మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అభ్యంతరకర కామెంట్స్ ఇంకా రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా మంత్రి రోజాకు సాటి నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన ఖుష్బూ అండగా నిలవడం విశేషం. తమిళనాడుకు చెందిన ఖుష్బూ బీజేపీ నాయకురాలు కూడా.
రోజాపై బండారు వ్యాఖ్యలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు వెళ్లిన సంగతి తెలిసిందే. రోజా వ్యాఖ్యలను ఖండిస్తూ, అలాగే టీడీపీ చెంప చెళ్లుమనిపించేలా బండారుపై ఖుష్బూ మండిపడ్డారు. అసలు బండారు సత్యనారాయణమూర్తి ఒక మనిషిగా కూడా విఫలమయ్యారని ఆమె ఘాటు కామెంట్స్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే బండారు అనే మాజీ మంత్రి మనిషే కాదని ఆమె మాటల సారాంశం.
రోజా వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. రోజాపై మాజీ మంత్రి బండారు జుగుప్పాకర వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడ్డారు. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా? మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనమని ఆమె దుయ్యబట్టారు. మహిళలను గౌరవించేవారెవరూ బండారులా నోరు పారేసుకోరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండారు వెంటనే రోజాకి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంత వరకూ తన పోరాటం వుంటుందన్నారు. ఈ విషయంలో తన సంపూర్ణ మద్దతు రోజాకు వుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో మరి!