హిందూ మతాన్ని రాజకీయాలకు బీజేపీ వాడుకున్నంతగా దేశంలో మరో పార్టీ లేదు. ఇది జగమెరిగిన సత్యం. బీజేపీ రాజకీయ ఎదుగుదల హిందూ దేవుళ్ల నామస్మరణపై ఆధార పడి వుంది. ఆయోధ్యలో రాముడిని అడ్డు పెట్టుకుని అధికారాన్ని బీజేపీ సుస్థిరం చేసుకుంది. హిందు మతానికి ప్రతీకంగా చెప్పుకునే బీజేపీ…టెంపుల్ సిటీగా ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు పొందిన తిరుపతి నగరాభివృద్ధిని మాత్రం వ్యతిరేకించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
టీటీడీ బడ్జెట్‌లో ఒక శాతం నిధుల్ని తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలక మండలి సోమవారం తీర్మానించింది. దీన్ని గతంలో టీటీడీ ఈవోగా , విభజిత ఏపీ చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు, అలాగే తిరుపతి బీజేపీ నాయకులు విమర్శించడం గమనార్హం. పచ్చ కళ్ల వారికి దేశమంతా అట్లే కనిపించే చందంగా.. హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీకి, ఇతరులు ఏం చేసినా అట్లే కనిపిస్తోంది.
“స్థానికంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి టీటీడీ నిధులు మంచినీళ్లలాగా ఖర్చు పెడతారు. ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వచ్చి ఖర్చులు చేయటం ద్వారా స్థానిక సంస్థలకు గణనీయంగా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంలో ఏ శాతమైనా టీటీడీకి కేటాయిస్తున్నారా? అలా చేయనప్పుడు టీటీడీ నిధులను స్థానిక సంస్థలకు కేటాయించే అధికారం పాలకమండలికి ఎక్కడ నుంచి వస్తుంది?” అని ఐవైఆర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం బీజేపీలో వున్న సంగతి తెలిసిందే. ఇంతకూ తిరుపతిని ఆధ్మాత్మిక క్షేత్రంగా ఐవైఆర్ గుర్తిస్తారా? లేదా? ఆ నగరం పరిశుభ్రతలో దేశంలోనే ఆదర్శంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారా? లేదా? అలాంటప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు ఉన్న నిధులు, అలాగే పారిశుధ్య కార్మికులు తగినంతగా ఉన్నారా? లేదో? తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదా? తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో ఉదయం, సాయంత్రం వేళల్లో పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తించడానికి టీటీడీ నిధులు కేటాయించనుంది.
టీటీడీ నిధులు ఎందుకు ఉపయోగించాలని అనుకుంటున్నారో తెలుసుకోకుండా, రాజకీయ విమర్శలు చేయడం సబబా? తిరుపతి నగరాన్ని క్లీన్‌గా ఉంచాలని కోరుకోవడం స్థానిక నాయకులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంగా కనిపిస్తోందా? పారిశుధ్య చర్యలు చేపట్టడం కూడా ఐవైఆర్ దృష్టిలో మంచినీళ్లలాగా ఖర్చు చేయడంగా తోస్తోందా?
ఎక్కువ సంఖ్యలో యాత్రికులు తిరుపతికి వస్తుంటారని ఆయన అన్నారు. యాత్రికుల రాకతో స్థానికంగా తిరుపతిలోని వ్యాపార సంస్థలకు బాగా ఆదాయం వస్తుందని , అందులో ఏమైనా టీటీడీకి ఇస్తున్నారా? అని ఐవైఆర్ ప్రశ్నించడం వితండ వాదం తప్ప, అందులో పసలేదు. టీటీడీకి ఫలానా వాళ్లే విరాళాలు ఇస్తున్నారని ఎవరూ చెప్పలేరు. ప్రతి హిందువు, అలాగే మతాలకు అతీతంగా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు విరాళాలు ఇస్తుంటారు.
