కమలం వ్యూహాలకు ఓటమే లక్ష్యమా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగడానికి కేవలం 38 రోజుల దూరం మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి దాదాపుగా…

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగడానికి కేవలం 38 రోజుల దూరం మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి.. ప్రచారంలో తీవ్రమైన వేగంతో దూసుకుపోతోంది. 

కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి అభ్యర్థుల జాబితాన్ని విడుదల చేసి, ప్రచారంలో తమ వంతు వేగంతో వెళుతున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం కనీసం అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కూడా ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇది మొత్తం ఆ పార్టీ వైఖరి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ప్రస్తుతం మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండగా  తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలలో విడతలు విడతలుగా బిజెపి తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూనే ఉంది. అయితే తెలంగాణ విషయంలో మాత్రమే ఇంకా జాగు చేస్తుంది. పార్టీ చేస్తున్న ఆలస్యం అంతో ఇంతో వారికి ఉండగల విజయవకాశాలను కచ్చితంగా దెబ్బతిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతోంది.

ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరించే ప్రక్రియనే అందరికంటే ఆలస్యంగా మొదలుపెట్టిన బిజెపి.. ఎంపిక పూర్తి చేయడంలో కూడా అదే ధోరణిలో ఉంది. మొత్తానికి 505 మంది అభ్యర్థుల పేర్లు సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి.  వారందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా ఫోను చేసి సమాచారం ఇచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే జాబితా ప్రకటనలో ఎందుకు జాగు చేస్తున్నారో అర్థం కాని సంగతి.

బిజెపి గత ఎన్నికల సమయంలో కూడా ఇదే మాదిరి పొరపాటు చేసింది. కేవలం రెండు వారాల వ్యవధి కూడా లేకుండా ప్రచారంలో అభ్యర్థులు చతికిలబడేలాగా.. కొందరి పేర్లను ప్రకటించారు. అలాంటి చేతకాని వ్యూహాల ఫలితంగానే.. పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు కూడా బిజెపి అదే తరహాలో వ్యవహరిస్తుండడం గమనార్హం.

కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ సారధి అయిన నాటి నుంచి.. భారత రాష్ట్ర సమితిని మళ్లీ గెలిపించడం కోసం భాజపా లాలుచీ పడిందని, విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. అవి నిజమనిపించేలాగా ఈ వ్యవహారం ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో ముందుగానే జాబితాలు విడుదల చేసేస్తూ, తెలంగాణ విషయంలో మాత్రం చూపిస్తున్న ఈ  చులకన పార్టీకి నష్టం చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.