ప్రతి అడ్డమైనోడు రాయలసీమ, కడప, పులివెందుల సంస్కృతి అంటూ విషం చిమ్మడమే. రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఒక ప్రాంతంపై సాంస్కృతిక దాడి చేయడాన్ని కొన్నేళ్లుగా చూస్తున్నాం. కనీసం తాను పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంతానికి మంచి చేయకపోయినా, చెడు చేయకూడదన్న ఇంగితం చంద్రబాబులో ఏనాడో కరువైంది. రాజకీయంగా ఇప్పటికీ తనకు అండగా నిలిచిన రాయలసీమపై చంద్రబాబు మొదలు పెట్టిన సాంస్కృతిక దాడిని, ఆయన దత్త పుత్రుడు కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది.
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలులో జనసేన నేతలతో ఆదివారం పవన్‌కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారని ఆరోపించారు. వైసీపీ చేసినట్టు తాను కుల రాజకీయాలు చేయలేనని ఆయన అన్నారు. విభిన్న కులాలు, మతాల నుంచి జనసేన సభ్యుల్ని తీసుకున్నట్టు ఆయన వివరించారు. ప్రజలకు జనసేన భావజాలం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పవన్ దృష్టిలో పులివెందుల అంటే నేరస్తులకు అడ్డా. సినిమా, సాహిత్య రంగాల్లో లబ్ధిప్రతిష్టులైన బీఎన్ రెడ్డి, హాస్య నటుడు పద్మనాభం, ప్రసిద్ధ విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి, శ్రీశ్రీ తర్వాత అంతటి ఖ్యాతినార్జించిన గజ్జల మల్లారెడ్డి తదితరులను కన్న తల్లి పులివెందుల. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు దర్శక నిర్మాత బీఎన్‌రెడ్డి ఆ ప్రాంత వాసే.
సీఎం జగన్‌పై ద్వేషంతో ఏకంగా ఒక ప్రాంతంపైన్నే విషాన్ని చిమ్మేందుకు పవన్‌కల్యాణ్ వెనుకాడడం లేదు. భాషలను గౌరవించే సంప్రదాయం, అలాగే ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అంటూ తన పార్టీ లక్ష్యాలను పవన్ గొప్పగా ప్రకటించుకున్నారు. మరి వాటిని ఆచరించేదెక్కడ? పులివెందుల సంస్కృతి అంటూ నెగెటివ్ కోణంలో రాష్ట్రానికి చాటి చెప్పడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం వుంది.
రాజకీయంగా జగన్‌తో తేల్చుకోవాలే తప్ప, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రాంతంపై బురద చల్లాలని అనుకోవడం ఎంత వరకు సంస్కారమో ఆయనే ఆలోచించాలి.