కాస్ట్ లీ దుర్గమ్మ.. వజ్రాలతో విగ్రహం

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సౌత్-నార్త్ తేడా లేకుండా ప్రతి రాష్ట్రంలో దుర్గామాత విగ్రహాల్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లో కూడా ఓ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే…

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సౌత్-నార్త్ తేడా లేకుండా ప్రతి రాష్ట్రంలో దుర్గామాత విగ్రహాల్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లో కూడా ఓ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఇది సాధారణ విగ్రహం కాదు.

రాష్ట్రంలోని చురు జిల్లాలో తొమ్మిదిన్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పుతో దుర్గాదేవి విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహంపై అక్షరాలా లక్షా 25వేల అమెరికన్ వజ్రాల్ని పొదిగారు. అలా ఈ ఏడాది ఏర్పాటుచేసిన విగ్రహాల్లో అత్యంత ఖరీదైన విగ్రహంగా ఇది రికార్డ్ సృష్టించింది.

బెంగాల్ కు చెందిన 10 మంది కళాకారులు ఏకథాటిగా 3 నెలల పాటు శ్రమించి, ఈ అష్టభుజ విగ్రహాన్ని తయారుచేశారు. రూపం కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టినే వాడినప్పటికీ.. పూర్తి రూపం సంతరించుకున్న తర్వాత, దానిపై ఖరీదైన అమెరికన్ వజ్రాల్ని పొదిగారు.

ఈ విగ్రహాన్ని పండిట్ బల్-ముకుంద్ వ్యాస్ ఏర్పాటుచేశారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా అమెరికాలో పర్యటించాడు. చికాగో వెళ్లి, 9 రంగుల్లో మెరిసే రకరకాల వజ్రాల్ని పరిశోధించి, కొనుగోలు చేసి వచ్చారు. ఆ వజ్రాలతో బెంగాల్ కు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహంపై వజ్రాలు పొదగడమే కాకుండా.. బంగారు నగిషీ కూడా అద్దారు. ప్రస్తుతం ఈ దుర్గాదేవి మంటపం పెద్ద పర్యాటక ప్రాంతంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.