ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. యూనిట్ కు చెందిన కీలక సభ్యులంతా హాజరయ్యారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా అంతా వచ్చారు, ఒక్కరు తప్ప. ఆమె అలియా భట్. ఈ గైర్హాజరీ వెనక చాలా పెద్ద మేటర్ ఉన్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీకి అలియాను కూడా ఆహ్వానించారట. అట్నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే.. ఆమె పెళ్లి పనుల్లో బిజీగా ఉందని.
అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 17న అలియాభట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నారట. ప్రస్తుతం బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న ఊహాగానం ఇది. దీనికి సంబంధించి పెళ్లి షాపింగ్ లో అలియాభట్ బిజీగా ఉందనేది తాజా కబురు. ఎప్పట్లానే ఈ మేటర్ పై అటు అలియాభట్ కుటుంబం, ఇటు రణబీర్ కుటుంబం మౌనంగా ఉండిపోయింది.
వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి కూడా చేసుకున్నారని కొందరు అంటారు. అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని మరికొందరు అంటారు. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న లాజిక్ ఏంటంటే.. అలియా కుటుంబంలో ఎవరో ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందంట. అలియా పెళ్లి చూసి కన్నుమూయాలనేది ఆమె కోరిక అంట. అందుకే అలియా ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ కథనాలు వస్తున్నాయి.
రీసెంట్ గా కత్రినా కైఫ్-విక్కీ కౌషల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు అలియా-రణబీర్ పెళ్లితో మరోసారి బాలీవుడ్ కు ఆ వైభవం రాబోతోందన్నమాట. ఈ జంట కలిసి నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.