సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలు వింటుంటే… ఏదో తేడా ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. జాతీయ కార్యదర్శి స్థాయి నాయకుడు నేలబారు మాటలు మాట్లాడ్డం విచిత్రంగా ఉంది. ఇటీవల కాలంలో ఆయన మానసికంగా డిస్ట్రబ్ అయ్యారా? అని సొంత పార్టీ శ్రేణులు కూడా అనుమానించే పరిస్థితి. విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. కమ్యూనిస్టులు అంటే హుందాగా, గౌరవప్రదంగా మాట్లాడ్తారని పేరు.
కానీ ఇటీవల నారాయణ మాట తీరు ఆ పార్టీపై గౌరవం పోయేలా చేస్తోంది. అంత వరకైతే ఫర్వాలేదు. కమ్యూనిస్టు నాయకుల కంటే బూర్జువా పార్టీల నేతలే నయమనే అభిప్రాయానికి రావడానికి నారాయణ వంకర మాటలే కారణమనే వాళ్లు లేకపోలేదు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినా సీఎం జగన్‌కు బానిస బతుకు అవసరమా అని ప్రశ్నించారు.
అధికారం ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేస్తారా అని ప్రశ్నించారు. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడంపై నారాయణ అభ్యంతరం, అసహనం వ్యక్తం చేశారు. తానే గవర్నర్‌గా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల ఏర్పాటు జగన్ సొంత వ్యవహారం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
జగన్ పాలనపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని నారాయణ హెచ్చరించారు. ఎర్ర జెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సీపీఐ, సీపీఎం కలవాలన్నారు. కేరళలో జరిగే సభలో ఈ అంశాన్ని చర్చిస్తామన్నారు. సీపీఎం, సీపీఐ కలిసేలా తీర్మానం చేస్తామన్నారు.
జగన్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ తానే గవర్నర్ అయితే ఆత్మహత్య చేసుకునేవాడినని వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార యావతో నారాయణ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ విధులేంటో తెలియకుండానే నారాయణ మాట్లాడుతున్నారా?.
నారాయణ వ్యవహార శైలితో… సీపీఐ ఆత్మహత్య చేసుకుంటున్నంత పని అవుతోందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆయన్ను ఎక్కడైనా ఆస్పత్రిలో చేర్చి, మానసిక వైద్యం చేయించాల్సిన అవసరం ఉందనే విపరీత వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం గమనార్హం.