కంగారు పడాల్సిన అవసరం లేదు ఇదేమీ పవన్ కళ్యాణ్ భార్యలకు సంబంధించిన ప్రశ్న గాని, ఆయన తెలుగుదేశంతో కుదుర్చుకున్న పొత్తుల్లో ఎన్ని సీట్లు కోరబోతున్నారు.. అనే ప్రశ్న గాని కాదు. ఆ ప్రశ్నలకు ఆయన ఎటు తిరిగి సమాధానం చెప్పలేరు.
కాకపోతే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న చాలా సింపుల్గా కనిపించేదే కానీ… పవన్ కళ్యాణ్ కు మాత్రం విపరీతమైన కోపం తెప్పిస్తుంది. చిరాకు కలిగిస్తుంది. ఆ ప్రశ్న ఏమిటో అని ఆలోచిస్తున్నారా ఇంతకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు?
సాధారణంగా నాయకుడనే వాడికి ఒక నియోజకవర్గం ఉంటుంది. అక్కడినుంచి పోటీచేస్తుంటారు. అది రిజర్వు కావడం లాంటి పరిణామాలు జరిగితే.. పొరుగున్న ఉన్న నియోజకవర్గాలను అరుదుగా ఎంచుకుంటూ ఉంటారు. అలాంటిది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నివాసమే లేని వారికి కూడా ఏదో ఒక నియోజకవర్గం ఉంటుంది. కానీ నిర్దిష్టంగా ఇది మాత్రమే అనే లెక్క ఉండకపోవచ్చు.
ఎప్పుడు ఎక్కడ అనుకూలంగా గాలివీస్తోంటే.. అక్కడినుంచి పోటీచేసి పబ్బం గడుపుకుందామనే ఆలోచన ఉంటుంది. పవన్ కల్యాణ్ పరిస్థితి అచ్చంగా అదే. వారాహి యాత్రలో భాగంగా రకరకాలుగా రంకెలు వేస్తున్న పవన్ కల్యాణ్ అసలు ముందుగా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారో చెప్పాలని ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం అనే ప్రక్రియ కేవలం తన సొత్తు మాత్రమే అనుకునే పవన్ కల్యాణ్ బహుశా వారికి సమాధానం చెప్పకపోవచ్చు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ కు రెండు నియోజకవర్గాలనుంచి ఆహ్వానాలు ఉనాయి. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీచేయాలని ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పిఠాపురం నుంచి పోటీచేయాలని ముద్రగడ పద్మనాభం సవాళ్లు విసిరారు. అయితే ఆ రెండింటివైపు వెళ్లడానికి పవన్ కు ధైర్యం చాలకపోవచ్చు.
గాజువాక నుంచి తనను గెలిపించి ఉంటే విశాఖ అరాచకాలు అడ్డుకుని ఉండేవాడినని పవన్ కల్యాణ్ వారి మీద సానుభూతి వ్యక్తం చేశారు. అయినా సరే, గత ఎన్నికల్లో తనను చాలా ఘోరంగా ఓడించిన గాజువాక, భీమబరం నియోజకవర్గాలనుంచి పోటీచేయడానికి ఆయన సుముఖంగా ఉండకపోవచ్చు. ఆ మాటకొస్తే నారా లోకేష్ కు ఉన్న ధైర్యం కూడా పవన్ కల్యాణ్ కు లేదేమో అనిపిస్తుంది.
ఎందుకంటే.. తనను ఓడించిన మంగళగిరి నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీచేస్తానని లోకేష్ తేల్చి చెబుతున్నారు. కానీ అలాంటి మాట చెప్పగల తెగువ పవన్ కు లేదు. ఆయన తిరుపతినుంచి పోటీచేస్తారని కొన్నాళ్లు పుకార్లు వచ్చాయి.
అయితే ఇప్పుడు తన పార్టీకోసం సర్వే చేసిన సంస్థలతో.. తను ఎక్కడినుంచి గెలుస్తానో చెప్పాలని పవన్ వివరాలు సేకరిస్తున్నారట. అంటే ఆయన నియోజకవర్గం ఇప్పట్లో తేలదు. ఆయనకే జవాబు తెలియని ప్రశ్నను, ప్రత్యర్థులు అడిగితే ఆయనకు కోపం రాకుండా ఇంకేం అవుతుంది?
పవన్ ఎక్కడి నుంచైనా బరిలో దిగవచ్చు గానీ, అది ఖచ్చితంగా కాపు మెజారిటీ ఉండే నియోజకవర్గమే అయి ఉంటుందని మాత్రం.. అందరిలోనూ ఒక అభిప్రాయం ఉంది.