మా పిల్ల‌ల‌కు డ్ర‌గ్స్ టెస్ట్‌లు చేయిస్తా…మరి మీరు?

తెలంగాణ‌లో ప‌బ్‌, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాలు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో మీ వాళ్లున్నారంటే, కాదు మీ వాళ్లే అంటూ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా…

తెలంగాణ‌లో ప‌బ్‌, డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాలు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో మీ వాళ్లున్నారంటే, కాదు మీ వాళ్లే అంటూ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా డ్ర‌గ్స్ టెస్టింగ్‌ల‌కు తాము సిద్ధ‌మ‌ని, మ‌రి మీ పిల్ల‌ల‌కు చేయించేందుకు సిద్ధ‌మా? అని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స‌వాల్ విస‌ర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

మ‌రో ఏడాదిలో తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏ ఒక్క అంశాన్ని రాజ‌కీయ పార్టీలు విడిచిపెట్ట‌డం లేదు. ప్ర‌తిదాన్ని రాజ‌కీయంగా పైచేయి సాధించేందుకు పోటీలు ప‌డి మ‌రీ విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ కాంగ్రెస్‌, బీజేపీల‌పై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డంతో ప్ర‌త్య‌ర్థులు కూడా అదే స్థాయిలో స‌మాధానం ఇచ్చారు.

బంజారాహిల్స్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ ఘటనలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల కుటుంబసభ్యులు, బంధువులకు ప్రమేయం ఉందని బాల్క సుమ‌న్ ఆరోపించారు. పబ్‌ నిర్వాహకుడు ఉప్పల అభిషేక్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదకు స్వయాన కుమారుడన్నారు. పబ్‌లో పోలీసులు అదుపులో తీసుకున్న సూదిని ప్రణయ్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి మేనల్లుడ‌ని బాల్క సుమన్ తెలిపారు.

రెండు జాతీయ పార్టీల నేతల బంధువులే డ్రగ్స్‌ దందాలో ఉన్నందున ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీలు కూడా అయిన బండి సంజయ్, రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహించి పార్టీ, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. బాల్క‌సుమ‌న్ ఆరోప‌ణ‌ల‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.  

బంజారాహిల్స్‌లో దాడి చేసిన పబ్బుకు 24 గంటల అనుమతి ఇచ్చింది ఎవర‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ఆయ‌న నిల‌దీశారు. ప‌బ్‌లో ప‌ట్టుబ‌డిన 125 మందికి టెస్టులు చేయకుండా ఎందుకు వదిలేశారని రేవంత్‌రెడ్డి నిలదీశారు. ఈ వ్యవహారంలో త‌న‌ వాళ్లున్నా శిక్షించాల‌ని కోరారు. అంతేగానీ చిన్నపిల్లలను అడ్డుం పెట్టకుని.. చిల్లర రాజకీయాలు చేయడం ఏంటని రేవంత్‌ రెడ్డి విరుచుకుప‌డ్డారు.

త‌మ‌ వాళ్లపై అనుమానాలు ఉంటే, ఏ ఆస్పత్రికైనా తీసుకొస్తాన‌ని రేవంత్‌రెడ్డి తెలిపారు. త‌మ‌ పిల్లలందరికీ డ్రగ్స్‌ టెస్టులు చేయిస్తాన‌న్నారు. కేసీఆర్‌.. నీ కొడుకు కేటీఆర్‌ను కూడా డ్రగ్స్‌ టెస్ట్‌కు పంపిస్తావా? అని రేవంత్‌రెడ్డి  సవాల్‌ విసర‌డం సంచ‌ల‌నంగా మారింది. 

తాను నైతిక బాధ్యతతో ఉన్నానని.. కానీ, కావలసిన వాళ్లు ఉన్నారనే అందరిని ఈ ప్రభుత్వం వది లేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించ‌డం విశేషం. రేవంత్‌రెడ్డి స‌వాల్‌పై అధికార ప‌క్షం నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో మ‌రి!