ సులువవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.