గత నెల 14న ఢిల్లీ వెళ్లిన లోకేశ్, ఎట్టకేలకు 21 రోజులకు ఏపీలో అడుగు పెట్టారు. దీంతో ఆయన్ను మళ్లీ ఎప్పుడు చూస్తామో అనే బెంగతో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక తమను విడిచి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉండదని ఆశించిన టీడీపీ శ్రేణులకు లోకేశ్ నిరాశ మిగిల్చారు. ఆయన వచ్చినంత వేగంగా, తిరిగి ఢిల్లీ వెళ్తారనే సమాచారం టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబునాయుడిని లోకేశ్, ఆయన తల్లి, భార్య కలవనున్నారు. చివరిగా బాలకృష్ణ, పవన్‌తో కలిసి చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చిస్తూ గడిపారు. ఎలాగైనా తన తండ్రిని మచ్చలేని నాయకుడిగా బయటికి తీసుకొస్తానని లోకేశ్ ధీమాగా చెబుతున్నారు. మరోవైపు లోకేశ్‌ను కేసులు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 10న ఆయన సీఐడీ విచారణ ఎదుర్కోవాల్సి వుంది. అయితే ఈ లోపు ఢిల్లీ వెళ్లి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నెల 9న చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. దీంతో 8న ఢిల్లీ వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లోకేశ్ షెడ్యూట్‌ను టీడీపీ విడుదల చేసింది.
చంద్రబాబుతో లోకేశ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేనతో టీడీపీ పొత్తు ఖరారు కావడంతో భవిష్యత్ కార్యాచరణపై బాబు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. జనసేన ఆశలు, ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లు, అలాగే ఉమ్మడి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యకలాపాలు… అన్నింటికి మించి టీడీపీని ముందుకు నడపడంపై లోకేశ్‌కు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.