రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబునాయుడి ఆరోగ్యంపై టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీని వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉన్నట్టు వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌పై జనంలో భారీగా సానుభూతి వస్తుందని టీడీపీ ఆశించింది. అయితే క్షేత్రస్థాయిలో బాబు అరెస్ట్‌పై ప్రజాస్పందన కొరవడింది. రోజులు గడిచేకొద్ది చంద్రబాబు అంశాన్ని జనం మరిచిపోయే పరిస్థితి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత నెల 10వ తేదీ నుంచి చంద్రబాబు వుంటున్నారు.
బాబు జైలు జీవితానికి 34 రోజులు. బాబు అరెస్ట్ అంశాన్ని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు తప్ప, సామాన్య ప్రజలు ఆలోచించడం మానేశారు. ఎన్నికల ముంగిట ఈ పరిణామాల్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. బాబు జైల్లో వుండగా రాజకీయంగా లబ్ధి పొందాలని టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును జైల్లోనే చంపేస్తారనే ప్రచారానికి టీడీపీ పూనుకుంది. ఇందుకు ఇటీవల బాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌లో వ్యూహం రచించారు.
డీహైడ్రేషన్ అంటూ మొదలైన ఆందోళన, రోజులు గడిచేకొద్ది స్టెరాయిడ్స్ ప్రయోగిస్తారనే వరకూ వెళ్లింది. తన భర్త బరువు ఐదు కిలోలు తగ్గారని, మరో రెండు కిలోలు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుందని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లోని నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా వుండడతో ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆమె భయాన్ని వ్యక్తం చేశారు. భయంకర పరిస్థితుల్లో తన భర్త ఉన్నాడని, ప్రాణాలకు ఏదైనా జరగొచ్చని భావోద్వేగాన్ని ఆమె ప్రదర్శించడం గమనార్హం.
ఇక లోకేశ్ మరో అడుగు ముందుకేసి ట్వీట్ చేశారు. స్టెరాయిడ్లు ప్రయోగించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణ చేశారు. అసౌకర్య పరిస్థితుల్లో బరువు తగ్గి ఇన్ఫెక్షన్లు, అలెర్జీలతో బాబు బాధపడుతున్నారని, వైద్యం అందించడంలో జైలు సిబ్బంది కుట్రపూరితంగా జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కుటుంబ సభ్యులే కాదు, రాష్ట్రమంతా ఏకకాలంలో టీడీపీ నేతలంతా ఇదే పల్లవి అందుకున్నారు. దీన్ని బట్టి ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వాటిల్లిందనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లి సానుభూతి పొందాలనే ఎత్తుగడ వేశారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. బాబు అరెస్ట్‌తో సానుభూతి లేకపోవడంతో ఆయన ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ కుట్రకు తెరలేపిందనే ప్రచారం ముందుకొచ్చింది.
గతంలో అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు మందుపాతర్లు పేలిస్తే, దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు 9 నెలల ముందు ఎన్నికలకు వెళ్లిన వైనాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. పాలకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా, సానుభూతి పవనాలతో గెలుపొందాలని ఎత్తుగడలు వేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా చెబుతున్నారు. ఇప్పుడు బాబు ఆరోగ్యంపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతాన్ని కూడా ఆ కోణంలోనే చూడాలని అధికార పార్టీ చెబుతోంది.