అదేమిటి .. ఈ ఇద్దరు నాయకుల మద్య అసలు పోటీ ఎలా సాధ్యమవుతుంది? చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన నాయకుడు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ పరిస్థితి గమనిస్తే ఆయనకు ఇప్పటిదాకా నియోజకవర్గం అంటూ లేదు.
గతంలో ఓడిపోయిన గాజువాక, భీమవరం నుంచి మళ్లీ బరిలోకి దిగే సాహసం ఆయన చేయరు. సర్వే సంస్థల ద్వారా రాష్ట్రమంతా సర్వే చేయించుకుంటూ.. తాను ఏ స్థానం నుంచి పోటీచేస్తే తప్పకుండా గెలుస్తానో అంచనాలు వేసుకుంటున్నారు పవన్ కల్యాణ్. అంటే ఇంకా తన నియోజకవర్గం విషయంలో ప్రాబబులిటీనే నడుస్తోంది తప్ప ఫైనలైజ్ కాలేదు. ఆయన ప్రధానంగా కాపు మెజారిటీ ఉన్న నియోజకవర్గం కోరుకుంటారు. నర్సీపట్నం అలాంటిది కాదు గనుక అక్కడ బరిలోకి దిగరు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా జరుగుతుందా? అని అనుకుంటున్నారా? ఇది ఎమ్మెల్యే పదవికోసం జరిగే పోటీ కాదు.
పొత్తులు ఒకవేళ కుదిరితే, వారి వ్యూహం ఒకవేళ ఫలిస్తే, చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఒకవేళ ఏర్పడితే.. అప్పుడు హోం మంత్రిత్వ శాఖను ఎవరు తీసుకోవాలనే విషయంలో ఈ ఇద్దరి మధ్య పోటీ జరిగేలా కనిపిస్తోంది.
తాజాగా ఒక కార్యక్రమంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. పోలీసులను తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. అందరి పేర్లు జాబితా రాసి పెట్టుకుంటున్నాను అని, మరో ఆరు నెలల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు ఒక్కొక్కరిని ఏరి మరీ వారికి తగిన బుద్ధి చెబుతాం అని అయ్యన్నపాత్రుడు బెదిరిస్తున్నారు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తనకు హోం మంత్రిత్వ శాఖ కావాలని, లా అండ్ ఆర్డర్ తన చేతిలో ఉండాలని ఆయన కోరుతున్నారు. మా పార్టీ అధికారంలోకి రాగానే నాకు షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి.. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెప్తా అని అయ్యన్నపాత్రుడు హెచ్చరిస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ కూడా.. చంద్రబాబు వద్ద పొత్తుల్లో భాగంగా.. గెలిచిన తర్వాత తనకు హోం మంత్రిత్వ శాఖ కావాలనే బేరం పెట్టుకున్నట్టుగా గుసగుసలున్నాయి. సాధారణంగా సీఎం తర్వాత అంతటి ఇంపార్టెంట్ మంత్రిగా హోం శాఖను పరిగణిస్తారు. తాను కానిస్టేబుల్ కొడుకునని చాలాసార్లు చెప్పుకునే పవన్ కల్యాణ్.. తనకు హోం శాఖ కావాలని అడిగినట్టుగా తెలుస్తోంది.
ఒక వేళ వారి ఆశలు ఫలించి.. పొత్తుల్లో తెదేపా జనసేన అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. పవన్ కల్యాణ్- అయ్యన్నపాత్రుడుల్లో ఎవరు హోం శాఖ దక్కించుకుంటారో చూడాలి.