‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ అన్నాట్ట వెనకటికి ఓ ప్రబుద్ధుడు! జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారం కూడా అంతకంటె తేడాగా ఏం లేదు. తన గురించి అతిశయోక్తులతో ఆయన ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మామూలుగానే పవన్ కల్యాణ్ తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. చీటికి మాటికి సీఎం అయిపోతానని అనడం కూడా అలాంటి అతి విశ్వాసం ఫలితమే. తనను చూసి జగన్ ప్రభుత్వం జడుసుకుంటున్నదని, తాను అడుగు పెడితే చాలు.. తన రాకకు ముందే ప్రజలకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించేస్తుందని… తాను రోడ్ల మరమ్మతులకు శ్రమదానం పిలుపు ఇస్తే ప్రభుత్వం భయపడి ముందే బాగు చేయిస్తుందని.. ఇలా రకరకాలుగా ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ కూడా తనను చూసి భయపడడం వల్ల మాత్రమే జరుగుతుంటాయని ఆయన అనుకుంటూ జీవిస్తుంటారు.
ఆ రకంగా.. తన గురించి తాను అతిగా ఊహించుకోవడంలో భాగంగానే పవన్ కల్యాణ్ తన మీద హత్యాయత్నం జరుగుతుందనే అభిప్రాయాలను కూడా వారాహి యాత్రలో చాటుకుంటున్నారు. ఆయన ప్రాణభయంలో తాజా కామెడీ ఏంటంటే.. రాజోలు సభలో తనమీద రాళ్లతో దాడి చేయడానికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించారట. నలుగురు వ్యక్తులు రాళ్లు పట్టుకుని తిరుగుతూ కనిపించారని, తన సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఇవాళ వర్షం కారణం చూపించి మలికిపురంలో జరగాల్సిన సభను వాయిదా వేసుకున్న పవన్ కల్యాణ్ తన మీద హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజోలు ఎపిసోడ్ ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించడం విశేషం.
తనను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ లు తిరుగుతున్నాయని కూడా పవన్ కల్యాణ్ వెల్లడించారు. అక్కడికేదో.. జగన్మోహన్ రెడ్డి విజయానికి – పరాజయానికి మధ్య అడ్డు ఉన్న మహాశక్తి తానొక్కడు మాత్రమేనని.. తనను అడ్డు తొలగించుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన అతిశయమైన అభిప్రాయంగా కనిపిస్తోంది. అయినా పవన్ కల్యాణ్ లాంటి సింగిల్ సీటులేని, సింగిల్ డిజిట్ ఓటు బ్యాంకు దాటని నాయకుడిని చంపాలని ఎవరు మాత్రం కక్కుర్తి పడతారు అనేది ప్రజల సందేహం.
‘‘ఒక గదిలో ఎలుక- పిల్లి మాత్రమే ఉన్నాయనుకోండి. తన ప్రాణాలకు అపాయం ఉన్నదని ఎలుక ప్రకటిస్తే.. అది ఏ రకంగా చచ్చినా అందరి అనుమానం వెళ్లేది పిల్లి మీదకే కదా..’’ అని అర్థం వచ్చేలా మల్లీశ్వరి సినిమాలో ఒక డైలాగు ఉంటుంది. హత్యారాజకీయాలు అనే బురదను అధికార పార్టీకి పులమడానికి చాలా కాలంగా పవన్ ప్రయత్నిస్తున్నప్పుడు.. ఆయనకు ఏం జరిగినా సరే.. మరక ప్రభుత్వం మీద పడుతుంది. లబ్ధి చంద్రబాబునాయుడుకు కలుగుతుంది.
అమంగళము ఉపశమించుగాక.. పవన్ కల్యాణ్ మీద ఆయన అతిచేస్తున్నట్టుగా సుపారీ గ్యాంగులు కాకపోవచ్చు. కనీసం ఆయనకు ఏదో ఒక ఆపద జరిగిందే అనుకుందాం.. దానిని లబ్ధి పొందే అవకాశం ఉన్నవాళ్లు చేయిస్తారా? నింద పడే అవకాశం ఉన్నవాళ్లు చేయిస్తారా? మిలియన్ డాలర్ ప్రశ్న ఇది!