పవన్ గట్స్ ను మెచ్చుకుంటున్న సీపీఐ

ఒకప్పుడు వైభవోపేతమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు బూర్జువా పార్టీలను ఒకటి రెండు సీట్ల కోసం దేబిరించాల్సిన స్థితికి దిగజారిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఏపీకంటే…

ఒకప్పుడు వైభవోపేతమైన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు బూర్జువా పార్టీలను ఒకటి రెండు సీట్ల కోసం దేబిరించాల్సిన స్థితికి దిగజారిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఏపీకంటే ముందు జరుగుతున్న తెలంగాణా ఎన్నికల్లో గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కామ్రేడ్లు అనుకున్నారు. కేసీఆర్ కూడా వాళ్లకు ఆశలు కల్పించాడు.

అనుకోకుండా వచ్చిన మునుగోడు ఉపఎన్నికలో ఎర్ర పార్టీలు గులాబీ పార్టీకి సహకరించాయి. దీంతో ఆ పార్టీ గెలిచింది. కమ్యూనిస్టులు అప్పటి నుంచి కాస్త కేసీఆర్ కు అనుకూలంగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం నాలుగు సీట్లైనా తమకు కేసీఆర్ ఇస్తాడని ఆశపడ్డారు. కానీ మొండి చేయి చూపించాడు. ఇక ఇప్పుడు ఆంధ్రాలో ఆశలు పెట్టుకుంటున్నారు.

టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి తమను కూడా కలుపుకుంటే బాగుంటుందని ఆశ పడుతున్నారు. అలా చేస్తే వైసీపీని సులభంగా ఓడగొట్టొచ్చని అంటున్నారు. కమ్యూనిస్టుల సిద్ధాంతం తెలిసిందే కదా. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలుస్తారు. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజీపీతో పొత్తు పెట్టుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్న బీజేపీ సైలెంటుగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కాషాయం పార్టీతో దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు కనబడుతోంది. 

టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడనే పేరున్న సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పవన్ ను పొగిడాడు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను కేంద్రం పట్టించుకోవడం లేదు.. కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశాడు సీపీఐ రామకృష్ణ. అంతేకాదు జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధం ఉన్నామని అన్నాడు. 

పవన్‌ కళ్యాణ్ ఎన్డీఏ ఉండి టీడీపీకి సపోర్ట్ చేయడం హర్షించదగ్గ విషయమన్నాడు. ఆయన గట్స్ ను మెచ్చుకొని తీరాలన్నాడు రామకృష్ట. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా టిడిపితో పొత్తు పెట్టుకోవడంతో పవన్‌ను తాము అభిమానిస్తున్నామన్నాడు. 

రానున్న ఎన్నికల్లో బీజేపీని పక్కనబెట్టి టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఏం కలిసి పోటీ చేయాలని కోరాడు. ఈ పొత్తుతో జగన్‌ ను ఓడించగలమని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఏపీ నష్టపోతుందన్నాడు. కర్ణాటకలో ఎన్నికలు వస్తే.. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు రావడంతో కృష్ణాజలాల పునః పంపిణీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఏపికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పాడు రామకృష్ణ.