పుష్కరం దాటిపోయినా సీఎం ఆశ పదిలం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి జానా రెడ్డి కూడా ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ కూడా ఓడిపోయిన…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి జానా రెడ్డి కూడా ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ కూడా ఓడిపోయిన జానారెడ్డి ఈ దఫా అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఆయన చిన్న కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డికి అక్కడ టికెట్ ప్రకటించారు. 

జానారెడ్డికి ప్రస్తుతం.. టికెట్లు దక్కకపోవడం వలన అలకపూని పార్టీకి దూరమయ్యే వారినందరినీ బుజ్జగించి.. పార్టీని వీడకుండా అడ్డుకోవడం అనే డ్యూటీ అప్పగించారు. అయితే.. కుందూరు జానారెడ్డి మాత్రం.. తన మదిలో ఉన్న సీఎం కావాలనే కోరికను కార్యకర్తలతో భేటీలో బయటపెట్టడం విశేషం. ప్రజల హృదయాలలో తాను సీఎం కావాలనే కోరిక ఉన్నదని.. నల్గొండజిల్లా కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి వ్యాఖ్యానించారు.

అదే సమయంలో ‘నాకు నేనుగా ఏ పదవీ కోరుకోవడం లేదు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదు అనను. ఏ సీఎం చేయనన్ని శాఖలు నేను చేశాను.. 36 ఏళ్లకే మంత్రినయ్యాను. 55 ఏళ్ల సీనియారిటీ నాది’ అంటూ తన గురించి గొప్పలు చెప్పుకున్నారు.

ఇప్పుడైతే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు గానీ.. నిజానికి పుష్కరకాలం ముందు నుంచి కూడా జానారెడ్డిలో తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక చాలా బలంగా ఉన్నదనే సంగతి.. అప్పట్లో ఆయనను ఎరిగిన సన్నిహితులకు బాగా తెలుసు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం సాగుతున్న ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో సంగతి అది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. రోశయ్య కొంతకాలం పాటు సీఎంగా చేశారు. ఆ పిమ్మట నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. కిరణ్ ను సీఎం చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ముందు.. జానారెడ్డి కూడా తాను సీఎం కావడానికి ప్రయత్నాలు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట ఏర్పాటుకోసం జరుగుతున్న ఉద్యమం ఉధృతంగా ఉన్న కారణంగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన జానారెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే.. పార్టీకి ఎడ్వాంటేజీ అవుతుందనే ఆలోచన అధిష్ఠానం చేస్తున్నట్టుగా పుకార్లు కూడా వచ్చాయి. జానా రెడ్డికి సీఎం సీటు గ్యారంటీ అని అంతా అనుకున్నారు. ఆయన అందరి కంటె బలంగా అనుకున్నారు.

తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత.. ప్రమాణ స్వీకారోత్సవానికి ధరించడానికి జానారెడ్డి ప్రత్యేకంగా ఒక బంద్ గలా సూటు కూడా కుట్టించుకున్నారు. అన్ని రకాలుగానూ పదవిని స్వీకరించడానికి సన్నద్ధం అయ్యారు. కానీ.. అధిష్ఠానం మదిలో సమీకరణాలు ఎలా మారాయో తెలియదు గానీ.. జానారెడ్డి మంత్రిపదవికే పరిమితం కావాల్సి వచ్చింది. కిరణ్ సీఎం అయ్యారు.

తీరా ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన కూడా లేని జానారెడ్డి.. తనకు సీఎం కావాలనే కోరిక ఉన్నదనే సంగతి చెప్పడం చిత్రంగా ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు కొంచెం బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. తనలో పుష్కరం కిందటినుంచి ఉండిపోయిన ఆశను జానారెడ్డి ఇప్పుడు మళ్లీ కొత్తగా తిరగతోడుతున్నట్టుగా కనిపిస్తోంది.