చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ టీజర్ తాజాగా రిలీజైంది. అంతకంటే ముందే బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి టీజర్ వచ్చింది. దీంతో సహజంగానే ఈ రెండు టీజర్ల మధ్య పోలిక మొదలైంది.
బాలకృష్ణ-చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధమిది. ఇప్పుడీ వార్ టీజర్లకు కూడా పాకింది. తమ హీరో టీజర్ బాగుందంటే, కాదు తమ హీరో టీజరే బాగుందంటూ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్.
ఈ ఫ్యాన్ వార్ సంగతి పక్కనపెడితే.. భోళాశంకర్, భగవంత్ కేసరి సినిమాలకు సంబంధించి కామన్ గా ఒక్క పాయింట్ మాత్రం వినిపిస్తోంది. దీన్ని ఫ్యాన్స్ కూడా అంగీకరిస్తున్నారు. అదేంటంటే, భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య తన వయసుకు తగ్గ పాత్ర పోషిస్తున్నాడు. అదే టైమ్ లో భోళాశంకర్ లో చిరంజీవి మాత్రం అలాంటి పాత్రలో కనిపించడం లేదు.
ఇక టీజర్ పై సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ విషయానికొస్తే.. చిరంజీవి కాస్ట్యూమ్స్ బాగాలేదంటున్నారు చాలామంది. ఆయనకు తెలంగాణ యాస సెట్ అవ్వలేదనే కామెంట్ కూడా వినిపిస్తోంది.
టీజర్ చూస్తుంటే, వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని చూస్తున్నట్టే ఉంది తప్ప కొత్తదనం లేదంటున్నారు. మోహన్ లాల్, కమల్ హాసన్ రేంజ్ ఉన్న చిరంజీవి.. ఇలా మసాలా సినిమాలకు అతుక్కుపోవడం ఏం బాగాలేదంటున్నారు.
ఈ రెండు సినిమాల్లో ముందుగా భోళాశంకర్ థియేటర్లలోకి వస్తోంది. ఆ తర్వాత 2 నెలల గ్యాప్ లో భగవంత్ కేసరి రిలీజ్ అవుతుంది. భోళశంకర్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా.. భగవంత్ కేసరి సినిమాకు అనీల్ రావిపూడి దర్శకుడు.