తిరుపతిని, టీటీడీని వేరు చేసి ఐవైఆర్ చూడడం ఆయన హ్రస్వ దృష్టిని ప్రతిబింబిస్తోంది. హిందూ మతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు. అదేంటో గానీ, అందుకు విరుద్ధంగా ఆయన రాజకీయ కోణంలో చూడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీటీడీ నిధులతో ఎక్కడో గుజరాత్, జమ్ము కశ్మీర్‌లలో గుళ్లు నిర్మిస్తే మాత్రం…ఐవైఆర్‌కు ఓకేనా? తిరుమలేశుని పాదాల చెంత ఉన్న తిరుపతిని పరిశుభ్రంగా ఉంచుకోడానికి టీటీడీ నిధులు కేటాయిస్తే మాత్రం తప్పా? ఇదెక్కడి విడ్డూరం?
ఐవైఆరే అనుకుంటే, ఆయనకు మించి ఒక బీజేపీ నాయకుడు తిరుపతిలో ఉన్నాడు. ఈయన కూడా తిరుపతి నగరాభివృద్ధి కుదరదని వాదిస్తున్నాడు. భగవంతుడిపై నమ్మకం లేని వారు అధికారంలో వుంటే ఇలాగే వుంటుందని రాగాలు తీస్తున్నాడు. గరుడ వారధికి 500 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ఖర్చు పెట్టారని ఆరోపిస్తున్నాడు. విషయం ఏమంటే ఈయన గారు టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడే తిరుపతి నగరంలో రోడ్ల నిర్మాణానికి తీర్మానించారు. అప్పుడు కనిపించని తప్పులు, ఇప్పుడు కనిపించడం ఏంటో అర్థం కాదు.
తిరుపతిలో బీజేపీని అభివృద్ధి చేయవయ్యా అంటే…. అబ్బే అది మన పనికాదంటాడు. ఎంత సేపూ తిరుమల శ్రీవారి దర్శనాలు, హిందూమతం సెంటి మెంట్ పేరుతో బ్లాక్ మెయిల్ చేయడమే ఈయనగారి దినచర్య. తిరుపతిలో ఈయనకు ముద్దు పేరు ఏంటంటే..బొకేల ప్రకాశం. ఎందుకంటే… ఈయన కనిపించేది తిరుపతి విమానాశ్రయం, లేదా టీవీ డిబేట్లలో మాత్రమే.
సుపథం టికెట్లు మొదలుకుని , బ్రేక్, సుప్రభాతం, అభిషేకం తదితర స్వామివారి పవిత్ర దర్శనాలకు సంబంధించి టికెట్లను అమ్ముకోవడంలో తమ వాడు సిద్ధహస్తుడని స్వయాన బీజేపీ నేతలే ఆరోపిస్తుంటారు. హిందూమతంపై ఈయనకు ప్రత్యేక ప్రేమ అంటూ ఏమీ వుండదు. ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందిన బీజేపీ నేతల్లో ఇతనే ఫస్ట్ అండ్ లాస్ట్ అని ఆ పార్టీ నేతల అంతర్గత చర్చల్లో చెబుతుంటారు.
నిన్నమొన్నటి వరకూ ఆయన గారి తిరుమల దర్శన వ్యాపారం భానుడి వెలుగును తలపించేది. ఇప్పుడు దర్శన వ్యాపారానికి కోత పడింది. దీంతో టీటీడీపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని సమాచారం. తిరుపతిలో పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించడాన్ని రాజకీయంగా ఆయుధంగా మలుచుకోవాలని చూస్తున్నాడు. అయితే తాను తిరుపతి నివాసిగా ఉండి , ఆ ఆధ్యాత్మిక క్షేత్రం అభివృద్ధిని అడ్డుకుంటున్నాననే స్పృహ కూడా కోల్పోయాడు. టీటీడీ నిధుల ఖర్చు గురించి భారీ డైలాగ్‌లు మాని, చేతనైతే సహకరించడం లేదా, మౌనం పాటిస్తే తిరుపతి ప్రజానీకం మెప్పు పొందుతానని ఇప్పటికైనా ఆ నాయకుడు గుర్తించాలి. లేదంటే బీజేపీకి పట్టిన అభివృద్ధి నిరోధక బురదను సైతం పారిశుధ్య కార్మికులు కడిగిపారేస్తారు జాగ్రత్త!