ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై సీరియ‌స్‌!

అనుమ‌తి లేకుండా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. గ‌త నెల 21న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియా స‌మావేశం నిర్వ‌హించి పెగాస‌స్‌తో పాటు…

అనుమ‌తి లేకుండా మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌, ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. గ‌త నెల 21న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియా స‌మావేశం నిర్వ‌హించి పెగాస‌స్‌తో పాటు ఇత‌ర‌త్రా అనేక అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. చంద్ర‌బాబు హ‌యాంలో పెగాస‌స్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన‌ట్టు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

మ‌మ‌తా వ్యాఖ్య‌లు ఏపీలో రాజ‌కీయ దుమారం రేపాయి. ఏపీ అసెంబ్లీలో ఈ విష‌య‌మై చ‌ర్చ కూడా జ‌రిగింది. పెగాస‌స్ సాఫ్ట్ వేర్‌తో నాటి ప్ర‌తిప‌క్ష వైసీపీ, బీజేపీ నేత‌ల ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు మ‌రోసారి తెరపైకి వ‌చ్చాయి. ఈ స‌భ్యుల కోరిక మేర‌కు విచార‌ణ నిమిత్తం ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో స‌భా సంఘం వేశారు. త‌గ‌దున‌మ్మా అంటూ పెగాస‌స్‌కు ఆస్కారమే లేద‌ని ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు మీడియా ముందుకొచ్చారు.

అధికార పార్టీ వైఖ‌రితో ఏపీ ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు త‌లెత్తే అవ‌కాశం ఉందని, అలాంటి వాటిని పార‌దోలేందుకు వివ‌ర‌ణ ఇచ్చేందుకు ముందుకొచ్చిన‌ట్టు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల్లో భ‌యాన్ని పోగొట్టి భ‌రోసా క‌ల్పించ‌డ‌మే త‌న ధ్యేయ‌మ‌ని మీడియాతో అన్నారు. 

ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా మీడియాతో మాట్లాడ్డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఇవాళ సీఎస్ స‌మీర్‌శ‌ర్మ ఏబీకి నోటీస్ జారీ చేశారు. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని నోటీస్‌లో పేర్కొన్నారు.  వారంలోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.