రాయలసీమ ప్రాంతం నుంచి 2019 ఎన్నికల్లో చాలా మంది కొత్త నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారు. ఎనిమిది ఎంపీ సీట్లు, 54 అసెంబ్లీ సీట్ల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా చోట్ల కొత్త కొత్త వాళ్లు తెరపైకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన వారు కొత్త పాత తేడా లేకుండా ఘన విజయాలు సాధించారు కూడా! అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి ఎంపీ సీట్ల నుంచి గత ఎన్నికల్లో కొత్త నేతలు పార్లమెంట్ లోకి ఎంటరయ్యారు. ఇక అసెంబ్లీ సీట్ల పరంగా చూసుకున్నా.. సగానికి మించిన చోట్ల తొలి సారి పోటీ చేసిన వారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పోటీకి దిగిన వారే ఉంటారు! అలా జగన్ నిలిపిన వారు నిలిపినట్టుగా ఘన విజయం సాధించి అసెంబ్లీలోకి ప్రవేశించారు కూడా!
కట్ చేస్తే.. మళ్లీ ఎన్నికలకు పార్టీలు అన్ని రకాల ఏర్పాట్లూ చేసుకుంటూ ఉన్నాయి. ఈ సారి అభ్యర్థుల ఎంపిక సరళి ఎలా ఉంటుందనే అంశం గురించి ప్రాథమికంగా పరిశీలించినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి కూడా మార్పులకే ప్రాధాన్యతను ఇస్తుందని స్పష్టం అవుతోంది. గత ఎన్నికల స్థాయిలో కాకపోయినా.. ఈ సారి కూడా అభ్యర్థుల విషయంలో మార్పుచేర్పులు ఉంటాయనే టాక్ వినిపిస్తూ ఉంది. చాలా మంది సిట్టింగుల స్థానంలో మరొకరు తెరపైకి వచ్చే అవకాశాలుంటాయని, అలాగే మరి కొందరికి నియోజకవర్గాల మార్పు కూడా ఉంటుందనే అభిప్రాయాలు చాన్నాళ్ల నుంచి వినిపిస్తూ ఉన్నాయి.
ఎంపీ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మారే అవకాశాలున్నాయి. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు తెరమరుగు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి కొందరికి స్థాన చలనం ఉండవచ్చని సూఛాయగా తెలుస్తూనే ఉంది. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయవచ్చని కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేయని వారు ఈ సారి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి!
ఇక తెలుగుదేశం పార్టీ వైపు చూస్తే.. దశాబ్దాలు గడుస్తున్నా తెలుగుదేశం పార్టీ మళ్లీ పాత ముఖాలకే ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కనిపిస్తోంది. ఒకటికి రెండు సార్లు ఓడిన వారు, ఒక సారి గెలిస్తే రెండు సార్లు గెలవలేని వాళ్లు, ఎప్పుడో 1990లలో రాజకీయాల్లోకి వచ్చి అప్పటికి యువత అనిపించుకున్న వారే వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి దిక్కవుతూ ఉండటం గమనార్హం.
బీకే పార్థసారధి, కాలువ శ్రీనివాసులు.. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కలిగిన బీసీ నేతలు! వీరి పేర్లు ముప్పై యేళ్ల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ బీసీ నేతలంటే తెలుగుదేశం పార్టీకి వీళ్లే దిక్కు! అలాగని వరస విజయాలు ఏమైనా ఖాతాలో ఉన్నాయా అంటే అది కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి వారే, బహుశా వీరే తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
అనంతపురం జిల్లా వంటి చోట పూర్తిగా కమ్మ సామాజికవర్గం నేతలే అంతా కీలకం. బీసీల ఓట్లు యాభై శాతం పైనే ఉంటాయి. తమది బీసీల పార్టీ అంటూ చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. అయితే గడిచిన ముప్పై యేళ్లలో అనంతపురం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కనీసం పది మందికి పైగా కమ్మ నేతలు ఎదిగారు. కొత్తగా తెరపైకి వచ్చి ఉనికి చాటుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఆరు నియోజకవర్గాలకు కమ్మ వాళ్లే ఇన్ చార్జిలుగా ఉన్నారు. జిల్లాలో కమ్మ వాళ్ల జనాభా తిప్పి తిప్పి కూడినా నాలుగైదు శాతం కూడా ఉండదు. అయితే ఏకంగా ఆరు నియోజకవర్గాలకు కమ్మ నేతలే ఇన్ చార్జిలు, వారిదే హవా. మరి యాభై శాతం మించి ఉన్న బీసీల విషయంలో మాత్రం అదే పార్థసారధి, అదే శ్రీనివాసులు! తమది నాయకులను తయారు చేసే ఖార్కానా అంటూ కూడా చంద్రబాబు చెబుతూ ఉంటారు. మరి కమ్మ నేతలనే తయారు చేస్తారా.. తెలుగుదేశం ఫ్యాక్టరీలో అనే సందేహమూ కలుగుతుంది.
బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయానికి ఇప్పుడు ప్రతిఫలాలు అన్నీ లభిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రెండు ఎంపీ సీట్లనూ బీసీలకు ఇచ్చే స్థితిలో అయినా టీడీపీ ఉందా? అనేది కూడా సందేహమే! కమ్మ నేతల ఆధిపత్యం తీవ్రమై, ఆ పై జేసీ సోదరుల రాజకీయంతో తెలుగుదేశం పార్టీ మూలాలను కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆరు నియోజకవర్గాల్లో కమ్మ అభ్యర్థులే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయవచ్చు. వారు పోనూ ఎప్పుడో 99కి ముందు తెరపైకి వచ్చిన వారే ఇప్పుడు కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయకత్వ పటిమ ఇది.
ఇప్పటికే బీసీల ఓటుబ్యాంకులో తెలుగుదేశం పార్టీ మెజారిటీ షేర్ ను కోల్పోయింది. ఇదే ధోరణి కొనసాగుతూ ఉన్న నేపథ్యం, అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు, అన్నింటికీ మించి జగన్ సంక్షేమ పథకాల్లో ప్రధాన లబ్ధిదారులు బీసీలే కావడంతో.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ షాకింగ్ రిజల్ట్స్ పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.